కృష్ణా జిల్లాలో పరువు హత్య. కూతుర్ని చంపిన తండ్రి.

అమరావతి:
కృష్ణా జిల్లాలో శనివారం పరువు హత్య జరిగింది. కన్న తండ్రే కూతుర్ని గొడ్డలి కర్రతో కొట్టి చంపేశాడు. ఈ ఘటన జిల్లాలోని చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామంలో చోటుచేసుకుంది. కూతురిపై అనుమానంతో తండ్రి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తన కూతురు వేరే వ్యక్తితో ప్రేమలో ఉందని ఆ తండ్రి అనుమానించాడు. ఆ యువతి ఇంటి ఆవరణలో ఫోన్‌ మాట్లాడుతున్న సమయంలో తండ్రి దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడిక్కడే మృతి చెందింది.
ఆ యువతి(24) బీటెక్‌ చదువుతోందని సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.