కెటిపిఎస్ 7 వ దశ ప్రారంభం. శరవేగంగా నిర్మాణం పూర్తి.

భద్రాద్రి కొత్త గూడెం:
మెగావాట్ల విద్యత్ ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన కెటిపిఎస్ ఏడవ దశలో శనివారం రాత్రి 10:23 కి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. శరవేగంగా నిర్మితమైన విద్యుత్తు ప్రాజెక్టుగా దేశ విద్యుత్ రంగంలో ఈ ప్రాజెక్టు సరికొత్త రికార్డును సృష్టించింది. తెలంగాణ జెన్కో సిఎండి డి. ప్రభాకర్ రావు పాల్వంచలో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించి పవర్ గ్రిడ్ కు అనుసంధానం చేశారు. ఈ కార్యక్రమంలో బిహెచ్ఈఎల్ ఈ.డి ముఖోపాధ్యాయ, జెనరల్ మేనేజర్ శ్రీనివాస రావు, జెన్కో డైరెక్టర్లు వెంకట రాజం, సచదానందం, ఈడీలు అజయ్, లక్ష్మయ్య, సిఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్వంచ ప్లాంట్ లో అధికారులు, కార్మికులు పెద్ద ఎత్తున హర్షధ్వానాలు చేశారు. నెల రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించి జూలై చివరి వారంలో శాశ్వత ప్రాతిపదికన విద్యుత్ ఉత్పత్తిని నిర్విరామంగా చేయడానికి కమెన్స్ ఆపరేషన్ డేట్ (COD) కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రారంభించి, పూర్తి చేసిన మొదటి ప్రాజెక్టుగా కెటిపిఎస్ 7వ దశ 800 మెగావాట్ల ప్లాంటు చరిత్రలో నిలువనుంది. 5,700 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన ఈ ప్లాంటు నిర్మాణ పనులను 2015 ఫిబ్రవరి 1న ప్రారంభించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ శంఖుస్థాపన చేసిన మొదటి విద్యుత్ ప్లాంటు కూడా ఇదే. దేశంలో కొత్త విద్యుత్ కేంద్రం ప్రారంభించిన 48 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని కేంద్రీయ విద్యుత్ మండలి (సిఈఏ) నిబంధనలున్నాయి. అయితే ఈ ప్లాంటు నిర్మాణం అంతకన్నా తక్కువ వ్యవధిలోనే కేవలవం 40 నెలల్లోనే నిర్మాణం పూర్తి చేసుకుని ప్లాంట్ల నిర్మాణంలో కొత్త చరిత్ర సృష్టించింది. దేశంలో మరెక్కడా కూడా ఇంత తక్కువ సమయంలో విద్యుత్ ఉత్పత్తి ప్లాంటు నిర్మాణం జరగలేదు. కెటిపిఎస్ ఏడవ దశ అందుబాటులో వచ్చిన తర్వాత తెలంగాణకు అందుబాటులో ఉండే విద్యుత్ 16వేల మెగావాట్లు దాటింది.
ఐడిసి భారం తగ్గించేలా నిర్మాణం:
దేశంలో శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకున్న ప్లాంటుగానే కాకుండా ఐడిసి భారం అధికంగా పడకుండా నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టుగా కూడా కెటిపిఎస్ 7 చరిత్రలో నిలిచిపోనుంది. అగ్రిమెంటులో నిర్దేశించిన కాలవ్యవధిలోగా పని పూర్తి కాకపోతే ఇంట్రెస్ట్ డ్యూరింగ్ కన్ స్ట్రక్షన్ (ఐడిసి) రూపంలో అదనపు వ్యయం అవుతుంది. ఈ అదనపు వడ్డీ భారాన్ని కూడా విద్యుత్ సంస్థలు భరించి, కొనుగోలు చేయాల్సి వస్తుంది. అంతిమంగా ఆ భారం ప్రజలపై పడుతుంది. అయితే నిర్ణీత సమయం కన్నా 8 నెలల ముందే నిర్మాణం పూర్తి కావడం వల్ల కెటిపిఎస్ 7 నుంచి కొనుగోలు చేసే విద్యుత్తుకు ఐడిసి భారం ఎక్కువగా పడదు. దీని వల్ల ఇక్కడి నుంచి వచ్చే విద్యుత్ కూడా చాలా తక్కువ ధరకు లభ్యమవుతుంది. దాదాపు 300 కోట్ల రూపాయల వరకు ఆర్థికంగా మేలు కలుగుతుంది. ఈ అరుదైన ఘనతను కూడా కెటిపిఎస్ సాధించింది.
సింగరేణి బొగ్గు ద్వారానే ఉత్పత్తి:
కెటిపిఎస్ 7వ దశలో విద్యుత్ ఉత్పత్తికి సింగరేణి బొగ్గునే వాడనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించాలనే రాష్ట్ర ప్రభుత్వం విధానానికి అనుగుణంగా జెన్కోకు బొగ్గు సరఫరా చేయడానికి సింగరేణి అంగీకారం కుదుర్చుకుంది. దీని వల్ల సింగరేణికి లాభం జరగడంతో పాటు తెలంగాణ జెన్కోకు తక్కువ ధరకు బొగ్గు లభిస్తుంది. ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. అంతిమంగా ప్రభుత్వ రంగ సంస్థలు వర్ధిల్లడానికి ఉపయోగపడుతుంది.రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అందించిన ప్రోత్సాహం, విద్యుత్ అధికారులు, సిబ్బంది చేసిన సమిష్టి కృషి వల్లనే రికార్డు సమయంలో ప్లాంటు నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి ప్రారంభించగలిగామని జెన్కో-ట్రాన్స్ కో సిఎండి డి. ప్రభాకర్ రావు తెలిపారు. కెటిపిఎస్ 7 ప్లాంటులో ఉత్పత్తిని ప్రారంభించిన సందర్భంగా ప్రభాకర్ రావు మాట్లాడారు. తీవ్ర విద్యుత్ సంక్షోభం నెల కొన్న తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలనే ధృడ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. దానకి అనుగుణంగానే విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం జరుగుతున్నదని వెల్లడించారు. రికార్డు సమయంలో 800 మెగావాట్ల ప్లాంటును నిర్మించడం జెన్కోకు గర్వకారణమన్నారు. ఈ రికార్డుతో తెలంగాణ జెన్కో కీర్తి ప్రతిష్టలు ఎంతో పెరిగాయని ఆనందం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో భద్రాది, యాదాద్రి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రభాకర్ రావు చెప్పారు. ప్లాంటు నిర్మాణానికి కష్టపడిన అధికారులు, ఉద్యోగులకు, బిహెచ్ ఈఎల్ కు ప్రభాకర్ రావు అభినందనలు తెలిపారు.
జెన్కో పనితీరు ప్రశంసనీయం : సిఎం కెసిఆర్.
రికార్డు సమయంలో విద్యుత్ ప్లాంటును నిర్మించి ఉత్పత్తి ప్రారంభించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. జెన్కో కృషి ప్రశంసనీయం అన్నారు. పారదర్శకత, పనుల్లో వేగం సాధించారన్న లక్ష్యంతో విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించామన్నారు. ఆ లక్ష్యాలు నెరవేరడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పని చేస్తున్న జెన్కో సిఎండి ప్రభాకర్ రావు, అధికారులు, సిబ్బందిని ముఖ్యమంత్రి అభినందించారు.