ఓట్ల కోసం మురికి పాట్లు.

కరాచీ:
ఓట్ల కోసం రాజకీయ నేతలు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడూ మురికివాడల్లోకి అడుగు పెట్టనివారు ఎన్నికలనగానే ఇల్లిల్లూ తిరిగి ఓట్లడుగుతారు. సమస్య చెప్పడానికి వెళ్తే వినేందుకు సమయం లేదని చెప్పేవాళ్లు తాము ఎన్నికైతే అన్ని సమస్యలను పరిష్కరిస్తామని చెబుతారు. తమ అధికారం, పలుకుబడి అన్నీ పక్కనపెట్టి జనంలో ఒకడిగా కలిసిపోయేందుకు ప్రయత్నిస్తారు. ఓటర్లని ఆకట్టుకొనేందుకు టీ బంకులో చాయ్ వాలా అవుతారు. ఇస్త్రీ చేస్తారు. చెత్త ఊడుస్తారు. ఇంకెన్ని పనులైనా చేస్తారు. సరిగ్గా ఇలాంటి మురికి రాజకీయమే చేస్తున్నాడు పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో ఓ నేత. ఆయాజ్ మెమన్ మోతీవాలా అనే ఓ నాయకుడు ఆమ్ ఆద్మీ పాకిస్థాన్ తరఫున స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. కరాచీలో ఏ మూల చూసినా అపరిశుభ్రత, కంపుకొట్టే చెత్తకుప్పలు, రోడ్లపై చెరువులని తలపించే మురుగునీరు వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో వీటిని హైలైట్ చేసి ఈ సమస్యలన్నిటినీ తొలగిస్తానని చెప్పాడు. తనకు ఆ సమస్యలు తెలుసని ఓటర్లకి చెప్పుకోడానికి ఈయన ఓ చిత్రమైన పద్ధతి ఎంచుకున్నాడు. డ్రెయినేజీ మ్యాన్ హోల్ లోకి దిగి కూర్చున్నాడు. రోడ్లపై ప్రవహిస్తున్న మురుగునీటిలో చిరునవ్వులు చిందిస్తూ పడుకున్నాడు. చెత్తకుప్పల్లో కాపురం పెట్టాడు. చివరికి చెత్తకుప్పల్లోనే తిండీతిప్పలు, నిద్ర అన్నీ. ఈ విచిత్ర విన్యాసాలన్నీ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో, తన ఫేస్ బుక్ పేజీలో పెట్టాడు. అధికార, ప్రతిపక్ష పార్టీలేవీ కరాచీ మౌలిక సదుపాయాలు, వాటి నిర్వహణ గురించి పట్టించుకోలేదని ఆరోపణలు గుప్పించాడు. అప్పటికీ పెద్దగా పాపులారిటీ రాకపోవడంతో పాకిస్థాన్ జాతీయ జెండా చేతిలో పట్టుకొని మురికినీళ్లు తాగుతూ చేసిన ఫీట్ జనాల్లో సూపర్ హిట్టయింది. అంతా ఆయాజ్ మెమన్ మోతీవాలా గురించి చర్చించుకోసాగారు. కరాచీ గల్లీ గల్లీలోని సమస్యలు తెలిసిన తాను ఎన్నికైతే నగరానికి మంచి రోజులు తెస్తానని చెప్పాడు.మోతీవాలా విచిత్ర విన్యాసాలు చూసిన ప్రజల్లో కొందరు నవ్విపోతే మరికొందరు ఏదో చేస్తాడేమోననే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఆయాజ్ మెమన్ ఫోటోలకిచ్చిన పోజులు చూసిన కొందరు మాత్రం ఇదంతా రొటీన్ పబ్లిసిటీ స్టంట్ అని కొట్టిపారేస్తున్నారు. మోతీవాలా చేస్తున్న దారుణమైన డ్రామాలు చూడలేకపోతున్నామని కొందరు కామెంట్ చేస్తున్నరు.