ఖమ్మం టిఆర్ఎస్ ‘ఖిచిడీ’.

ఒక పార్టీ నుంచి ప్రజల ఓట్లతో గెలిచిన నేతలు మరో పార్టీలో చేరడంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ‘పార్టీ ఫిరాయింపులపై ఉన్నవ్యతిరేకతను’ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అధిగమించగలవని టి ఆర్ ఎస్ నమ్ముతున్నది. మరోసారి విజయం తమదేనన్న ధీమా అధికార పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. వివిధ పార్టీల నుంచి వచ్చిన చేరిన నాయకులు ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లు గ్రూపు రాజకీయాలు నడిపిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలోనే 2, 3 గ్రూపులు ఉండటం అధికార పక్షానికి సంకటంగా మారింది. వలసలు వచ్చిన సందర్భంలో తమతో పాటు వచ్చిన వారికి టికెట్లు ఇప్పించుకోవాలని కొందరు పట్టుబడుతున్నారు. సత్తుపల్లి నియోజకవర్గ ఇంఛార్జీగా ఉన్న పిడమర్తి రవిని పక్కనబెట్టి, దయానంద్ అనే తన అనుచరుడికి మద్దతు ఇస్తున్నారని ఎం.పి. పొంగులేటిశ్రీనివాసరెడ్డిపై ముఖ్యమంత్రి కి ఫిర్యాదులు వెళ్లాయి. మధిరలో టిఆర్ ఎస్ ఇంఛార్జి బమ్మెర రామ్ముర్తిని కాదని, తన అనుచరుడైన లింగాల కమల్ రాజ్ ను ఎం.పి. తెరపైకి తీసుకొస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.ఎక్కడికక్కడ ‘గ్రూపుల’ను ప్రోత్సహిస్తూ ఖమ్మంలో వన్ మ్యాన్ షో చేయాలని ఎం.పి. ప్రయత్నిస్తున్నట్టు విమర్శలున్నవి.

ఎస్.కె.జకీర్.
గత ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానాన్నే గెలుచుకున్నప్పటికీ ప్రస్తుతం 7 స్థానాల్లో పాగా వేసిన అధికార పక్షం టిఆర్ఎస్ ‘కలగూర గంపలా తాయారైంది. ఆ పార్టీ నాయకుల మధ్య వైరుధ్యాలు తలనొప్పిగా మారాయి. స్వపక్షంలోనే విపక్షంగా ఉన్న నేతల వ్యవహారం..అన్ని సీట్లకు వెల్లువెత్తుతున్న ఆశావహుల సంఖ్యతో పెరిగిన సీట్ల లొల్లి అధికారపార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నది.ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 7 శాసనసభ స్థానాలు టిఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. మధిరలో కాంగ్రెస్, సత్తుపల్లిలో తెలుగుదేశం , భద్రాచలంలో సీపీఎం పార్టీల ఎమ్మెల్యేలు ఉన్నారు. రెండు ఎంపీ స్థానాలు టిఆర్ఎస్ ఖాతాలోనే ఉన్నాయి. 2014 ఎన్నికల్లో కొత్తగూడెం నియోజకవర్గంలో జలగం వెంకట్రావు మాత్రమే టిఆర్ ఎస్ అభ్యర్థిగా విజయం సాధించారు. 4 స్థానాల్లో కాంగ్రెస్ 3 స్థానాల్లో వైకాపా, ఒక్కో స్థానాల్లో తెదేపా, సీపీఎం గెలుపొందాయి. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్, ఇల్లెందు నుంచి గెలిచిన ఎమ్మెల్యే కోరం కనకయ్యలు టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. పాలేరు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అకాల మరణం తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో ఆ స్థానాన్ని కూడా టిఆర్ఎస్ తన ఖాతాలో వేసుకుంది. వైకాపా నుంచి గెలిచిన ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితోపాటు వైరా, పినపాక, అశ్వారావుపేట, నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన మదన్ లాల్, పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు అధికారపక్షంలో లో చేరారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా తాము చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే తమకు శ్రీరామ రక్షగా నిలుస్తాయని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ధీమాగా ఉన్నారు. ప్రజలకుఇచ్చిన హామీలు తుంగలో తొక్కిన అధికార పక్షంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమను గెలిపిస్తుందని ప్రతిపక్ష పార్టీలు ఆశాభావంతో ఉన్నాయి. ఎప్పటిలాగే తలోదిక్కు అన్నట్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య అనైక్యత వారికి శాపంలా మారింది. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో పార్టీల మధ్య హోరాహోరీ పోటీ తప్పేలా లేదు. ఒక పార్టీ నుంచి ప్రజల ఓట్లతో గెలిచిన నేతలు మరో పార్టీలో చేరడంపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ‘పార్టీ ఫిరాయింపులపై ఉన్నవ్యతిరేకతను’ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అధిగమించగలవాని టి ఆర్ ఎస్ నమ్ముతున్నది. మరోసారి విజయం తమదేనన్న ధీమా అధికార పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. వివిధ పార్టీల నుంచి వచ్చిన చేరిన నాయకులు ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లు గ్రూపు రాజకీయాలు నడిపిస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలోనే 2, 3 గ్రూపులు ఉండటం అధికార పక్షానికి సంకటంగా మారింది. వలసలు వచ్చిన సందర్భంలో తమతో పాటు వచ్చిన వారికి టికెట్లు ఇప్పించుకోవాలని కొందరు పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి మూల స్థంభాల్లాంటి కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ల మధ్య ఉన్న విబేధాలు పార్టీపై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తున్నాయి. ఇక తెలుగుదేశంలో సీనియర్ నాయకులు నామా నాగేశ్వరరావు, సండ్ర వెంకటవీరయ్య పార్టీ శ్రేణుల్లో భరోసానింపే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పలు చోట్ల నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు లేకపోవడం టిడిపికి ప్రతికూల అంశం. కమ్యూనిస్టులకు చట్ట సభలలో ప్రాతినిధ్యం తగ్గిపోయినా ఖమ్మం జిల్లాలో గెలుపు ఓటములను వాళ్ళు ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు. ఆ పార్టీలు ఎవరితో జట్టు కడతాయో స్పష్టత లేదు. కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్న పాలేరు నియోజకవర్గం మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అకాల మరణం తర్వాత పూర్తిగా టిఆర్ఎస్ ఆధీనంలోకి వెళ్ళిపోయింది. అధికారపక్షం అభ్యర్థిగా ఘనవిజయం సాధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరావు నియోజకవర్గాన్ని మునుపెన్నడూ లేనంత అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళ్తున్నారు. భక్త రామదాసు ఎత్తిపోతల పథకంతో కరవు ప్రాంతమైన తిరుమలాయపాలెం మండలం రూపురేఖలు పూర్తిగా మారిపోయినవి. నియోజకవర్గంలో పాలేరు పాత కాల్వల పనుల్ని పూర్తిచేసి ఆ ప్రాంతమంతా సస్యశ్యామలంగా పచ్చని పంటలతో కళకళలాడుతున్నవి. అది మంత్రి తుమ్మల చలవేనని ప్రజలు పొగుడుతున్నారు. మారుమూల గిరిజన పల్లెలు, తాండాలన్నింటికీ రహదారుల సౌకర్యం ఏర్పాటు చేయడం వల్ల గిరిజనులను తుమ్మల ఆకట్టుకుంటున్నారు. అయితే…ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలను సరిగ్గా చేరదీయడం లేదనన్నది తుమ్మలకున్న ప్రతికూల అంశం. రాష్ట్రంలోనే తొలిసారిగా ముఖ్య కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి మంత్రి తుమ్మల అధికారపార్టీకి ‘మెడల్’ గా మారారు. రాంరెడ్డి వెంకటరెడ్డి మరణం తర్వాత ఉప ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన సతీమణి సుచరితారెడ్డి ఆ తర్వాత నియోజకవర్గంలో తిరిగిన దాఖలాల్లేవు. వచ్చే ఎన్నిక్లలో పోటీ చేస్తుందో లేదో కూడా తెలియదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కందాల ఉపేందర్ రెడ్డి తో పాటు రాంరెడ్డి సోదరుడి కొడుకు చరణ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు జలగం ప్రసాదరావు కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక టిడిపి తరపున ఆ పార్టీ సీనియర్ నాయకురాలు స్వర్ణ కుమారి రంగంలోకి దిగనున్నారు. పాలేరు నియోజకవర్గం రూపురేఖలు మార్చిన మంత్రి తుమ్మలకు ప్రత్యర్థులు ఎలాంటి పోటీ ఇస్తారన్నది ప్రస్తుత చర్చ. కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి, టిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కు సొంతపార్టీలో అసంతృప్తులు తలనొప్పిగా మారాయి. నగరపాలక సంస్థలో టిఆర్ఎస్ పాలకవర్గంగా ఉన్నప్పటికీ మేయర్, కమిషనర్ తో విబేధాలకు తోడు కార్పొరేటర్లే మూడు గ్రూపులుగా విడిపోయారు. ఇటీవల ఈ పంచాయతీ రాజధానికి చేరడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే అజయ్ కుమార్ పై ఆగ్రహంగా ఉన్నారు.తెరాస ఆవిర్భావం నుంచీ పార్టీలో పనిచేసిన మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ఆర్జేసీ కృష్టతో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడే అభ్యర్థిగా బరిలో ఉన్నానని, అధికారంలోకి వచ్చిన టిఆర్ ఎస్ తరఫున మరోసారి టికెట్ అడుగుతానని ఆర్జేసీ కృష్ణ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. ఈ పరిణామాలు అజయ్ కుమార్ కు తలనొప్పిగా మారాయి. దీనికి తోడు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ప్రత్యేక అనుచరవర్గాన్ని ఏర్పాటు చేసుకోవడంతో సరికొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.నియోజకవర్గంలో నిత్యం పర్యటనలు,ప్రజలతో మమేకమవుతుండటం ఆయనకు కొద్దిగా కలిసివచ్చే సానుకూల అంశం. ఐటీ హబ్ నిర్మాణం, లకారం ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులతోపాటు రాష్ట్రంలోనే తొలిసారిగా కల్యాణలక్ష్మీ చెక్కులను,లబ్ధిదారుల ఇంటికెళ్లి పంపిణీ చేయడం, నగరంలో దాదాపు 2 వేల 500 రెండు పడక గదులు ఇళ్లు లబ్ధిదారుల కోసం కట్టిస్తుండటం ఎమ్మెల్యే అజయ్ కుమార్ కు కలిసివచ్చే అంశాలు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరావు, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ మానుకొండ రాధాకిషోర్ టికెట్లు ఆశిస్తున్నారు. బీసీ నేతగా ఉన్న గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ అగ్రనాయకులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియా తదితరులతో నేరుగా కాంగ్రెస్ పార్టీ టికెట్ సొంతం చేసుకుని ఖమ్మం బరిలో నిలవాలని వద్దిరాజు రవిచంద్ర యోచిస్తున్నారు. బీఎల్ ఎఫ్, తెదేపా నుంచి మాత్రం ఇప్పటి వరకు అభ్యర్థిని ఖరారు చేయలేదు. వైరా నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ కు ఎదురుగాలి వీస్తోంది. సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకతను ఆయన ఎదుర్కుంటున్నారు. ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మదన్ లాల్ విబేధాలు తారాస్థాయికి చేరినవి. గ్రూపు రాజకీయాలకు వైరా నియోజకవర్గం కేంద్ర బిందువుగా నిలుస్తోంది. వైరా మండలంలో ఎంపీ వర్గీయులపై కేసులు నమోదు చేయడం, కొణిజర్ల లో ఓ ప్రభుత్వ కార్యక్రమంలో ఇరువురు నేతల అనుచరగణం బాహాబాహీకి దిగడం పరిస్థితి మరింత క్లిష్టంగా మారుస్తోంది. ఇంతవరకూ నియోజకవర్గ కేంద్రంలో రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టిఆర్ ఎస్ నుంచి మదన్ లాల్ తోపాటు టీఎస్ పి ఎస్ సి సభ్యురాలుగా ఉన్న డాక్టర్ చంద్రావతి, తెదేపా నుంచి టిఆర్ ఎస్ లో చేరిన బానోతు బాలాజీ గులాబీ టికెట్ కోసం సర్వశక్తులొడ్డుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాములు నాయక్ కు టికెట్ వస్తే మాత్రం మదన్ లాల్ కు గట్టీ పోటీ తప్పదు. మంత్రి తుమ్మల ఆశీస్సులతో మరోసారి టికెట్ తెచ్చుకుని గెలిచితీరుతానన్న భావన ఎమ్మెల్యే మదన్ లాల్ లో ఉన్నది. సత్తుపల్లి నియోజవకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధికార పార్టీ నాయకుల కన్నా ముందంజలో ఉన్నారు. ఓ వైపు రాష్ట్రవ్యాప్తంగా టిడిపి బలహీనపడుతున్నా, సత్తుపల్లి లో మాత్రం పరిస్థితి టిడిపికి అనుకూలంగా ఉన్నట్టు రాజకీయ పరిశీలకులంటున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం, సమస్యల పరిష్కారంలో చొరవ చూపడం, రైతు సమస్యలపై స్పందించడం సహా ఏ సమస్య వచ్చినా పరిష్కారం కోసం చొరవ చూపుతుండటం’ సండ్ర’కు కలిసివచ్చే అంశాలు. గత ఎన్నికల్లో టిఆర్ ఎస్ తరపున పోటీ చేసిన ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవితోపాటు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుడు మట్టా దాయానంద్ తెరాస నుంచి రేసులో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ ను రంగంలోకి దించాలని పార్టీ యోచిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిథ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గంలో ఈ సారి కూడా ‘వార్ వన్ సైడ్ ‘ లాగానే కనిపిస్తోంది. అధికార టిఆర్ఎస్ నుంచి బలమైన అభ్యర్థి లేకపోవడం, టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మోత్కుపల్లి నర్సింహులు మళ్లీ మధిర వైపు కన్నెత్తి చూడకపోవడం భట్టి విక్రమార్కకు కలిసివస్తోంది. గత ఎన్నికల్లో టిఆర్ ఎస్ నుంచి పోటీచేసిన బమ్మెర రామ్ముర్తి తోపాటు ఈ సారి పార్టీ ఆదేశిస్తే బరిలోకి దిగుతానని జడ్పీ ఛైర్మన్ గడిపల్లి కవిత చెబుతున్నారు.  అయితే .కలగూర గంపలా ఉన్న అధికారపార్టీలో అందరినీ కలుపుకుని పోవడం ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కష్టతరంగానే మారింది. గెలిచిన నాటి నుంచీ ఆయన వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నాయకులు, కార్యకర్తల్నే వెంటేసుకుని తిరుగుతారన్న అపవాదు ఉంది. టిఆర్ ఎస్ ఎమ్మెల్యేలున్న స్థానాలతో పాటు ఇతర పార్టీలు గెలిచిన స్థానాల్లోనూ టిఆర్ ఎస్ లో ‘గ్రూపు రాజకీయాలు’ చేస్తున్నారన్న విమర్శ ఉంది. వైరా ఎమ్మెల్యే మదన్ లాల్ తో ఇటీవల వరుసగా చోటుచేసుకున్న విబేధాలు నేతల మధ్య దూరాన్ని చూపుతున్నాయి. సత్తుపల్లి నియోజకవర్గ ఇంఛార్జీగా ఉన్న పిడమర్తి రవిని పక్కనబెట్టి, దయానంద్ అనే తన అనుచరుడికి మద్దతు ఇవ్వడం పై ముఖ్యమంత్రి కి ఫిర్యాదులు వెళ్లాయి. మధిరలో టిఆర్ ఎస్ ఇంఛార్జి బమ్మెర రామ్ముర్తిని కాదని, తన అనుచరుడైన లింగాల కమల్ రాజ్ ను తెరపైకి తీసుకొస్తున్నారన్న ప్రచారం సాగుతోంది.దత్తత తీసుకున్న సత్తుపల్లి మండలం గంగారం గ్రామ రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చినా ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోకపోవడం ఎంపీకి ప్రతికూలంగా ఉన్నది.రాష్ట్రంలోనే ఎంపీ నిధులను 100శాతం కేటాయించిన ఎంపీగానూ పొంగులేటి ర్యాంకు సాధించడం ఆయనకు సానుకూలంగా ఉంది. నియోజకవర్గ పరిధిలో ఎవరికి ఏ సాయం కావాలన్నా అందుబాటులో ఉండటం మాత్రం ఎంపీకి సానుకూల అంశం. గత ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి నుంచి పోటీచేసిన సీపీఐ సీనియర్ నాయకుడు నారాయణ మళ్లీ నియోజకవర్గంలో అడుగు పెట్టకపోవడం, తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పూర్తిస్థాయిలో నియోజకవర్గంపై దృష్టి సారించకపోవడం ఎంపీ పొంగులేటికి సానుకూల అంశమే. నామా నాగేశ్వరావు బరిలో నిలిస్తే ఎంపీ పొంగులేటికి గట్టి పోటీ తప్పదు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా కాకుండా ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రి కావాలని పొంగులేటి ఆశిస్తున్నారు. అంతిమంగా కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడవలసి ఉన్నది.