కేంద్రానికి చెంపదెబ్బ.

న్యూఢిల్లీ:
దేశ రాజధాని ఢిల్లీలో అధికారం ఎవరిది? గత కొన్నేళ్లుగా ఈ వివాదం రేగుతూనే ఉంది. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ కేంద్ర ప్రభుత్వం నియమించే లెఫ్టినెంట్‌ గవర్నర్‌, ప్రజలు ఎన్నుకొన్న ప్రభుత్వం మధ్య ఘర్షణ వాతావరణమే. అటు కేంద్రంలో, ఇటు ఢిల్లీ పీఠంపై ఒకే పార్టీ ప్రభుత్వాలే ఉంటే సమస్యలు రావు. రెండుచోట్ల వేర్వేరు పార్టీలు అధికారంలోకి వస్తేనే అసలు సమస్యంతా. లెఫ్టినెంట్ గవర్నర్, సీఎంల మధ్య నిత్యం ఘర్షణలే. ముఖ్యంగా శాంతి భద్రతల విషయంలో ఢిల్లీ సీఎం, ఎల్జీకి మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అధికారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదే. ఢిల్లీ ఎల్జీగా పనిచేసిన వారిలో చాలా మంది కేంద్రానికి తొత్తుగానే వ్యవహరించారు. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదు. కేంద్రం ప్రభుత్వం ఎలా ఆడమంటే అలా ఆడే ఎల్జీలు కోకొల్లలు. దీన్ని ఆసరాగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీ ప్రభుత్వాన్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకోవటానికి ప్రయత్నించింది. ఈ అధికారాల పెనుగులాటలో పైచేయి సాధించేందుకు సీఎం, ఎల్జీ ఎప్పుడూ సఖ్యత ఉండేది కాదు. పాలన విషయంలో చెరో దారి వెళ్లేవారు. ఇకపై ఎల్జీ ఆటలు సాగవు. కొంత అచితూచి అడుగులు వేయాల్సిన పరిస్థితి. కేంద్రం ఆడమన్నట్టు ఆడే రోజులు ఇకపై ఉండకపోవచ్చు. ఈ విషయంలో ఆమ్ఆద్మీ పార్టీ విజయం సాధించింది అని చెప్పవచ్చు.

గతంలో ఢిల్లీ గవర్నర్లుగా ఉన్న వారంతా కూడా సీఎంపై పెత్తనం చెలాయించేందుకు ప్రయత్నించిన వారే. ప్రజలతో ఎన్నుకోబడిన తాను గొప్ప అని సీఎం అంటే…. కాదు కేంద్రం ప్రభుత్వంచే నియమించిన తనకే అధికారాలు ఎక్కువగా ఉన్నాయని ఎల్జీ చెప్పుకునే వారు. వీరిద్దరి మధ్య ప్రజలు నలిగిపోయేవారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో సీఎం ఫుల్ ఖుషీగా ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర సంబంధాల మధ్య ఆరోగ్యకర వాతావరణం ఉండాలని అత్యున్నత న్యాయస్థానం సూచించింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగా పనిచేయాలంటోంది. ప్రభుత్వం కూడా కేబినెట్ నిర్ణయాలను లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు తెలియజేయాలని ఆదేశించింది. అయితే అన్ని అంశాల్లో ఎల్జీ జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు సూచించింది. ఎల్జీకి స్వతంత్ర అధికారాలు లేవు. పాలనా విషయంలో ప్రజలతో ఎన్నుకున్న ప్రభుత్వానిదే నిజమైన అధికారమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
అసలు వివాదం ఏమంటే?
ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం. దీన్ని పాలించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్‌ తో పాటు ప్రజలు ఎన్నుకున్న సీఎం కూడా కూడా ఉంటారు. కొంతకాలంగా ఎల్జీకి, సీఎంకు మధ్య అధికారాలపై వివాదం నడుస్తోంది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వ అధికారాలను గవర్నర్ తక్కువ చేస్తున్నారని కేజ్రివాల్ ఆరోపిస్తున్నారు. గతంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు ఇస్తూ.. ఢిల్లీ పరిపాలకుడు లెఫ్టినెంట్ గవర్నరేనని ప్రకటించింది. దీనిపై సీఎం కేజ్రివాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం తాజా తీర్పు చెప్పింది. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో ఉండే భూమి, కార్యనిర్వాహక యంత్రాంగం, పోలీసులపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారాలూ ఉండవు. లెఫ్టినెంట్ గవర్నర్‌ ద్వారా ఢిల్లీని పాలించాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని కేజ్రివాల్ ఆరోపిస్తున్నారు. తన ప్రభుత్వంలో పనిచేసే ఐఏఎస్ అధికారులు తాను ఆదేశించినట్లుగా పనిచేయటం లేదని కేజ్రీవాల్ ఆవేదన. సుప్రీం తాజా తీర్పుతో ఢిల్లీ ప్రభుత్వం ప్రతి ఫైలును ఎల్జీ అనుమతి కోసం పంపాల్సిన పనిలేదు. పనులు ఆగవు.
ఢిల్లీలో పాలన ఎవరిదో, పలుకుబడి ఎవరిదో సుప్రీంకోర్టు తీర్పుతో తేలిపోయింది. ఇక మిగిలింది పాండిచ్చేరి. ఇక్కడ కూడా అదే అధికారాల కోసం ఆరాటం. ఆధిపత్యం కోసం పోరాటం. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ, ముఖ్యమంత్రి నారాయణస్వామిల మధ్య కీచులాటలు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రికి, గవర్నర్ కు ఒకరంటే ఒకరికి అస్సలు పడదు. ఢిల్లీ పెద్దలు కూడా వీరి పంచాయతీలు తీర్చలేక చేతులెత్తేశారు. నువ్వెంత అంటే నువ్వెంత? అంటూ ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. ఇప్పటికే సీఎం నారాయణస్వామి ప్రభుత్వ వ్యవహారాల్లో తలదూరుస్తున్నారని ఎల్జీ కిరణ్ బేడీపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరి ఇప్పుడు ఢిల్లీ తీర్పుతో ఈ వివాదానికి కూడా తెరపడనుందా అనేది ఆసక్తికరంగా మారింది.