కాంగ్రెస్ ను రద్దు చేయాలని గాంధీ చెప్పినా కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ నరహంతక పార్టీ. – మంత్రి కేటీఆర్.

భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీను రద్దు చేయాలని మహాత్మాగాంధీ కోరినా ఇంకా ఆ పార్టీని కొనసాగిస్తున్నారని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలపై ఆయన తేవర్ స్థాయిలో విరుచుకు పడ్డారు.
తెలంగాణ భవన్ లో సోమవారం నాడు రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గంపా నాగేందర్, ప్రధాన కార్యదర్శి వడ్డి మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి లో చేరారు. ముందస్తు ఎన్నికలపై ఉత్తమ్ ది మేకపోతు గాంభీర్యం అని కేటీఆర్ అన్నారు. పోచమ్మ గుడికి తీసుకువెళ్లిన మేకపోతు అలానే చేస్తుందని వ్యంగాస్త్రాలు సంధించారు.ముందస్తు ఎన్నికలకు వెళితే ఏం జరుగుతుందో కాంగ్రెస్ కు, ప్రజలకు, టిఆర్ ఎస్ కు తెలుసునాని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వంద సీట్లు దాటి గెలిచి చూపిస్తామని తెలిపారు. వారం, పది రోజుల్లో రైసుమిల్లర్లతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మొదటి ఆరు నెలల్లోనే కరెంట్ సమస్యను పరిష్కరించాం. ఇది నాయకత్వ పటిమ కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. గతంలో దేశానికి అన్నం పెట్టే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అయితే ఇప్పుడు దేశానికి ధాన్యబాంఢాగారం గా తెలంగాణ మారిందని మంత్రి చెప్పారు. అరవై ఏళ్ల దరిద్రాన్ని తమకు అంటగట్టి ఈ నాలుగేళ్లలో ఏం అభివృద్ధి చేయలేదని మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు.
కాంగ్రెస్ మోసం, దగాను ప్రజలకు వివరించాలని కోరారు. కాంగ్రెస్ లో పది మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని కేటీఆర్ హేళన చేశారు. అవినీతి గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించడం లాంటిదన్నారు. ఆకాశం నుంచి పాతాళం దాకా అన్ని రంగాల్లో కాంగ్రెస్ ది కుంభకోణాల చరిత్ర అని కేటీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నరహంతక పార్టీ అని మంత్రి ఆరోపించారు. వందల మంది తెలంగాణ పోరాట యోధుల్ని కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ దని మండిపడ్డారు. కమిషన్ల సంగతి కాంగ్రెస్ దద్దమ్మలకు తెలుసు కానీ టిఆర్ ఎస్ కు తెలియదన్నారు. కొల్లాపూర్, దేవరకద్ర కు చెందిన కాంగ్రెస్ నేతలు కోర్టుకు వెళ్లి ప్రాజెక్టులపై కేసులు వేశారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ కు డిపాజిట్లు రావని తేలిపోవడంతో చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు.
కేసీఆర్ గుండె ధైర్యం వల్లనే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు సాధ్యమవుతోందని పార్లమెంటు సభ్యురాలు కవిత అన్నారు.