చుక్క నీరు అందని గిరిజనులు.

ఆసిఫాబాద్;

చుక్కనీరు కూడా దొరకని పరిస్థితి.. ఇష్టారీతిన బోర్ల తవ్వకాలు.. వాగులు, నదుల నుంచి అక్రమ ఇసుక రవాణాలు..ఏకంగా జిల్లా కేంద్రంలోనే నీటి కొరత విలయ తాండవం చేస్తోంది. తాగడానికి చుక్కనీరు లేక జనం అల్లాడిపోతున్నారు. జనాలకు కన్నీళ్లు పెట్టిస్తున్న నీటి కష్టాలపై ప్రత్యేక కథనం.కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నీటి కష్టాలు విలయతాండవం చేస్తున్నాయి. జిల్లాలో 15 మండలాల్లో దాదాపు 12 మండలాలు నీటి కొరతతో అల్లాడుతున్నాయి. జలాశయాల నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా.. పూర్తి కాకపోవడం కొమరం భీం జిల్లా వాసుల పాలిట శాపంగా మారింది.
గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. బోర్లు ఎండిపోయి తాగునీటి సమస్య మరింత పెరిగింది. కాని ప్రభుత్వం మాత్రం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదు. కనీసం నీళ్ల ట్యాంకర్లను కూడా ఏర్పాటు చేయలేదు. ఫలితంగా జిల్లా వాసులు నీళ్లు లేక అష్టకష్టాలు పడుతున్నారు. జిల్లా చుట్టు జలాశయాలున్నా.. ప్రభుత్వ నిర్లక్ష్యమే తాగునీటి కష్టాలను సృష్టించిందని జిల్లా వాసులు చెపుతున్నారు. ప్రాజెక్టుల కాలువ నిర్మాణాలు పూర్తి చేస్తే తప్ప నీటి కష్టాలు తీరంటున్నారు. ఎండకాలంలో నీళ్లు లేక ఇబ్బందులు పడితే వర్షకాలంలో వరదలతో చుక్కలు చూడాల్సి వస్తుందని చెపుతున్నారు. ఇకనైనా నిర్లక్ష్యం వీడి ప్రాజెక్ట్, కాలువల నిర్మాణాలు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.