హైదరాబాద్:
గుజరాత్, మధ్యప్రదేశ్ సరిహద్దులో చెడ్డీగ్యాంగ్ లను గుర్తించారు. నలుగురు సీఐల నేతృత్వంలో బృందాలుగాలింపు చర్యలు చేపట్టాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లలో ప్రస్తుతం బలంగా వినిపిస్తున్న పేరు. కేపీహెచ్‌బీ, బాచుపల్లి ఠాణాల పరిధిలో కొద్ది రోజుల క్రితం సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను బట్టి ఈ ముఠా గురించి వదంతులు షికారు చేస్తున్నాయి. ఆ ముఠా సంచారం అంతా వట్టిదేనని పోలీస్ ఉన్నతాధికారులు కొట్టిపారేస్తున్న నేపథ్యంలో తాజాగా గుజరాత్లో రాచకొండ పోలీసుల వేట ప్రాధాన్యం సంతరించుకొంది. మీర్‌పేట అగ్రికల్చర్ కాలనీలో ఈ ఏడాది ఆరంభంలో జరిగిన దోపిడీ ఘటనపై దర్యాప్తు చేస్తున్న క్రమంలో చెడ్డీ గ్యాంగ్ మూలాల గురించి ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. అపార్ట్మెంట్లోని మిగతా ఫ్లాట్లకు తాళాలేసి.. కాపలాదారును రాళ్లతో కొట్టి.. ఓ ఫ్లాట్‌లో పది తులాల బంగారం దోచుకెళ్లిన ముఠా గుజరాత్ రాష్ట్రంలోని దాహోడ్ ప్రాంతానికి చెందినదిగా గుర్తించారు. గత ఏడాది దసరా సెలవుల్లో ఇదే ఠాణా పరిధిలో జరిగిన చోరీ కేసులో ఒక దాహోడ్ ముఠాసభ్యుడిని అరెస్ట్ చేసిన సందర్భంగా సేకరించిన వేలిముద్రల ఆధారంగా పోలీసులు ఈ నిర్ధరణకు వచ్చారు. ప్రస్తుతం నలుగురు ఇన్స్పెక్టర్ల నేతృత్వంలో నాలుగు ప్రత్యేక బృందాలను అక్కడికి పంపి విస్తృతంగా గాలిస్తున్నారు. ఇదే అసలైన ‘చెడ్డీ గ్యాంగ్’గా పోలీసులు భావిస్తుండటంతో ఆ ముఠా కార్యకలాపాల వివరాల్ని ‘ఈనాడు’ సేకరించింది. రమాబాధ్య.. మెహ్జీ ముఠాలు
గత ఏడాది దసరా సెలవుల సందర్భంగా హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో భారీ చోరీలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మేడిపల్లి, కీసర, ఘట్కేసర్, మేడ్చల్, మీర్‌పేట.. తదితర ఠాణాల పరిధిలో వరుస దొంగతనాలు జరిగాయి. ఈ కేసుల్ని ఛేదించే క్రమంలోనే రాచకొండ పోలీసులకు దాహోడ్ దొంగల గురించిన సమాచారం అందింది. ఈ ముఠా గురించిన కీలక సమాచారం సేకరించే సమయానికే దొంగలు తిరిగి స్వస్థలాలకు వెళ్లిపోవడంతో వారి కోసం పోలీసులు అప్పట్లోనే దాహోడ్కు వెళ్లారు. అప్పట్లో దినేశ్భాయ్ను పట్టుకొని మూడు తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నాడు మిగిలిన దొంగలు దొరక్కపోవడంతో పోలీస్ బృందాలు వెనుదిరిగాయి. తాజాగా అగ్రికల్చర్ కాలనీ దోపిడీ ఘటన నేపథ్యంలో ఈ ముఠా నేర విధానం గురించి ఆరా తీస్తున్న క్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. దాహోడ్ జిల్లా సహడా గ్రామపంచాయతీ పరిధిలోని తండాలకు చెందిన రెండు ముఠాలు హైదరాబాద్‌పై కన్నేసినట్లు తేలింది. ఒక ముఠాకు రమాబాధ్య, మరో ముఠాకు మెహ్జీభా సారథ్యం వహిస్తున్నట్లు గుర్తించారు. రమాబాధ్య ముఠాలో అతడి సోదరులు కిషన్బాధ్య, రవిభాయ్ బాధ్య, మెహ్జీభా ముఠాలో దినేశ్‌భాయ్ నారూభాయ్ అమలియార్ కీలకంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించారు. సాధారణంగా ఒక్కో ముఠాలో అయిదుగురు చొప్పున సభ్యులు దోపిడీలకు వెళ్తుంటారు. ముఠానేతలే మరో నలుగురిని వెంట తీసుకొస్తారు. చోరీల క్రమంలో ఎవరికీ చిక్కకుండా ఉండేందుకు చెడ్డీ-బనియన్‌తోనే సంచరిస్తుంటారు కాబట్టి ఈ ముఠాకు ఆ పేరు వచ్చినట్లు చెబుతున్నారు. స్థానికంగా దొరికే రాళ్లనే ఆయుధంగా చేసుకుంటారు. తమను ఎవరైనా పట్టుకోవడానికి ప్రయత్నిస్తే రాళ్లతో దాడిచేసి పారిపోతారు. మీర్‌పేట అగ్రికల్చర్ కాలనీ ఘటనలో కాపలాదారుపై రాళ్లతో దాడి చేయడమే ఇందుకు తార్కాణంగా చెబుతున్నారు.రైళ్లలో వచ్చి.. తుప్పల్లో దాగి… ఈ ముఠాల సభ్యులు తాము లక్ష్యంగా ఎంచుకున్న మెట్రో నగరాలకు రైళ్లలో వస్తారు. చోరీలకు వచ్చిన క్రమంలో ఆయా నగరాల శివారు ప్రాంతాల్లో 10-15 రోజులపాటు మకాం వేస్తారు. నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న చెట్లు, తుప్పల్లోనే పగటి పూట తలదాచుకుంటారు. ఆ సమయంలో అవసరమైతే కొందరు సభ్యులు వెళ్లి తాళాలు వేసి ఉన్న ఇళ్ల గురించి ఆరా తీసి రెక్కీ నిర్వహిస్తారు. చీకటి పడిన తర్వాత తిరిగి అక్కడికి వెళ్లి తాళాలు పగలగొట్టి చోరీలు చేస్తారు. అలా కొన్ని రోజులపాటు తమ పనులు కానిచ్చి నగరాన్ని విడిచి వెళ్లిపోతారు. హైదరాబాద్ నుంచి వెళ్లేటప్పుడు చందానగర్, బేగంపేట రైల్వేస్టేషన్లలో ఎక్కి పరారైనట్లు గత దర్యాప్తు క్రమంలో గుర్తించారు. దాహోడ్ నుంచి రైళ్లలోనే నగరాలకు చేరుకుంటారు. ఆటోలు, లోకల్ రైళ్లలోనే ప్రయాణాలు చేస్తారు. ఆటోలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంగేజ్ చేసుకోరు. హైదరాబాద్ నగర శివార్లలో విజయవంతంగా చోరీలు చేసిన ఈ ముఠా ఎంఎంటీఎస్‌లో ప్రయాణించి లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్‌బీ ప్రాంతాల్లోనూ రెక్కీలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈమేరకు దాహోడ్కు పయనమైన పోలీస్ బృందాలు దొంగల్ని పట్టుకునే ప్రయత్నాల్లో తలమునకలయ్యాయి. ఈ దొంగల ముఠా చిక్కితే మీర్‌పేట అగ్రికల్చర్ కాలనీ దోపిడీ ఘటనే కాకుండా రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని పలు చోరీ ఘటనలు కొలిక్కి వచ్చే అవకాశాలున్నాయి.అవంతీ సామ్రాజ్య నేపథ్యం… బాహుబలి సినిమా చూసిన వారికి అవంతీ సామ్రాజ్యం గురించి తెలిసే ఉంటుంది. ఆ రాజ్యంలోని ఓ ప్రాంతమే మాహిష్మతీ. ప్రస్తుత మధ్యప్రదేశ్‌లోని నర్మదా నది ఒడ్డున ఉండే ఈ ప్రాంత నేపథ్యంలోనే బాహుబలి సినిమా వచ్చింది. రాచకొండ పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో ఆ ప్రాంతానికీ హైదరాబాద్‌లో చోటుచేసుకున్న చోరీ ఘటనలకు మధ్య సంబంధం ఉండటం చర్చనీయాంశంగా మారింది. అవంతీ సామ్రాజ్యంలో దారి దోపిడీలు చేసే పురాతన ముఠా వారసులే ఇటీవల చోరీలకు కారకులుగా పోలీసులు గుర్తించారు. ఈ ముఠాను గుజరాత్ రాష్ట్రం దాహోడ్ జిల్లాలోని గర్బాడా తాలూకా సహడా గ్రామంలోని గిరిజన తెగ సభ్యులుగా పోలీసులకు కీలక ఆధారాలు లభించాయి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉన్న దాహోడ్ ప్రాంతంలోని దాదాపు 20 గ్రామాల్లో దొంగల ముఠాలున్నాయి. ఈ ప్రాంతంలో పేదరికం ఆనవాళ్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ కారణంగా రెండు జతల దుస్తులతో ఏడాదంతా గడిపేస్తుంటారు. ఉపాధి అవకాశాలు సరిగా లేకపోవడంతో అనాదిగా చోరీలనే ఆలవాలంగా మార్చుకున్నాయి అక్కడి కొన్ని గిరిజన తెగలు. విజయదశమి, సంక్రాంతిలాంటి ప్రత్యేక పర్వదినాలను ఎంచుకొని నగరాలపైబడి చోరీలు చేయడమే వీరి పని. అప్పుడైతే బ్యాంకుల నుంచి నగలను ఇళ్లకు తెచ్చుకుంటారని నమ్మి చోరీలకు తెగబడుతుంటారు.