కాళేశ్వరం 19 ప్రాజెక్టుల సమ్మేళనం. రైతుల ఆత్మహత్యలకు విరుగుడు గానే ప్రాజెక్టు.-జాతీయ మీడియాతో మంత్రి హరీష్ రావు.

హైదరాబాద్;
దేశంలో విదర్భ తర్వాత అత్యధిక ఆత్మహత్యలు తెలంగాణలోనే జరుగుతున్నందున వాటికి విరుగుడుగా సీఎం కేసీఆర్ సోషల్ ఇంజనీరుగా మారి ఈ ప్రాజెక్టుకు రుపకల్పన చేశారని జాతీయ మీడియా ప్రతినిధులకు తెలంగాణా ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు తెలిపారు. జాతీయ మీడియా కు ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గోదావరి నది ఒడ్డున ఉన్న శివాలయం పేర కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నామని మంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టులో తొలి బ్యారేజీ అయినా మేడిగడ్డ బ్యారేజీ ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయని అయన తెలియాజేశారు. 141 టీఎంసీల నీటి నిల్వ తో 19 రిజర్వాయర్లు నిర్మిస్తున్నట్టు హరీశ్ రావు చెప్పారు. 22 లిఫ్టులు, 21 పంప్ హౌస్ లు నిర్మిస్తున్నామని తెలిపారు. 139 మెగావాట్ల పంపు ఈ ప్రాజెక్టులో వాడుతున్నాం. ఇది ప్రపంచంలోనే ఓ రికార్డు అని ఆయన వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 6 వేల మంది ఇంజనీర్లు, 25 వేల మంది లేబర్- కూలీలను వినియోగిస్తున్నామని వివరించారు. ఈ ప్రాజెక్టులో 4 కోట్ల 20 లక్షల 95 వేల సిమెంటు బస్తాలకు గానూ 3 కోట్ల 10 లక్షల సిమెంటు బస్తాలు వినియోగించామన్నారు.1832 కిలో మీటర్ల పొడవునా డిస్ట్రిబ్యూషన్ కాలువలు నిర్మిస్తున్నట్టు చెప్పారు. 1531 కిలో మీటర్ల గ్రావిటీ కాలువలు తవ్వుతున్నట్టు హరీశ్ అన్నారు. కాళేశ్వరం లో భాగంగా 203 కిలో మీటర్ల అండర్ టన్నెల్ నిర్మిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.