‘గంగుల’ వర్సెస్ ‘గజ్జెల’.

  • అక్రమ మైనింగ్ పై కాంగ్రెస్ నేత పోరాటం.  
  • ఇరకాటంలో సర్కార్.
  • ఈ నెల 31 న హైకోర్టు విచారణ.

ఎస్.కె.జకీర్.
కరీంనగర్ జిల్లాలో అక్రమ మైనింగ్ పై ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు, టిపిసిసి అధికార ప్రతినిధి గజ్జెల కాంతం చేస్తున్న న్యాయపోరాటం టిఆర్ఎస్ ను, అటు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గ్రానైట్ పారిశ్రామిక వేత్తలు అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నారని,  ప్ప్రభుత్వానికి రావలసిన 750 కోట్ల సీనరేజి పన్ను ఎగవేశారంటూ గజ్జెల కాంతం హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం కింద కేసు వేశారు. దీనిపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. సమాజానికి అక్రమ మైనింగ్‌ ప్రమాదకారిగా మారినట్టు హైకోర్టు అభిప్రాయపడింది. అడ్డూ అదుపూ లేకుండా సాగుతున్న అక్ర మ మైనింగ్‌ వల్ల తీవ్ర స్థాయిలో పర్యావరణం ప్రభావితమవుతున్నట్టు అందోళన వ్యక్తం చేసింది. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన జరుగుతున్నా అధికారయంతరాంగం లో చలనం కనిపించడం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. తాము ఈ వ్యవహారాన్నితేలిగ్గా తీసుకునేది లేదని హైకోర్టు తేల్చిచెప్పింది. కరీంనగర్‌ జిల్లాలో ‘గ్రానైట్‌ బ్లాకుల కొలతల’ను తక్కువగా చూపుతూ పలు గ్రానైట్‌ సంస్థలు భారీ మొత్తంలో సీనరేజీని ఎగవేశాయంటూ దాఖలైన గజ్జెల ‘పిల్‌’ పై హైకోర్టు స్పందించింది.ఈ వ్యవహారం పై పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి, గనులశాఖ డైరెక్టర్, విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌తో పాటు సీనరేజీ ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్వేతా ఏజెన్సీస్, శ్వేతా గ్రానైట్స్, ఏఎస్‌ షిప్పింగ్, జేఎం బాక్సి కంపెనీ, మైథిలీ ఆదిత్య, కేవీఆర్‌ ఏజెన్సీస్, అరవింద్‌ ఏజెన్సీస్‌ తదితరులకు నోటీసులను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.అక్రమ మైనింగ్ , సీనరేజి పన్ను ఎగవేత కేసుల విచారణ ఈ నెల 31కి వాయిదా పడింది. అయితే ఈ కేసు రాజకీయంగా దుమారం రేగుతున్నది. సీనరేజి ఎగవేత ఆరోపణలు ఎదుర్కుంటున్న ‘శ్వేతా గ్రానైట్స్’ వంటి సంస్థలు కరీంనగర్ శాసనసభ్యుడు, టిఆర్ఎస్ నాయకుడు, కొంతకాలంగా మంత్రి కేటీఆర్ కు సన్నిహితంగా ఉంటున్న గంగుల కమలాకర్ కు, ఆయనకు సంబంధించిన వారికి చెందినవని తెలుస్తున్నది. ‘పిల్’ దాఖలు చేసిన గజ్జెల కాంతం దళిత నాయకుడు. గత ఎన్నికల్లో కంటోన్ మెంటు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయారు. ఈ సారి ఆయన చొప్పదండి అసెంబ్లీ సెగ్మెంటు నుంచి పార్టీ టికెట్టు కోరుతున్నారు. అందువల్ల కోర్టులో జరుగుతున్న ‘పోరాటం’ కాంగ్రెస్ , టిఆర్ఎస్ ల మధ్య కేంద్రీకృతమైనట్టుగా కనిపిస్తున్నది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు గ్రానైట్ కంపెనీలు ఉన్నవి. గ్రానైట్ పరిశ్రమ ఆ జిల్లాలో చాలా కాలంగా సాగుతున్నది. గ్రానైట్ ‘బ్లాకుల’ ను రైల్వే ద్వారా రవాణా చేస్తున్నారు. ఈ ‘బ్లాకుల’ పరిమాణాన్ని తక్కువ గా చూపుతూ పన్ను చెల్లించకుండా ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నట్టు గజ్జెల కాంతం తన ‘పిల్’ లో ఆరోపించారు. సీనరేజి పన్ను ఎగవేత భారీమొత్తంలో జరుగుతున్నట్టు ఇదివరలో విజిలెన్సు ఎన్ఫోర్స్ మెంటు అధికారులు నిర్ధారించినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నది ఆయన అభియోగం. ఎగుమతి చేసిన ‘ గ్రానైట్ కొలతల’లో 7. 69 క్యూబిక్ మీటర్ల కన్నా తక్కువ చూపడం వల్ల ప్రభుత్వానికి 124 కోట్ల నష్టం జరిగినట్టు కాంతం చెబుతున్నారు. నిబంధనల ప్రకారం ఈనష్టానికి ఐదు రెట్ల పెనాల్టీ వసూలు చేయవలసి ఉన్నదని ఆయన వాదన.