కేన్సర్ కు ‘ఆన్సర్’ చేప.

హైదరాబాద్:
జీబ్రా ఫిష్. అదో చిన్న చేప. అది కూడా దేశంలో ఎక్కడ పడితే అక్కడ విరివిగా దొరికే చేప. కానీ అది ఇప్పుడు శాస్త్రవేత్తలు, పరిశోధకులకు అనుకోకుండా దొరికిన ఓ వరం. ఇన్నాళ్లూ కఠిన నిబంధనలు నియంత్రణలకు లోబడి కోతులు, ఎలుకలు వంటి జీవులపై చేస్తున్న ఔషధ ప్రయోగాలను కొత్త బాట పట్టించింది. మానవుల మాదిరిగా అవయవాలను కలిగి ఉండటం శతకోటి మత్స్యాల్లో ఒక చేపైన ఈ జీబ్రా ఫిష్ ని ప్రత్యేకంగా నిలబెట్టింది. అంతే కాదు.. ఈ అవయవాలను పునరుత్పత్తి చేసుకోగల సామర్థ్యం కారణంగా శాస్త్రవేత్తలు వీటిని ప్రయోగాలకు ఎంపిక చేసుకొంటున్నారు.
ప్రస్తుతం ఈ జీబ్రా ఫిష్ ను వివిధ రకాల కేన్సర్ లకు ప్రత్యేకమైన మందులు కనిపెట్టే పరిశోధనల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ చేపల్లో కేన్సర్ ట్యూమర్లను ఎక్కించి వివిధ రకాల ఔషధాల శక్తిసామర్థ్యాలను పరీక్షిస్తున్నారు. దీని వల్ల మానవులకు ప్రతి ఒక్క కేన్సర్ కు ప్రత్యేకమైన మందులు, చికిత్సా విధానం తయారుచేయడం వీలవుతుందని సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులార్ బయాలజీ (సీసీఎంబీ) శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇందుకోసం సీసీఎంబీ కొన్ని నెలల క్రితం తన ఆవరణలో అధునాతన జీబ్రా ఫిష్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవలే రెండు రోజుల జాతీయస్థాయి సదస్సు నిర్వహించింది. జీబ్రాఫిష్‌ల పనితీరు, వాటి ఆవశ్యకతపై ఏర్పాటు చేసిన పోస్టర్‌ ప్రదర్శనలో దేశంలోని ప్రఖ్యాత సంస్థలు, యూనివర్సిటీలు, ల్యాబరేటరీలకు సంబంధించిన సుమారు వందలాది శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. డెవలప్ మెంటల్ బయాలజీ, న్యూరోబయాలజీ, డిసీజ్ బయాలజీ, ప్రవర్తన అధ్యయనాల వంటి అంశాలపై చర్చించారు.
ప్రస్తుతం దేశంలో సుమారు 40 పరిశోధనశాలల్లో మానవ శరీర నిర్మాణాన్ని జీబ్రా ఫిష్ ఎలా అనుకరిస్తోందనే విషయంపై అధ్యయనం జరుగుతున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. జీబ్రాఫిష్‌ అవయవాలను పునరుత్పత్తి చేసుకునే సామర్థ్యం పరిశీలిస్తుంటే మానవ శరీరంలోనూ అవయవాల పునరుత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయనే ఆశ కలుగుతోందని చెప్పారు. అంతే కాకుండా జెనోమ్ ఎడిటింగ్ కు కూడా చాలా సమర్థవంతంగా పనికి వస్తుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం సీసీఎంబీ జీబ్రా ఫిష్ లో బ్రెస్ట్ కేన్సర్ పై పరిశోధనలు జరుపుతోంది. చేపలో ట్యూమర్ ప్రవేశపెట్టి కణాలు ఎలా ప్రవర్తిస్తున్నాయి? వాటి విస్తరణ, మందులతో వాటిని నియంత్రించే విధానాలను పరిశీలిస్తున్నారు. కేన్సర్‌, బ్రెయిన్‌ ట్యూమర్‌, టీబీ, మానసిక ఆరోగ్యం, అండోత్పత్తి వంటి వివిధ రకాల పరీక్షలు, పరిశీలనల దిశగా పరిశోధనలు కొనసాగిస్తున్నామని చెప్పారు.