చంద్రబాబు ఒక మగ వగలాడి. – చంద్రబాబు పై పోసాని ఫైర్.

హైదరాబాద్:
పూటకోమాట మార్చుతూ, అబద్ధాలనే నిజాలుగా ప్రచారం చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు ఒక మగ వగలాడి అని సినీనటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి అన్నా రు. సీఎం కేసీఆర్ ఆమరణదీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధిస్తే, చంద్రబాబు డబ్బు ఆశతో ప్రత్యేకహోదాను వదులుకున్నారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి విజయవాడకు పారిపోయారని, కేసీఆర్‌కు మానవత్వం ఉన్నందునే చంద్రబాబు జైలుకెళ్లకుండా ఉన్నారని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ ఇన్నాళ్లు బీజేపీకి మద్దతు తెలిపిన చంద్రబాబు ఇప్పుడు తప్పుచేశానని చెప్పడం దారుణమని పోసాని అన్నారు. నాడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి, ఇప్పుడు ఆయనకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటన్నారు. విలువలు లేని వ్యకి ఎన్టీఆర్ అని ఎన్నోసార్లు బాబు విమర్శిం చడంపై ఇప్పటికైనా ఎన్టీఆర్ కుటుంబీకులు స్పందించాలని పోసాని కోరారు. జగన్‌పై లేనిపోని విమర్శలు చేస్తున్న చంద్రబాబు.. వాటిని నిరూపించేందుకు తగిన ఆధారాలు చూపాలని సవాల్ విసిరారు. గతంలో ఎన్టీఆర్‌ను చంపావు.. ఇప్పుడు జగన్‌ను కూడా కాల్చిచంపు అంటూ తనదైన ధోరణిలో మండిపడ్డారు. ఏ పార్టీలో చేరనని, ఏ రాజకీయ పదవికీ పోటీ పడనని, ఒక వోటర్‌గానే బాబు దుర్మార్గాలపై స్పందిస్తానని పోసాని స్పష్టంచేశారు.