చెల్లింపులో రూపాయి తక్కువైందని బంగారం ఇవ్వని బ్యాంక్.

చెన్నై:
‘బంగారు నగలపై కారుచౌక వడ్డీకి రుణాలిస్తాం.. మీ బంగారానికి మాది గ్యారెంటీ‘ అంటూ సినిమా తారలతో ప్రచారం చేయించి ఊదరగొడుతున్నాయి ఫైనాన్స్ కంపెనీలు, బ్యాంకులు. కానీ నిజంగా అవి చెప్పిన మాట మీద నిలబడుతున్నాయా అంటే అనుమానమే. ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు వేల కోట్ల రుణం ఎగ్గొట్టే కార్పొరేట్ కంపెనీలు, ఎగవేతదారులకు పిలిచి మరీ మళ్లీ మళ్లీ రుణాలిచ్చి టోపీ వేయించుకొంటాయి. అవసరం కోసం అప్పు చేసిన సాధారణ పౌరులను మాత్రం వడ్డీలతో పీల్చిపిప్పి చేసి కానీ తక్కువైనా ఛీత్కారాలు, తిరస్కాలతో అవమానిస్తున్నాయి.
తమిళనాడులోని కాంచీపురం సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు, పల్లవరం శాఖలో సి. కుమార్ అనే వ్యక్తి ఏప్రిల్ 6, 2010న తన దగ్గరున్న 131 గ్రాముల బంగారు నగలు తనఖా పెట్టి రూ.1.23 లక్షలు అప్పు తీసుకున్నాడు. అదే విధంగా మరో రెండుసార్లు 138 గ్రాముల బంగారం కుదువపెట్టి రూ.1.65 లక్షల రుణం పొందాడు. మార్చి 28, 2011లో మొదట తీసుకున్న లోను మొత్తం వడ్డీతో సహా చెల్లించి తన నగలను తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొద్ది కాలానికే మిగతా రెండు రుణాలను చెల్లించేశాడు. కానీ బ్యాంకు అతను తన రుణాలలో ఒక్కో రూపాయి చొప్పున బకాయిని చెల్లించలేదని బంగారాన్ని తిరిగి ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో బాధితుడు మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఐదేళ్ళుగా బ్యాంకువాళ్ళు రూ.3.50 లక్షల విలువైన తన నగలు ఇవ్వకుండా వేధిస్తున్నారని పిటిషన్‌లో ఫిర్యాదు చేశాడు. తను తనఖా పెట్టిన నగలు బ్యాంకులో ఉన్నాయా? అని బాధితుడు అనుమానం వ్యక్తం చేశాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం రెండు వారాల్లోగా సంబంధిత అధికారుల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరించి, సమర్పించాల్సిందిగా ప్రభుత్వ అడ్వొకేట్‌ను ఆదేశించింది.