కమ్యూనిస్టుల మరో చారిత్రక తప్పిదం. ‘గొంతులేని వారికి’ గొంతు ఏదీ?

ఎస్.కే.జకీర్.
“voice for voice less people”
“గొంతులేని వారి గొంతుక” గా కమ్యూనిస్టులు తమను తాము క్లయిమ్ చేసుకుంటారు.అలా మార్కెటింగ్ చేసుకుంటారు.ప్రజల మన్ననలు పొందుతారు.తెలుగు రాష్ట్రాలలో ఉభయ కమ్యూనిస్టు పార్టీలు మరోసారి చారిత్రక తప్పిదానికి పాల్పడినట్టు ఆ పార్టీల అభిమానుల ఆవేదన. సీపీఐ కి చెందిన 99 టి.వి.,సిపిఎం కు చెందిన 10 టి.వి.పేరిట ప్రజల కోసం న్యూస్ చానళ్ల ను ప్రారంభించారు.
తమ వార్తలు ఎవరు చూపెట్టడం లేదని సొంత చానళ్లను మొదలు పెట్టిన కమ్యూనిస్టులు తమ వల్ల కాదు అని ఇప్పుడు చేతులెత్తేశారు. ఈ రెండు ఛానెల్స్ అమ్మకాల ప్రక్రియ బుధవారం పూర్తయినట్టు తెలుస్తోంది. 99 టీవీ ఖేల్ ఖతం… చేతులు మారిపోయింది. పార్టీ కార్యకర్తలు ఇచ్చిన డబ్బును, పెట్టుకున్న నమ్మకాల్ని పోగొట్టుకున్న సీపీఐ తన టీవీ చానెల్‌ను అమ్మేసుకుంది 99 టీవీ బేరం పూర్తయిపోయింది. 12 కోట్లకు 99 టి.వి.అమ్ముడుపోయినట్టు సమాచారం. 4, 5 నెలలుగా దాన్ని అమ్మడానికి ఆ పార్టీ చేసిన ప్రయత్నాలు, ఆ బేరాల్లో విచిత్రమైన ట్విస్టులు పార్టీ నాయకత్వం పోకడల పట్ల, నిర్వహణ సామర్థ్యాల పట్ల ఓ రకమైన విరక్తినే కలగజేస్తాయి. ’99టీవీ’ బేరం కొద్దిరోజులుగా ఊగిసలాడుతున్నది. పవన్ కల్యాణ్ కొనటానికి ఉత్సాహపడుతున్నాడనే వార్తలు కూడా వచ్చాయి.
కానీ బేరం కుదరలేదు. మరో సినిమా ప్రముఖుడు కూడా ట్రై చేశాడు. ఎట్టకేలకు పీఆర్పీ మాజీ నాయకుడు తోట చంద్రశేఖర్ తదితరులు 99 టి.వి.ని కొన్నట్టు తెలిసింది.
“news is people” ప్రజలే వార్తలు. శీర్షికన గంభీరంగా తీసుకువచ్చిన సీపీఎం ‘టెన్ టీవి’ని అమ్మేసుకున్నది.నడిపించలేకపోతే అమ్మేసుకోవడమే, వదిలేసుకోవడమే పరిష్కారమా..? చేజేతులా తమ పార్టీల ‘వాయిస్‌’ను తామే నొక్కేసుకోవడం సామర్థ్యమా..? లోపాలు వెతుక్కుని, పరిష్కార మార్గాలు అన్వేషించి, ఓ గాడిన పడేసే ప్రయత్నాలు గాకుండా పూర్తిగా వదిలించుకోవడం అంటే ఆ మీడియా హౌజుల కోసం విరాళాలు ఇచ్చిన ప్రజలు, కార్యకర్తల నమ్మకాన్ని వమ్ము చేయడం కాదా..? పార్టీ వాయిస్ జనంలోకి తీసుకుపోవడం అనేది కూడా పార్టీ కార్యక్రమమే… విఫలమో, సఫలమో అది కుంగిపోకుండా, వెనక్కి తగ్గకుండా నడిపించాల్సిన కార్యక్రమం… నడిపించటానికి ప్రయత్నించాల్సింది. ‘టెన్‌టీవీ’ కథే ఘోరం… వేల మంది దగ్గర పెట్టుబడిగా దాదాపు 150 కోట్ల డబ్బులు వసూలు చేసింది. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు చేసి, చానెల్ అమ్మేసి, వేల మంది ఇచ్చిన తమ చెమట కాసులకూ సీపీఎం అన్యాయం చేసినట్టు కాదా..? ప్రజలకు జవాబు చెప్పాలీ అనే కనీస బాధ్యతను కూడా అది విస్మరిస్తున్నది.ఇక్కడ సీపీఐ గానీ, సీపీఎం గానీ కోల్పోతున్నవి పత్రికలు, చానెళ్లు కావు. తమ విశ్వసనీయతను! నిష్టురమైనా ఇదే నిజం!