చంద్రబాబు, కేసీఆర్ ‘డబుల్’ ధమాకా. అక్కడ లోకేష్, ఇక్కడ కేటీఆర్?

ఎస్.కె.జకీర్.
రాబోయే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కె. చంద్రశేఖర్ రావు, చంద్రబాబు నాయుడు అసెంబ్లీ, లోక్ సభ స్థానాలు రెండిటికి పోటీ చేయనున్నారా? ఇద్దరు సీఎంలు ఇదే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. వారసులను సీఎంలుగా చూడాలని రెండు పార్టీల కార్యకర్తల నుంచి విపరీతంగా ఒత్తిడి వస్తున్నందువల్ల ‘ఇద్దరు చంద్రులు’ కొడుకులకు రాష్ట్రంలో అధికార పగ్గాలు అప్పజెప్పి జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఐటీ మంత్రి, బాబు తనయుడు నారా లోకేష్ ను ముఖ్యమంత్రిని చేసి జాతీయస్థాయి రాజకీయాల్లో చక్రం తిప్పాలని కొందరు టీడీపీ నాయకులు ముఖ్యంగా ఎంపీలు జేసీ దివాకర్ రెడ్డి, టీజీ వెంకటేష్ బహిరంగంగానే చంద్రబాబుకు సూచించారు. అటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా పార్టీ కార్యకర్తల నుంచి ఇదే విధమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. యువకుడు, ఐటీ మంత్రి అయిన కేటీఆర్ కు ముఖ్యమంత్రి పీఠం అప్పజెప్పి ఢిల్లీకి వెళ్లాలనే డిమాండ్ వస్తోంది. దీంతో ఆయన 2019 ఎన్నికల తర్వాత కేంద్రంలో తను కీలక పాత్ర పోషించనున్నట్టు ఇదివరకే సూచనప్రాయంగా తెలిపారు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము మరోసారి అధికారం దక్కించుకోవడం ఖాయమని ఇద్దరు ముఖ్యమంత్రులు ధీమాగా ఉన్నారు. టీఆర్ఎస్ వర్గాల సమాచారం ప్రకారం కేసీఆర్ గజ్వేల్ నుంచి అసెంబ్లీకి, మెదక్ నుంచి పార్లమెంట్ కి పోటీ చేయనున్నారు. టీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ తరఫున మెదక్ లో బలమైన ప్రత్యర్థి లేకపోవడంతో తను సునాయాసంగా గెలవడం ఖాయమని ఆయన భావిస్తున్నారు. టీఆర్ఎస్ పై తీవ్ర వ్యతిరేకత ఉంటే తప్ప కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వలేదన్నది కేసీఆర్ అంచనా. ఇక ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా విజయవాడ ఎంపీ స్థానానికి, అదే పరిధిలోని మరో స్థానం నుంచి అసెంబ్లీకి పోటీ చేయవచ్చని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. విజయవాడ ఎంపీ స్థానం పరిధిలోని నియోజవర్గాలు కమ్మ కులస్థుల కంచుకోటలు కావడంతో ఆయన ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు తెలిసింది. ఏదేమైనా ఆయన అసెంబ్లీకి పోటీ చేయడం మాత్రం ఖాయం. ఒకవేళ లోక్ సభకు పోటీ చేయకపోతే తర్వాత ఆయన రాజ్యసభ ఎంపీగా ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. కేంద్రంలో బీజేపీయేతర, కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు కావాలని బలంగా కోరుతున్న కేసీఆర్ అందుకోసం తను హస్తినలో పాగా వేయాల్సిందేనని భావిస్తున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో బీజేపీకి కచ్చితంగా మెజారిటీ రాదని బాబు లెక్కలేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటులో ప్రాంతీయ పార్టీలు కీలకపాత్ర పోషించనున్నాయని ఇద్దరు సీఎంలు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే తమ కొడుకులను ముఖ్యమంత్రులుగా చేసి వారు జాతీయ రాజకీయాలవైపు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.