గోదావరి కళకళ.. కృష్ణమ్మ విలవిల.

 

ఎస్.కె. జకీర్.
తెలుగు రాష్ట్రాలలోని సాగునీటి ప్రాజెక్టుల్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒకవైపు గోదావరిపై కట్టిన ప్రాజెక్టులకు వరదనీరు పరవళ్లు తొక్కుతుండగా కృష్ణానదిపై కట్టిన ప్రాజెక్టులు నీరు లేక కళ తప్పాయి. గత ఏడాది ఇదే సమయానికి నిండుకుండలని తలపించిన శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు ఇప్పుడు ఎండుతున్నాయి. గోదావరి బేసిన్ కు 52,442 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా కృష్ణా బేసిన్ లో 48,037 క్యూసెక్కుల ఇన్ ఫ్లో మాత్రమే ఉండటంతో కృష్ణా తీరప్రాంతాలకు ఆందోళన కలిగించేదే.పోయినేడాది ఇదే సమయానికి ఇప్పటితో పోలిస్తే శ్రీశైలం రిజర్వాయర్లో 9 టీఎంసీలు, నాగార్జున సాగర్ లో 16 టీఎంసీలు అధికంగా నీరుంది. ఇప్పుడు చూస్తే 215.81 టీఎంసీల సామర్థ్యం ఉన్న శ్రీశైలంలో కేవలం 13 శాతం మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయి. నాగార్జున సాగర్ పూర్తి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ఇప్పుడు 133.37 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. గోదావరి పరీవాహక ప్రాంతాలకు భారీగా వరదనీరు పోటెత్తుతోంది. కాళేశ్వరంలో వరదనీరు పుష్కరఘాట్ మెట్లను తాకి ప్రవహిస్తోంది. భద్రాచలంలో గోదావరి 20 అడుగులను తాకింది. పూర్తి స్థాయి నీటిమట్టం 1,091 అడుగులు ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 1,058 అడుగులు నిండింది. గత వారం బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లు తెరిచారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణకు 0.5 టీఎంసీల నీరు వచ్చి చేరింది. మహారాష్ట్ర అక్టోబర్ వరకు బాబ్లీ గేట్లు తెరిచి ఉంచనుంది. మహారాష్ట్ర, కర్ణాటకలలో నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండటంతో ఆయా ప్రాంతాలలో భారీగా వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. అదే జరిగితే తెలంగాణ ప్రాజెక్టులకు మరిన్ని ఇన్ ఫ్లోస్ పెరిగే అవకాశం ఉంది. జూలై 13న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మరింత వర్షపాతం కురియవచ్చు. భారీ వర్షసూచనతో తెలంగాణ ప్రభుత్వం సాగునీటి పారుదల ఇంజనీర్లు, అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది.