కట్టుకున్నవాడే కాల యముడా?

నాలా వద్ద మూటలో భార్య మృతదేహం
పరారీలో భర్త.
హైదరాబాద్‌:
దుబాయ్‌ నుంచి వచ్చాడు.. భార్యను వివిధ వస్తువుల కొనుగోలు కోసమంటూ తీసుకెళ్లాడు. ఆ తర్వాత అతను అదృశ్యమవడం, ఆమె మృతదేహం ఓ కాలువ వద్ద మూటలో కనిపించడం పాతనగరంలో సంచలనం కలిగించింది. భర్తే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబీర్‌పురా ఠాణా పరిధిలో జరిగిన ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి.. నారాయణగూడ కింగ్‌కోఠి ప్రాంతంలో నివసిస్తున్న జబానాజ్‌(30)కు ఆజంపురా డివిజన్‌ ఫర్హత్‌నగర్‌కు చెందిన అక్బర్‌అలీఖాన్‌తో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. ఖాన్‌ రెండేళ్లుగా దుబాయ్‌లో ఉద్యోగం నిమిత్తం ఉంటున్నాడు. నాలుగు రోజుల కిందట నగరానికి వచ్చాడు. రంజాన్‌ మాసం సందర్భంగా షాపింగ్‌ కోసమని ఈనెల 19న అత్తగారి ఇంట్లో ఉన్న తన భార్యను తీసుకుని వెళ్లాడు. రాత్రి వరకు ఎలాంటి సమాచారం లేకపోవడం, కుమార్తె చరవాణి స్విఛ్‌ ఆఫ్‌ రావడంతో అనుమానం వచ్చిన తల్లి షబ్నం నారాయణగూడ ఠాణాలో ఫిర్యాదు చేసింది. ఫర్హత్‌నగర్‌లో హత్య జరిగిందని, శవాన్ని కాలువలో పడేశారని ఆదివారం సమాచారం రావడంతో స్థానికులు, డబీర్‌పురా పోలీసులు అక్కడ గాలించారు. కాలువ పక్కనే దొరికిన మూటలో శవం ఉండటంతో పోలీసులు మృతురాలి తల్లికి సమాచారం అందించారు. ఆమె మృతదేహాన్ని గుర్తించి డబీర్‌పురా ఠాణాలో ఫిర్యాదు చేశారు. అక్బర్‌అలీఖాన్‌ తన భార్యను హతమార్చి తిరిగి దుబాయ్‌కి వెళ్తున్నట్లు కుటుంబీకులకు చరవాణి ద్వారా తెలిపాడని ప్రత్యక్ష సాక్షులంటున్నారు. అలీఖాన్‌ పరారీలో ఉన్నందువల్ల కేసుకు సంబంధించిన వివరాలు తెలియరాలేదని సీఐ వెంకన్న నాయక్‌ తెలిపారు. దుబాయ్‌కి పరారయ్యాడా, లేదా తెలుసుకునేందుకు విమానాశ్రయం అధికారులకు సమాచారం అందించి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.