కశ్మీర్‌లో గవర్నర్ పాలన.

న్యూడిల్లీ;
ముఖ్యమంత్రి పదవికి మెహబూబా ముఫ్తీ రాజీనామా చేయడంతో జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధించారు. పీడీపీ ప్రభుత్వం ఉన్నపళంగా కూలిపోవడంతో గవర్నర్ ఎన్ఎస్ఓహ్రా చేసిన సిఫార్సుపై రాష్ట్రపతి రామ్‌నాథ్కోవింద్రాజముద్ర వేశారు. జమ్మూకశ్మీర్‌లో గవర్నర్ పాలన విధిస్తూ జారీ చేసిన సిఫార్సు ప్రతిని కేంద్ర హోంశాఖకు కూడా పంపించారు. అనూహ్య నిర్ణయంతో జమ్మూ కశ్మీరు ప్రభుత్వాన్ని బీజేపీ మంగళవారం కుప్పకూల్చింది. పీడీపీతో మూడేళ్ల మూడు నెలల బంధానికి రాం రాం చెప్పింది. భాగస్వామ్య పక్షానికి ఒక్క మాట కూడా చెప్పకుండా.. ముఖ్యమంత్రికి కనీస సమాచారం ఇవ్వకుండా.. నేరుగా గవర్నర్‌ను కలిసి మద్దతు ఉపసంహరణ లేఖ ఇచ్చేసింది. కశ్మీరులో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి. ముఖ్యమంత్రి మెహబూబాకు గవర్నర్‌ ‘సమాచారం ఇచ్చిన’ తర్వాత బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. ముఫ్తీ ప్రభుత్వంలో కొనసాగలేమని తేల్చి చెప్పారు. రెండు పార్టీల మధ్య సంధి కుదిర్చి.. మూడేళ్లపాటు జమ్మూ కశ్మీరులో చక్రం తిప్పిన రాంమాధవే స్వయంగా కటీఫ్‌ను ప్రకటించడం విశేషం. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో కశ్మీరులో ప్రభుత్వ ఏర్పాటుకు ఏ పార్టీ సిద్ధంగా లేదు. పీడీపీతో పొత్తు పెట్టుకోబోమని కాంగ్రెస్‌ స్పష్టం చేసింది. ఫలితంగా జమ్మూ కశ్మీరులో గవర్నర్‌ పాలన అమలులోకి వచ్చింది.