క్రికెటర్ కు ముందు మోదీ గ్రూప్ లో కపిల్ దేవ్ ఉద్యోగి.

న్యూ ఢిల్లీ:
భారత్ కు తొలి ప్రపంచ కప్ ను అందజేసిన హర్యానా హరికేన్ కపిల్ దేవ్ గురించిన ఓ ఆసక్తికర విషయం ఇది. 1978లో కపిల్ దేవ్ భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. 1979లో మోదీ స్పిన్నింగ్ అండ్ వీవింగ్ కంపెనీలో ఆయనకు ఉద్యోగం లభించింది. 1979 నుంచి 1982 వరకు సుమారు మూడేళ్లపాటు ఆ సంస్థలోనే ఆయన పనిచేశాడు. అయితే, కొన్ని నెలలు మాత్రమే కపిల్ జీతం అందుకున్నాడు. మిగిలిన నెలలకు సంబంధించిన జీతం కపిల్ అందుకోలేదు. సుమారు ముప్పై ఆరేళ్ల క్రితం నాటి జీతాన్ని, కపిల్ ఇప్పుడు అందుకున్నారు. ఈ విషయాన్ని సదరు సంస్థ మేనేజర్ రాజేంద్ర శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1979లో సంస్థ డైరెక్టర్, క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ వైకే మోదీ కోరిక మేరకు కపిల్ దేవ్, మోదీ గ్రూప్ లో పనిచేసినట్టు చెప్పారు. మూడేళ్లపాటు పని చేసిన కపిల్ దేవ్ కొన్ని నెలల జీతం మాత్రమే అందుకున్నారని చెప్పారు. తాజాగా, ఇందుకు సంబంధించిన లెక్కలన్నీ సరిచూసి, కపిల్ దేవ్ కు అందాల్సిన మొత్తం రూ.2.75 లక్షలను ఆయన ఖాతాలో జమ చేశామని రాజేంద్ర తెలిపారు.