గౌతమి హత్య కేసుపై ప్రభుత్వ సంచలన నిర్ణయం.

  • నాటి దర్యాప్తు తీరుపై ప్రభుత్వం సీరియస్‌ 
  • ముగ్గురి సస్పెన్షన్‌. మరొకరికి చార్జి మెమో.
  • జెడ్పీటీసీ బాలం ప్రతాప్‌, సజ్జా బుజ్జి, రమేష్‌లకు టీడీపీ ఉద్వాసన.

నరసాపురం:
ఏడాదిన్నర క్రితం గౌతమి కేసును దర్యాప్తు చేసిన పోలీస్‌ అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది. గౌతమిది హత్య అని సీఐడీ విచారణలో తేలడంతో ఈ కేసును అప్పట్లో పక్కదారి పట్టించిన పోలీస్‌ అధికారులపై చర్యలు తీసుకొక తప్పడం లేదు. ఇందులో ముగ్గురు పోలీస్‌ అధి కారులతో పాటు కేసును పర్య వేక్షించిన ఒక ముఖ్య అధికారి పేరు కూడా వినిపిస్తున్నది. గత ఏడాది జనవరి 18న నరసాపురం పట్టణానికి చెందిన గౌతమి దిగమర్రు వద్ద ‘రోడ్డ ప్రమాదం’లో మృతి చెందింది. ప్రాణాలతో బయటపడిన గౌతమి సోదరి పావని, తల్లి అనంతలక్ష్మిలు తమ కుమార్తెది ప్రమాదం కాదని, హత్య అంటూ ఆరోపించారు. వీరికి పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు అండగా నిలిచాయి. అయితే సీఐడీ దర్యాప్తులో బ్యాంకు ఖాతాలు,కాల్‌ డేటాల్లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీటి ఆధారంగా కేసును చేధించారు. విశాఖకు చెందిన కిరాయి హంతకుల ఖాతాల్లో నగదు పడటం, వాళ్ళ కాల్‌ డేటాను పరిశీలించిన సీఐడీ దీన్ని హత్యగా నిర్ధారిం చింది. గౌతమి తల్లి, సోదరి ఆరోపిస్తున్న వ్యక్తులతో పాటు మరో ఐదుగురికి ఈ కేసులో సంబంధం ఉందంటూ సాక్ష్యా లతో దర్యాప్తు చేసింది. దీంతో తేరుకున్న పోలీసులు హడా వుడిగా తమపై పడిన అవినీతి మచ్చను కడిగేసుకునే ప్రయత్నంలో తిరిగి కేసును ‘హత్య కేసు’గా మార్చారు. ఇంత కీలకమైన కేసును ప్రాథమికంగా పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయకుండా ప్రమాదమేనంటూ తేల్చిన అప్పటి అధికారులపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీంతో శాఖాపరంగా చర్యలు తీసుకోవాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. దీంతో ఎవరిపై వేటు పడుతుందన్నది పోలీస్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది.కేసు దర్యాప్తు విషయంలో పోలీసులు ఎవరిమాటా వినలేదు. చివరి వరకు ప్రమాదమేనంటూ వాదిస్తూ వచ్చారు. మీడీయాపైనా మండిపడ్డారు. కేసు దర్యాప్తులో హత్యకు సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకలేదని మీడియా వాళ్ళు అతి చేస్తున్నారంటూ అప్పటి ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ మీడియా పరిశోధన కథనాలు రాస్తే చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. తరువాత 15 రోజుల్లో ఈ కేసును మూసివేశారు. తమకు ఈ కేసు విషయంలో ఎవరూ సహకరించలేదని, కనీసం బంధువులు కూడా మాట సహాయం చేయలేదని గౌతమి తల్లి, సోదరి వాపోయారు. పట్టణానికి చెందిన ఒక లాయర్‌ ఎంతో సహకారం అందించారని చెప్పారు. ఒకానొక దశలో చనిపోవాలని కూడా భావించినట్టు తెలిపారు. అయితే సీఐడీ అధికారులు మాకు మనో ధైౖర్యం కల్పించారని చెప్పారు. ఏ.ఎస్పీ రత్నపై చర్య తీసుకోవాలని గౌతమి తల్లి అనంతలక్ష్మి డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసును సీఐడీ తీసుకోకపోతే వాస్తవాలు వెలుగులోకి వచ్చేవి కాదు. తాము మొదటి నుంచీ గౌతమిది హత్య అని ఆరోపిస్తుంటే అప్పటి అదనపు ఎస్పీ రత్న తమను భయపెట్టేదని అనంతలక్ష్మి అంటున్నారు. తమపై తప్పుడు కేసులు నమోదు చేస్తామని ఎఎస్పీ హెచ్చరించేదని, అయినా భయపడలేదని, న్యాయం కోసం తన తల్లి, తానూ ఎంతో పోరాడామని గౌతమి సోదరి పావని చెప్పారు. పోలీసులు నీరుగార్చినా సీఐడీ నిజాయితీగా నిలబడి న్యాయం చేసిందన్నారు. గౌతమి హత్య కేసు అప్పట్లో రాష్ట్రస్థాయిలో తీవ్ర సంచలనం సృష్టించింది. గౌతమిది హత్యేనంటూ కుటుంబ సభ్యులు, బంధువులు పోలీసు అధికారులకు చెప్పినప్పటికీ కాదు ప్రమాదమేనంటే కేసు మూసేశారు. ప్రస్తుతం గౌతమిది రోడ్డు ప్రమాదం కాదు హత్యేనని తేలింది. దీంతో ఈ కేసు దర్యాప్తులో కీలక బాధ్యతలు పోషించిన అధికారుల్లో ఆందోళన మొదలైంది. గతంలో 2000 సంవత్సరంలో చింతలపూడి సర్కిల్‌లో ఒక మహిళ మరణాన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేసి ఆ తరువాత వడగాడ్పు మరణంగా తేల్చేశారు. తరువాత అది హత్యేనని తేలడంతో అప్పట్లో ఆ కేసు దర్యాప్తు వ్యవహరించిన అధికారులను సస్పెండ్‌ చేశారు. అదే సర్కిల్‌ పరిధిలో ఒక యువతి అదృశ్యం కాగా ఆమెను ఆమె చిన్నాన్న, అతని కొడుకు కలిసి హత్యచేసి కాల్చివేశారని, బూడిదను పోలీసులు స్వాధీనం చేసుకుని తండ్రీ,కొడుకులను హత్య కేసులో అరెస్టు చేశారు.2002లో ఈ కేసు విచారణ సమయంలో రాజ మహేంద్రవరం నుంచి ఒక మహిళా న్యాయవాది ఆ యువతిని తీసు కువచ్చి కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో అందరూ అవా క్కయ్యారు. ఈ కేసు దర్యాప్తులో కూడా అప్పట్లో పనిచేసిన అధికారులను సస్పెండ్‌ చేయడమే కాకుండా వారి పదోన్నతులు కూడా నిలిచి పోయాయి. ఈ పరిణామాల నేపథ్యంలో గౌతమి కేసులో దర్యాప్తు చేసిన అధికారులపై శాఖాపరంగా వేటుపడే అవకాశాలు స్పష్టంగా కని పిస్తున్నాయి. పర్యవేక్షణ చేసిన అధికారులకు కూడా చార్జిమెమోలు జారీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నట్టు పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గౌతమి హత్య కేసులో అరెస్టు అయి రిమాండ్‌కు వెళ్లిన జడ్పీటీసీ బాలం ప్రతాప్‌, సజ్జా బుజ్జీ, బొల్లంపల్లి రమేష్‌లపై తెలుగుదేశం పార్టీ సస్పెన్షన్‌ వేటు వేసింది. విపక్షాలు ఈ వ్యవహారాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇటు జడ్పీటీసీ బాలం ప్రతా్‌ప్‌ అరెస్టు కావడం పార్టీ శ్రేణుల్ని విస్మయానికి గురి చేసింది. కార్యకర్తగా అంచెలంచెలుగా ఎదిగిన బాలం ప్రతాప్‌ గతంలో ఎంపీపీగా పని చేశారు.