చిత్రసీమలో ఆ ‘జంట’ సక్సెస్!!

Hyderabad:

తెలుగు చిత్రపరిశ్రమలోని జంటలో కృష్ణ-విజయ నిర్మల చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇద్దరూ ప్రముఖ నటులే. ఎన్నో విజయవంతమైన, చరిత్ర సృష్టించిన సినిమాల్లో నటించారు. ‘సాక్షి’ చిత్రంతో తొలిసారి జోడీగా నటించిన వీరు ఆ తర్వాత పలు చిత్రాల్లో కలిసి నటించారు. చివరికి నిజ జీవితంలోనూ భార్యభర్తలు అయ్యారు. విజయ నిర్మల తొలిసారి కృష్ణను చూసింది ఆమె కథానాయికగా పరిచయమైన ‘రంగులరాట్నం’ సెట్‌లోనే. ఆ సినిమా దర్శకుడితో మాట్లాడటానికి కృష్ణ వస్తుండేవారు. ఆ తర్వాత బాపు దర్శకత్వం వహించిన ‘సాక్షి’లో ఇద్దరూ తొలిసారి స్క్రీన్‌ పంచుకున్నారు. ఆ సినిమా షూటింగ్‌ సందర్భంగా జరిగిన సంఘటన వారిద్దరినీ నిజ జీవితంలోనూ అగ్ని ‘సాక్షి’గా ఒకటయ్యేలా చేసింది.1967లో వచ్చిన ‘సాక్షి’ బాపు తొలి చిత్రం. ఈ సినిమా షూటింగ్‌ కోసం 30రోజులు అవుట్‌డోర్‌ ప్లాన్‌ చేశారు. గోదావరి తీరంలోని పులిదిండిలో గ్రామంలో చిత్రీకరించాలనుకున్నారు‌. ఆ ఊళ్లో ఓ గుడి ఉంది. అందులో కృష్ణుడికి మీసాలు ఉంటాయి. అందుకే భక్తులు ఆయనను మీసాల కృష్ణుడు అంటారు. ఆ దేవుడు మహిమాన్వితుడని అక్కడివారి నమ్మకం. ‘సాక్షి’లో నటించిన హాస్య నటుడు రాజబాబుకి కూడా మీసాల కృష్ణుడి మహత్తు తెలుసు. ఆ చిత్రంలో కృష్ణ, విజయ నిర్మల జంటగా నటించారు. ఆరుద్ర రాసిన ‘అమ్మ కడుపు చల్లగా… అత్త కడుపు చల్లగా… బతకరా పచ్చగా పచ్చగా…’ అనే పాట కోసం కృష్ణ, విజయ నిర్మలను పెళ్లి దుస్తుల్లో అలంకరించి, వారి కొంగులు ముడివేసి ఆ గుడిలోనే చిత్రీకరించారు. అప్పుడు అక్కడే ఉన్న రాజబాబు కొత్త దంపతుల దుస్తుల్లో ఉన్న వారిద్దరినీ చూస్తూ ‘ఇక్కడి మీసాల కృష్ణుడు చాలా పవర్‌ఫుల్‌‌’ అంటూ ఛలోక్తి విసిరారు. ఆయన మాటే నిజమయింది. ఇది జరిగిన రెండేళ్లకే కృష్ణ, విజయ నిర్మల నిజజీవితంలో ఒక్కటయ్యారు.
దర్శకురాలిగా స్ఫూర్తినింపిందీ ‘సాక్షి’
బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సాక్షి’తో కృష్ణ-విజయ నిర్మల కలిసి నటించడమే కాదు, ఎప్పటికైనా దర్శకత్వం వహించాలన్న కోరికకు బీజం పడింది ఈ సినిమాతోనేని విజయ నిర్మల చెప్పేవారు. బాపు టేకింగ్‌ అంటే తనకు చాలా ఇష్టమని అదే తనను దర్శకురాలిని చేసిందని అనేవారు. అలా ‘మీనా’ చిత్రంతో తొలిసారి మెగాఫోన్‌ పట్టిన విజయ నిర్మల 44 చిత్రాలకు దర్శకత్వం వహించి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకున్నారు.