‘కాళేశ్వరం’ వివాదం ముగిసినట్లేనా!

మంథని;
కాళేశ్వర ఆలయ వివాదం ముగిసినట్లేనా? అనే ప్రశ్న తలెత్తుతుంది. తన చిన్ననాటి మిత్రుడైన వెంకటేశం కు కాళేశ్వర ముక్తీశ్వర ఆలయ చైర్మన్ పదవిని ముఖ్యమంత్రి కేసీఆర్’ బహూకరించారు.’ ఆయనకు ఆలయ ఈ.ఓ. శ్రీనివాసు కు మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయి. దీంతో ఈ.ఓ. శ్రీనివాస్ ను బదిలీ చేశారు. కాళేశ్వరం ఆలయ అభివృద్ధి కోసమంటూ ప్రభుత్వం 25 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. పాలకవర్గం లేకపోవడంతో.. అభివృద్ధి కుంటుపడుతుందని భావించిన క్రమంలో మంథని నియోజకవర్గానికి చెందిన నేతలు పలువురు ఆలయ చైర్మన్ పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. కానీ లాభంలేకపోయింది. ఈవిషయంలో మంథని ఎమ్మెల్యే పుట్టమధు కూడా తన అనుచరులకు పదవి ఇప్పించుకోవడంలో విఫలమైనారన్న ఆరోపణలెదుర్కొన్నారు. అనూహ్యంగా సీఎం బాల్యమిత్రుడు, సన్నిహితుడైన సిద్ధిపేటకు చెందిన బొమ్మరి వెంకటేశంకు పదవి కట్టబెట్టారు. సిద్ధిపేట నుంచి కాళేశ్వరంకు సుమారు 350 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఏకంగా సిద్ధిపేట వాసిని కాళేశ్వరం ఆలయం చైర్మన్ ను చేయడమేంటని అప్పట్లో వార్తాకథనాలు వచ్చాయి. ఆలయ చైర్మన్ తనను వేధిస్తున్నారంటూ ఆలయ ఈవో బుద్ధి శ్రీనివాస్ విలేకరుల సమావేశం పెట్టి మరీ కుండబద్ధలు కొట్టారు. తాను సీఎం సన్నిహితుడిననీ.. తనకు పెట్రోల్ బంకులు, రైస్ మిల్లులు వంటి చాలా పెద్ద వ్యాపారాలున్నప్పటికీ అవన్నీ వదులుకుని కాళేశ్వరంకు వస్తున్నాని ఆలయ చైర్మన్ చెబుతున్నారు. తన కారు కిరాయి, డ్రైవర్ బత్తా అంతా కలిపి.. 70 నుంచి 80 వేల దాకా ఖర్చవుతుంటే, కేవలం పదివేల రూపాయల అలవెన్స్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నట్టు చైర్మన్ బొమ్మరి వెంకటేశం తనపై విరుచుకుపడుతున్నట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. తన రాజకీయ స్వార్థం కోసం తనను బలి చేశారని ఆయన ఆరోపణ.