కడప ఉక్కు ఆంధ్రుల హక్కు. -చంద్రబాబు.

విజయవాడ:
కడప ఉక్కు ఫ్యాక్టరీని సాధించి తీరుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఉక్కు కర్మాగారం కోసం టీడీపీ అలుపెరుగని పోరాటం చేస్తోందని అన్నారు. ఆరోగ్యం బాగోలేకపోయినా బీటెక్ రవి ఏడు రోజులు నిరాహార దీక్ష చేశారని… 11 రోజులుగా సీఎం రమేష్ దీక్ష చేస్తున్నారని చెప్పారు. సీఎం రమేష్ ఆరోగ్యం క్షీణించిందని తెలిపారు. దీక్ష సంకల్పాన్ని దెబ్బతీసేందుకు విపక్ష పార్టీలు యత్నిస్తున్నాయని… కుట్రలకు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. సాధ్యాసాధ్యాలను పరిశీలించి స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలని విభజన చట్టలో ఉన్నప్పటికీ… కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. ఉక్కు ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని మెకాన్ సంస్థ నివేదిక ఇచ్చిందని చెప్పారు. నాలుగైదు రోజులు కూడా దీక్ష చేయలేని నేతలు, సీఎం రమేష్ దీక్షపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయకుండా వైసీపీ నాటకాలు ఆడుతోందని దుయ్యబట్టారు. కేసుల మాఫీ కోసం కేంద్ర ప్రభుత్వంతో లాలూచీ పడి, రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని అన్నారు. కేసులకు భయపడి కేంద్రానికి దాసోహం అంటున్నారని చెప్పారు. అవినీతి కేసుల్లో ఇరుక్కుని, వాటినుంచి బయటపడేందుకు యత్నిస్తున్న వారు మన రాష్ట్రంలో ఉన్నారని… అలాంటివారి వల్లే ఏపీపై కేంద్రానికి చులకన భావం ఏర్పడిందని అన్నారు. కడప ఉక్కు ప్లాంటు హామీని ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ కేంద్ర ఉక్కు శాఖా మంత్రికి మరోసారి గుర్తు చేశారు. ఇందుకు టైమ్స్ ఆఫ్ ఇండియాలో మంత్రి బీరేందర్ సింగ్ వ్యాఖ్యలతో వచ్చిన వార్త ఆధారంగా నిలిచింది. ‘దేశంలో ఉక్కు డిమాండ్ పెరిగేందుకు అపార అవకాశాలున్నాయని మంత్రి చౌదరి బీరేంద్ర సింగ్ అన్నారు. అంతర్జాతీయ సగటు తలసరి ఉక్కు వినియోగం 208 కిలోలు ఉండగా, దేశంలో తలసరి ఉక్కు వినియోగం 68 కిలోలే ఉందని పేర్కొన్నారు’ అంటూ టైమ్స్ కథనంలో ఉంది. ఈ కథనం లింక్ ను తన ట్విట్టర్ ఖాతాలో లోకేశ్ పోస్ట్ చేశారు. ‘‘అంతర్జాతీయ తలసరి ఉక్కు వినియోగం 208 కిలోలకు భారత సామర్థ్యం చేరేందుకు అపార అవకాశాలు ఉన్నాయి, కానీ, కడపలో ఉక్కు ప్లాంట్ ఏర్పాటు వంటి అవకాశాలను కాలదన్నితే భవిష్యత్తు డిమాండ్ ను భారత్ చేరుకునేది ఎలా?’’ అని నారా లోకేష్ ప్రశ్నించారు. కడప ఉక్కు ప్లాంటు ఏర్పాటు డిమాండ్ ను పరిశీలించి రాజకీయాలకు అతీతంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.