కేసీఆర్ ఎత్తుగడలకు ‘చెక్’ పెట్టడమెలా? టి.కాంగ్రెస్ మథనం. రెండు నెలలముందే అభ్యర్థుల ప్రకటన.

ఎస్.కె.జకీర్.
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహరచనా దురంధరుడు. ఆయన వ్యూహాలను, ఎత్తుగడలను ఎదుర్కోవడం ఎలా అన్న సమస్య తెలంగాణ కాంగ్రెస్ ను పీడిస్తున్నది. సంక్షేమ పధకాల సునామీ కొనసాగుతున్నది. రైతులకు ఉచితంగా యూరియా సరఫరా చేసే అంశమూ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నది. రైతుబంధు, రైతుబీమా, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, కాళేశ్వరం….వంటి కార్యక్రమాలు, ప్రాజెక్టులు టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఒక సానుకూల వాతావరణాన్ని ఏర్పరచినవి. ఈ కార్యక్రమాల అమలు తీరు, మంచి చెడులు, అవినీతి తదితర వ్యవహారాలు పెద్దగా జనంలో ‘సింక్’ కావడం లేదు. కనుక ఇంతకన్నా గొప్పవి, ప్రజాకర్షణ కలిగిన, మరీ ముఖ్యంగా రైతాంగాన్ని, సామాన్య ప్రజలను ఆకట్టుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ పధకాలను రచించవలసి ఉన్నది. వాటిని ప్రజల్లోకి వదిలినప్పుడు వాళ్ళు నమ్మగలగాలి. కన్విన్స్ కావాలి. రైతులకు 2 లక్షల రుణ మాఫీ కార్యక్రమం ప్రజల్లో విస్త్రుతంగానే ప్రచారంలో ఉన్నది. కానీ ఎక్కడో, ఎదో అనుమానం. మిగతా రాష్ట్రాల ప్రజలు వేరు. తెలంగాణ ప్రజలు వేరు. ఇక్కడి చైతన్య స్థాయి వేరు. పైగా టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అటు 2 లక్షల రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రకటించగానే ‘ అది సాధ్యం కానే కాదు.’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ సాధికారికంగా చెప్పారు. ప్రతి రంగంపైన కేసీఆర్ కు అవగాహన, పట్టు ఉన్నవి. కేసీఆర్ ‘కౌంటర్ ప్రకటన’ వ్యూహాత్మకమైనది. ‘తాను చెబితే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ వారు చెబితే సాధ్యం కాద’ని కేసీఆర్ ప్రజల మనసులో గట్టిగా నాటదలచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్న 2 లక్షల రుణమాఫీ అమలుపై ప్రజల్లో ‘ఆనుమానాలు’ కలిగే విధంగా కేసీఆర్ మాట్లాడుతున్నారు. అలాగే ‘ నిరుద్యోగ భృతి’ వ్యవహారం. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగ భృతి ఇస్తామని ఉత్తమ్ ప్రకటించారు. బహుశా ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆమోదం తీసుకున్న తర్వాతే ఈ హామీ ఇచ్చి ఉండవచ్చును. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం హామీలు మాత్రమే ఇవ్వగలదు. కానీ అధికారంలో ఉన్న కేసీఆర్ దాన్ని అమలు లోకి తీసుకు వస్తే! పరిస్థితి ఏమిటి? తెలంగాణ ధనికరాష్ట్రం అని కేసీఆర్ ఇప్పటికి ఎన్నో సార్లు చెప్పారు. అందుకే ఇబ్బడి ముబ్బడిగా సంక్షేమ పథకాలను జనంలోకి సంధించి వదులుతున్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వడం కూడా కేసీఆర్ కు పెద్ద లెఖ్ఖ కాకపోవచ్చును. కాకపోతే దీనిపై అధికారపక్షం నుంచి ఎలాంటి సంకేతాలు లేవు. నిరుద్యోగ యువతీ యువకుల్లో ‘ అశాంతి’ ఉన్న సంగతి కేసీఆర్ కు తెలియనిది కాదు. ఆ అశాంతిని ‘డీల్ ‘ చేయాలని కేసీఆర్ అంతరంగంలో ఉన్నది. దీనిపై ఆయన ఎదో ఆలోచనలు చేస్తూనే ఉండి ఉంటారు. కొద్దీ రోజుల్లో నిరుద్యోగులకు వరాలు ప్రకటించే అవకాశాలు లేకపోలేదు. ఒక వేళ అటువంటి పరిణామాల తర్వాత కాంగ్రెస్ ఇంకా ‘పదునైన అస్త్రాలు’ తయారు చేయవలసిన పరిస్థితులు నెలకొనవచ్చును. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినపుడే కాంగ్రెస్‌ పార్టీ ఇక్కడ గెలవాల్సి ఉన్నా, పార్టీలో బహు నాయకత్వం, మరోవైపు కెసిఆర్‌ వ్యూహాత్మక ఎత్తుగడలతో కాంగ్రెస్‌ ఓటమి పాలైంది. టిఆర్ ఎస్ కు 2014 వరకు సుస్థిరమైన నాయకులు, క్యాడర్ చాలా తక్కువ. ‘పునరేకీకరణ’ పేరిట కేసీఆర్ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేశారు. ఇతర పార్టీల నేతలు పెద్ద ఎత్తున టిఆర్‌ఎస్‌లోకి చేరడంతో ఆపార్టీ క్యాడర్‌ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో టిఆర్‌ఎస్‌ను ఎదిరించడం అంత సులువైన వ్యవహారం కాదని రాహుల్‌ గాంధీకి కూడా తెలుసు. ‘ముందస్తు ఎన్నికలకు సిద్దంగా ఉండండి. నేతలంతా సమన్వయంతో ముందుకెళ్లండి. విజయమే లక్ష్యంగా పనిచేయండి’. ఇదీ కాంగ్రెస్‌ హైకమాండ్‌ తెలంగాణ నేతలకు ఇచ్చిన సందేశం. ‘ ముందస్తు’ ఎన్నికలు రావచ్చు, రాకపోవచ్చు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందస్తుకు సిద్ధమా అని కాంగ్రెస్‌ సవాల్‌ విసరడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌ పార్టీ కూడా అలర్ట్‌ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ క్యాడర్‌ను సన్నద్దం చేసే పనిలో పడింది.తెలంగాణపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ కూడా ప్రత్యేక దృష్టి సారించింది. వచ్చే ఎన్నికలను అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఇందులో భాగంగా ముందస్తు ఎన్నికలకు పార్టీని సిద్దం చేసేందుకు హైకమాండ్‌ రంగంలోకి దిగింది. ఇప్పటికే రాష్ట్ర ఇంచార్జ్‌ కుంతియాకు తోడుగా మరో ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులను అధిష్టానం నియమించింది. కొత్తగా నియమించిన ఏఐసీసీ కార్యదర్శులు ముగ్గురు పార్లమెంట్‌ నియోజకవర్గాలలో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.అన్ని పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితిపై చర్చిస్తున్నారు. . నియోజకవర్గాల వారీగా ఉన్న సమస్యలు, నేతల మధ్య ఉన్న సమన్వయ లోపాలను చక్కదిద్దేందుకు హైకమాండ్‌ దూతలు దిశానిర్దేశం చేశారు. పార్టీని సంస్థాగతంగా బూత్‌ స్థాయి నుంచి బలోపేతం చేయడంతోపాటు శక్తియాప్‌ వాడకంపై పలు సూచనలు చేశారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకులు వ్యూహాలు రూపొందిస్తున్నారు.కాంగ్రెస్‌ పార్టీ తమ క్యాడర్‌ బలంగా ఉన్న తెలంగాణపై దృష్టి సారించింది. పార్టీ అధినేత రాహుల్‌గాంధీ తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలింపించుకునేందుకు ప్రత్యేకవ్యూహంతో సాగు తున్నారని ఎఐసిసి వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఉత్తరాదిలో క్రమంగా బలపడు తున్నట్లు ఆపార్టీకి సంకేతాలున్నాయి. రాజస్తాన్‌, హర్యానా, పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌, గుజరాత్‌, మహారాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ క్రమంగా ఊపందుకుంటోంది. ఉత్తరాదిలో 160 నుంచి 170 సీట్లకు పైగా పార్టీ గెలుచుకుంటుందని కాంగ్రెస్‌ వర్గాలు పేర్కొంటు న్నాయి.ఈనేపథ్యంలో రాష్ట్రంలో బలమైన బిసిలపై కాంగ్రెస్‌పార్టీ దృష్టి సారించింది. ఇప్పటికే ఢిల్లీలో ఓబిసిల సమావేశం నిర్వహించి బలమైన బిసి ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ‘గుజరాత్‌ తరహా బలమైన కులవాదాన్ని’ ఇక్కడ అమలు చేయాలని, కులం కార్డు ప్రయోగంతో కెసిఆర్‌ను దెబ్బకొట్టాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం భావిస్తోంది. సామాజిక వర్గాల వారిగా కెసిఆర్‌ తాయిలాలు ప్రకటిస్తూ మచ్చిక చేసుకుంటున్న నేపథ్యంలో ఆదే వ్యూహంతో టిఆర్‌ఎస్‌ను తుదముట్టించాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది. బలమైన సామాజిక వర్గాల్లో బిసి, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీలకు కాంగ్రెస్‌ దగ్గర కావాలని యోచిస్తోంది. తెలంగాణలో 50శాతంకు పైగా ఉన్న బిసిలను పార్టీవైపు తిప్పుకునేం దుకు ప్రయత్నాలు వేగవంతంచేస్తోంది.ఎన్నికల ముంగిట పాలమూరు కాంగ్రెస్‌ ‘కాయకల్పచికిత్స’కు పార్టీ హైకమాండ్ రంగంలోకి దిగింది. ఈ జిల్లాలో పార్టీకి బలమైన నాయకత్వం, కార్యకర్తలు ఉన్నారని అధిష్టానం భావిస్తున్నది. పార్టీలో లోపాలను సరిచేసుకొని వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో మెజార్టీ సీట్లు సాధించే దిశగా కార్యాచరణ ప్రణాళికను ఖరారు చేసింది. పార్టీ ఇన్‌చార్జి, ఏఐసీసీ కార్యదర్శి సలీమ్‌ అహ్మద్‌ మహబూబ్‌నగర్‌లో ఉమ్మడి జిల్లా పార్టీ విస్తృతస్థాయి సమావేశం ఇటీవల నిర్వహిం చారు. పార్టీ ఎమ్మెల్యేలు, ప్రధాన నేతలతో పాటు, నియోజకవర్గ ఇన్‌చార్జిలతో సమావేశమయ్యారు. నియోజకవర్గాల వారీగా బూత్‌స్థాయి నుంచి పార్టీ బలోపేతానికి తీసుకో వాల్సిన చర్యలు, కార్యకర్తల మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. సమావేశాల్లో కాంగ్రెస్‌ నేతలు, నాయకులు, కార్యకర్తలు ఎవరికి వారు తామ వాదనలు, అభిప్రాయాలను తెలియజేశారు.మూడు నెలల పాటు ఉమ్మడి జిల్లాలో పార్టీ కార్యకలాపాలను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తారని కాంగ్రెస్‌ శ్రేణులు భావిస్తున్నారు. నియోజక వర్గాలవారీగా నాయకులతో నిర్వహించిన సమీక్షలో పలు డిమాండ్లు, వాదనలు, అభిప్రా యాలు ఆయన దృష్టికి వచ్చాయి. పార్టీ బలంగా ఉన్నా, నాయకుల మధ్య విబేధాలతో పార్టీ శ్రేణుల్లో అభద్రత నెలకొన్నది. దీన్ని రూపుమాపేందుకు ఐక్యంగా పార్టీని ముందుకు నడిపేందుకు అధిష్టానం చర్యలు తీసుకోవాలని కొందరు నాయకులు పరిశీలకుని ముందు కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ప్రజల్లో ఆదరణ ఎవరికి ఉందో, అధిష్టానం సర్వే నిర్వహించాలని దాని ఆధారంగానే నియోజకవర్గాల్లో పోటీచేసే అభ్యర్ధులను ఖరారు చేయాలని కార్యకర్తలు సూచించారు. లాబీలకు లొంగి, పార్టీకి సేవ చేయని వారికి, చివరి నిమిషంలో ఇతర పార్టీల నుంచి వచ్చేవారికి టిక్కెట్లు ఇవ్వవద్దనే అంశాలను కొందరు ఏఐసీసీ కార్యదర్శి దృష్టికి తీసుకువచ్చారు. అదే సమయంలో సామాజిక న్యాయం పాటించాలని కొందరు నేతలు, నాయకులు, కార్యకర్తలు అధిష్టానం దూతకు తెలియజేశారు.ఇదే క్రమం లో ఆశావహులు తాము చేస్తున్న కార్యక్రమాల వివరాలను ఏఐసీసీ కార్యదర్శికి వివరించారు. మక్తల్‌ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పార్టీని వీడినా పార్టీ బలంగా ఉందని అక్కడ స్థానిక నాయకుల్లో ఎవరికి టిక్కెట్‌ ఇచ్చినా గెలిపిస్తామ ని ఈ విషయాన్ని అధిష్టానం గుర్తించాలని నియోజకవర్గ నాయకులు బహిరంగంగా వ్యాఖ్యానించారు. అదే విధంగా మహబూబ్‌నగర్‌ లోనూ ఇప్పటికే పార్టీలో పనిచేస్తున్న వారిపై నియోజకవర్గ వ్యాప్తంగా సర్వే జరిపి, ఎవరికి ప్రజల్లో ఆదరణ ఉంటే వారికే టిక్కెట్లు ఇవ్వాలనే వాదనను కొందరు, సామాజిక బల బలాల ఆధారంగా పోటీకి అవకాశం కల్పించా లని మరికొందరు కార్యదర్శి ముందు నివేదిం చారు. వచ్చే ఎన్నికల్లో మహాకూటమి ఏర్పాట యితే ఏ సీటు ఎవరు తన్నుకుపోతారనే విషయంపైనా నాయకులు తమ ఆందోళనను పార్టీ కార్యదర్శికి నివేదించారు. పొత్తుల విషయంలో ఏ నియోజకవర్గం నుంచి కూడా సానుకూలత వ్యక్తం కాలేదు. మొత్తంగా జిల్లాలో బలంగా ఉన్న కాంగ్రెస్‌లో నేతల మధ్య విబేధాలే ప్రధాన లోపమని, దాన్ని అధిష్టానం సరిచేసి, నిష్పక్షపా తంగా గెలుపు గుర్రాలకు టిక్కెట్లిస్తే వచ్చే ఎన్నిక ల్లో అన్ని స్థానాల్లో విజయం తమదేననే వాదనను పార్టీ నాయకులు అధిషానానికి స్పష్టం చేశారు. కరీంనగర్‌లో జరిగిన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా రాజకీయ అనిశ్చితి నెలకొందని అన్నారు. తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షల మేరకు సోనియాగాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని, రాష్ట్రాన్ని కాపడుతూ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత తమపై ఉందన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చుతామని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌.. నాలుగేళ్ల పాలనలో ప్రజల ఆకాంక్షలను ధ్వంసం చేసిందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని, అవినీతి రికార్డు స్థాయికి చేరుకుందని విమర్శించారు.టీఆర్‌ఎస్‌ను గద్దెదించి కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టేందుకు ప్రజలు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత సిద్ధంగా ఉన్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో అధికారంలోకి రానుందని అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు పార్టీ సంప్రదాయాలను చెడగొట్టకుండా విభేదాలను విడనాడి ఐక్యతతో టీఆర్‌ఎస్‌ ఓటమే ఎజెండాగా పార్టీ పటిష్టతకు పాటుపడాలన్నారు.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు.ఎన్నికల కోసం రూపొందించాల్సిన విధానాలు తదితరాంశాలపై జిల్లా నేతలతో సమీక్షించారు. ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న వారితో సంప్రదింపులు జరిపారు. అనంతరం టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క, రేణుకాచౌదరి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, సంబాని చంద్రశేఖర్‌, వనమా వెంకటేశ్వరరావుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు .పార్టీని పటిష్ఠం చేయడం, అంతర్గత లోపాలు, విభేదాలను సరిదిద్దుకోవడమే లక్ష్యంగా నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి, కార్యకర్తల అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు ఏ ఐసిసి ప్రతినిధులు చెప్పారు. ఎన్నికలకు ఒకట్రెండు నెలల ముందు అభ్యర్థులను ప్రకటించడం ఏఐసిసి ప్రతినిధులు హామీ ఇచ్చారు. మళ్లీ నియోజకవర్గాలకే వచ్చి అభ్యర్థులను గుర్తిస్తామన్నారు. సీనియర్‌ నాయకులు విభేదాలను పక్కనబెట్టి కూర్చొని మాట్లాడాలని, పార్టీ అభ్యున్నతికి పాటుపడాలని పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని కార్యకర్తల్లో ధైర్యం నూరిపోశారు. అదే సమయంలో టికెట్ల పంపిణీలో కార్యకర్తల అభిష్టానికే ప్రాధాన్యత ఉంటుందని, నేతల సిఫార్సులను పట్టించుకునేది లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఉమ్మడి ఆదిలాబాద్ లో వర్గపోరు, గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. కొద్ది నెలలుగా రాష్ట్రంలో పరిణామాలు జిల్లా రాజకీయాల్లోనూ వర్గపోరును తేటతెల్లం చేస్తున్నాయి. ఉమ్మడి జిల్లాకు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నియోజకవర్గాల్లో తన పట్టుకోసం ప్రయత్నిస్తున్నారు. మరోపక్క మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు తన ప్రాబల్యాన్ని చాటేందుకు యత్నాలు చేస్తున్నారు. దీంతో అన్ని నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో పార్టీ మూడు ముక్కలైంది. మాజీ మంత్రి, సీనియర్‌ నాయకులు సి.రాంచంద్రారెడ్డి ఒక గ్రూపుగా, టీపీసీసీ కార్యదర్శి, ఏఐసీసీ సభ్యురాలు గండ్రత్‌ సుజాత మరో గ్రూపుగా, ఆదిలాబాద్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి భార్గవ్‌దేశ్‌పాండే ఇంకో గ్రూపు కొనసాగిస్తుండడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది.బోథ్‌లో సోయం బాపురావు, అనిల్‌జాదవ్‌లు ఒకే పార్టీలో ఉన్నప్పటికీ కలిసి నడిచింది లేదు. మరోవైపు ఆదివాసీ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న సోయం బాపురావు వచ్చే ఎన్నికల్లో బోథ్‌ నియోజకవర్గం నుంచి బరిలో నిలుస్తారా.. లేనిపక్షంలో ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం నుంచి బరిలోకి దిగుతారా అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఇదే నియోజకవర్గానికి చెందిన నరేష్‌జాదవ్‌ కిందటిసారి కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మరోసారి ఆయన ఎంపీ స్థానానికే పోటీ చేయాలని భావిస్తున్నారు. మాజీ మంత్రి, సీనియర్‌ నాయకులు రాంచంద్రారెడ్డి వర్గంలో కొనసాగుతున్న ఆయన సీనియర్‌ నాయకుల అండదండలు ఉంటాయన్న విశ్వాసంతో కదులుతున్నారు. నిర్మల్‌లో డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందాలనే ఉత్సాహంతో ముందుకు కదులుతున్నారు. ముథోల్‌ నియోజకవర్గంలో అన్నదమ్ముళ్లు నారాయణరావుపటేల్, రామారావు పటేల్‌ల మధ్య గ్రూపు రాజకీయాలు నెలకొన్నాయి.సీనియర్‌ నాయకులైన నారాయణరావు పటేల్‌ మరోసారి ఇక్కడినుంచి బరిలో దిగుతారా, లేనిపక్షంలో మహేశ్వర్‌రెడ్డి వర్గంతో కొనసాగుతున్న రామారావు పటేల్‌ పైచేయి సాధిస్తారా అనేది రానున్న రోజుల్లో తేటతెల్లం కానుంది. ఖానాపూర్‌ నియోజకవర్గంలో భరత్‌ చౌహాన్, హరినాయక్‌ల మధ్య వైరుధ్యం ఉంది. ఆసిఫాబాద్‌లో ఆత్రం సక్కు మరోసారి పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. కాగజ్‌నగర్‌లో రావి శ్రీనివాస్, శ్రీనివాస్‌యాదవ్‌లు ఉండగా, మంచిర్యాలలో ప్రేమ్‌సాగర్‌రావు, అరవింద్‌రెడ్డిలు పార్టీలో సీనియర్లుగా ఉన్నారు. చెన్నూర్‌లో బోడ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే సంజీవ్‌రావు, బెల్లంపల్లిలో చిలుమురి శంకర్, దుర్గాభవానిలు నియోజకవర్గంలో పట్టుకు యత్నాలు చేస్తున్నారు.