ఒకే గొడుగు కింద సోషల్, ఎలక్ట్రానిక్ మీడియా!!

హైదరాబాద్:

పాత్రికేయుల సంక్షేమానికి కృషి చేయడమే తమ బాధ్యత అని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ చంద్రమౌళి కుమార్ ప్రసాద్ అన్నారు. జర్నలిస్టులు ఎక్కడైనా ఇబ్బందులకు గురైనా, వారిపై ఒత్తిడి ఉంటే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. పాత్రికేయులపై వేధింపులకు స్పందించి తామే సుమోటోగా కేసు నమోదు చేస్తామన్నారు. మీడియాతో మాట్లాడిన ఆయన..వార్తలు రాసే ముందు పాత్రికేయులు ఒకటికి రెండుసార్లు వాస్తవాలు తెలుసుకొని ప్రచురించాలని కోరారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని రాజకీయ నేతలకు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఆరోపణలు ప్రచురించే ముందు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన పాత్రికేయులకు సూచించారు.సోషల్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఒకే గొడుకు కిందకు తీసుకు రావాలని ప్రభుత్వానికి సిఫారసు చేస్తున్నామని తెలిపారు. పత్రికలకు ప్రభుత్వం నుంచి సహకారం లభించే నూతన విధానాన్ని రూపొందిస్తున్నామన్నారు. దేశంలోని వివిధ పత్రికలపై దాదాపు 37 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. రెండు రోజులుగా హైదరాబాద్ వేదికగా కేసుల విచారణ జరిగిందని తెలిపారు ఈ కేసులో తొమ్మిది మంది ఫిర్యాదుదారులు పత్రికా రంగానికి చెందిన వారని, 27 మంది సాధారణ పౌరులు అని ఆయన తెలిపారు. తమిళనాడు, తెలంగాణలో జర్నలిస్టుల అరెస్టులపై తాము రాష్ట్ర ప్రభుత్వాల నుండి నివేదిక కోరామన్నారు. హైదరాబాద్ కేంద్రంగా నడిచే దినపత్రికపై నమోదైన ఫిర్యాదు ఆధారంగా వారిపై విచారణ జరిపామన్నారు. వారి సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో సదరు దినపత్రికను సెన్సార్ చేస్తున్నామని చెప్పారు.