కీచులాటలు కాంగ్రెస్ కు శాపం కేసీఆర్ కు వరం.

ఎస్.కె.జకీర్.
కాంగ్రెస్ పార్టీలో కీచులాటలు ఆ పార్టీకి శాపంగా మారుతున్నవి. కేసీఆర్ కు అవి వరం అవుతున్నవి. తెలంగాణలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్నది టిఆర్ఎస్ అధ్యక్షుని లక్ష్యం. అందుకే ఆయన తెలుగుదేశం, కాంగ్రెస్ లను ‘వేటాడుతున్నారు’. తెలుగుదేశం పార్టీ ‘పని’ పూర్తయినందున ఆయన ‘ఆపరేషన్ కాంగ్రెస్’ ను చేపట్టారు. కాంగ్రెస్ బలమూ, బలహీనతలు కేసీఆర్ కు బాగా తెలుసు. అందుకే కేసీఆర్ గురిచూసి కొట్టగలుగుతున్నారు. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడంలో విజయవంతమవుతున్నారు. అధికార పార్టీలో అసంతృప్తి, అసమ్మతి, విబేధాలు ఉండడం సర్వసాధారణం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వీటిని చూసాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ‘సీన్ రివర్స్’ అయింది. టిఆర్ఎస్ లో అసమ్మతి, అలకలు ఉన్నా అవి బయటకు వచ్చే అవకాశాలు శూన్యం. అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని కేసీఆర్ తన ‘కంటి సైగ’ తో శాసిస్తున్న సంగతి లోక విదితం. తెలంగాణ రాజకీయాల్లో బాహుబలి గా అవతరించిన కేసీఆర్ తో కయ్యానికి సొంత పార్టీ లో ఎవరూ సిద్ధంగా లేరు. అవతల ప్రతిపక్షాలు కూడా అయన వ్యూహాలకు ‘కౌంటర్ వ్యూహాలు’ రచించలేకపోతున్నవి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ బస్సుయాత్ర తో కొంత హడావుడి చేసింది. ఈ లోగా కొన్ని కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. ఇందులో కొన్నింటిని ఏరికోరి తెచ్చుకున్నవి. కొన్ని స్వతహాగా ఆ పార్టీకి ఉండే లక్షణాల వల్ల వచ్చినవి. బస్సు యాత్ర లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇక ఢిల్లీ యాత్రలు చేయకతప్పడం లేదు. కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న విబేధాలు శీర్షికతో గత కొన్ని రోజులుగా వార్తా కథనాలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సమితి గురించి ఇలాంటి వార్తలు, కథనాలు, వదంతులు, ఊహాగానాలు గత నాలుగేళ్లలో ఎప్పుడూ చూడలేదు. మీడియా టిఆర్ఎస్ పక్షం వహిస్తున్నదనడానికి ఆధారాలు లేవు. కానీ అధికారపక్షం అలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నది. సొంత టివి చానల్, తెలుగు, ఇంగ్లీషు భాషల్లో రెండు దినపత్రికలు ఉండడం కేసీఆర్ కు, టిఆర్ఎస్ కు అనుకూల అంశం. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యూనిట్ నాలుగేళ్లుగా అటువంటి ప్రయత్నమే చేయలేదు. సొంత మీడియా లేకపోవడం,ప్రధాన స్రవంతి మీడియాలో, సోషల్ మీడియాలో తమ పార్టీ కి వ్యతిరేకంగా కథనాలు వెలువడకుండా ‘మేనేజ్’ చేయలేకపోవడం టిపిసిసి బాధ్యుల ముందుచూపు కొరతకు అడ్డం పడుతున్నవి. టిపిసిసి అధ్యక్షుడ్ని మార్చాలంటూ పలువురు సీనియర్లు ఢిల్లీ యాత్ర జరిపారని వార్తలు వచ్చాయి. నిజానికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మార్చాలని ఎవరూ కోరలేదు. మార్చాలనుకున్నా ఇప్పటికిప్పుడు ప్రత్యామ్న్యాయమూ ఏఐసిసి దగ్గర రెడీ మేడ్ గా లేదు. కాంగ్రెస్ లో సామాజిక సమీకరణలు, నాయకత్వ ఆమోదం తదితర అంశాలు ఒడువని ముచ్చట. రేవంత్ రెడ్డి చేరికను వ్యతిరేకించిన వారు చాలా మంది ఉన్నారు. అది కొంత సద్దుమణిగింది. కానీ నాగం జనార్ధనరెడ్డి చేరికపై డి.కె. అరుణ లాంటి వారు ఇంకా బుస కొడుతూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో, ముఖ్యంగా తెలంగాణలో రెడ్డి నాయకత్వమే ఆది నుంచీ ఆధిపత్యంలో ఉంది. నాన్ రెడ్డికి పగ్గాలు అప్పజెప్పితే వచ్చే అసంతృప్తి, పర్యవసానాలు కాంగ్రెస్ ఢిల్లీ నాయకత్వానికి తెలుసు. లేకపోతే అటు పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని, ఇటు శాసనసభలో ప్రతిపక్ష నేత పదవులను ఒకే కులానికి చెందిన వారికి కేటాయించి ఉండేవారు కాదు. పార్టీలో ముఖ్యమంత్రి పదవి కోసం జరుగుతున్న పోటీ తరచూ బహిర్గతమవుతున్నది. కానీ వారిలో ఐకమత్యం సాధనకు ఎలాంటి కృషి జరగడం లేదు. సీనియర్లు, జూనియర్ల మధ్య సమన్వయము లేదు. సమైక్యత లేదు. అన్నింటికన్నా ముఖ్యం క్రమశిక్షణా రాహిత్యం. అంతర్గత సమావేశాల్లో జరిగే విషయాలు, సమాలోచనలు బయటకు చెబుతున్నారు. తమ పార్టీ కి తామే కీడు చేస్తున్నారు. కేసీఆర్ సరిగ్గా అక్కడే విజయం సాధించారు. నియంత అనే నిందలు వచ్చినా, అప్రజాస్వామిక వైఖరిగా పాలిస్తున్నారని అపవాదు వచ్చినా ఆయన చెప్పిందే శాసనం. వేదం.  తాము అధికారంలో లేనపుడు ఎంత నిబ్బరంగా, ఎంత నిజాయితీగా, ఎంత ఐక్యతతో ముందుకు పోవాలన్నా అంశంపై తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు తగిన మిలిటరీ శిక్షణ అవసరం. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కీచులాటలు అధికారపక్షానికి మేలు చేస్తాయన్న స్పృహ కూడా లేకుండా వారు వ్యవహరిస్తున్నారు.