చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎడమోహం-పెడమోహం.

విజయవాడ:
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత వపన్ కల్యాణ్ ఎడమోహం, పెడమోహంగా ఉన్నారు. సీఎంను కలవడానికి పవన్ వస్తే చంద్రబాబే బయటకు వచ్చి ఆహ్వానం పలికి తీసుకెళ్లిన సన్నివేశాలు ఇక గతం. రాజకీయ పరిస్థితులు మారడంతో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు పంచాయితీ పరిధిలో దశావతార వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ఏకశిలా విగ్రహంలో ఏకాదశ రూపాలు కలిగిన 11 అడుగుల ఎత్తున్న వెంకటేశ్వరస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నేతలు పక్కపక్కనే ఉన్నా, పలకరించుకోలేదు. దత్త పీఠాధిపతి గణపతి సచ్చిదానంద పూజలు చేశారు. మొదట పవన్‌కల్యాణ్‌ ఆలయానికి చేరుకోగా, తర్వాత సీఎం చంద్రబాబు అక్కడికి వచ్చారు. విగ్రహ ప్రతిష్ఠాపన అనంతరం గణపతి సచ్చిదానంద చంద్రబాబు, పవన్‌‌ చేత పూజలు చేయించి ఆలయాన్ని సందర్శించారు. పవన్‌, చంద్రబాబును చూసేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం కోలాహలంగా మారిపోయింది.