కిషన్‌రెడ్డిని మందలించిన అమిత్‌షా..!

కిషన్‌రెడ్డిని మందలించిన అమిత్‌షా..!

న్యూఢిల్లీ:

హోం శాఖ సహాయమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తొలిరోజే జి.కిషన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో ఇబ్బందిలో పడ్డారు. హైదరాబాద్‌ను ఉగ్రవాదులకు సేఫ్ జోన్‌గా కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీంతో హోం శాఖ మంత్రిగా శనివారంనాడే బాధ్యతలు చేపట్టిన అమిత్‌షా తన డిప్యూటీని మందలించినట్టు తెలుస్తోంది.
దేశంలో ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు దొరికినా మూలాలు హైదరాబాద్‌లో కనిపిస్తున్నాయని కిషన్ రెడ్డి వ్యాఖ్యనించడం విమర్శలకు తావిచ్చింది. బెంగళూరు, భోపాల్ సహా ఎక్కడ ఉగ్ర ఘటనలు జరిగినా మూలాలు హైదరాబాద్‌లో కనిపిస్తున్నాయని, హైదరాబాద్‌లో ప్రతి 2-3 నెలలకు ఉగ్రవాదులను రాష్ట్ర పోలీసులు, ఎన్ఐఏ అరెస్టు చేస్తున్నారని చెప్పారు.కాగా, ఆయన వ్యాఖ్యలపై మజ్లిస్ చీఫ్ ఒవైసీ మండిపడ్డారు. బాధ్యతగల మంత్రి ఇంత బాధ్యతారహితంగా మాట్లడటం ఏమిటంటూ నిప్పులు చెరిగారు. ఉగ్రవాదానికి హైదరాబాద్ సేఫ్ జోన్ అని ఎన్ఐఏ, ఐబీ, రా ఎన్నిసార్లు లిఖిత పూర్వకంగా చెప్పాయని మంత్రిని ప్రశ్నించారు. తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధికి వ్యతిరేకిగా కిషన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గత ఐదేళ్లుగా హిందూ, ముస్లిం పండుగలు, ఊరేగింపులు ఎంతో ప్రశాంతంగా జరుగుతున్న విషయం కిషన్‌రెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు.