చేపల్లో కేన్సర్ కారక రసాయనం. ఏపీ చేపలపై అస్సాం నిషేధం.

హైదరాబాద్;
ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుంచి చేపల దిగుమతి, అమ్మకాలని అస్సాం రాష్ట్ర ప్రభుత్వం 10 రోజులపాటు నిషేధించింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతవుతున్న చేపల్లో కేన్సర్ కారక రసాయనం.. ఫార్మాలిన్ ఉన్నట్టు స్థానిక అధికారులు గుర్తించారు. ఏపీ, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన చేపల శాంపిళ్లను జూన్ 29న పరీక్షల కోసం ల్యాబరేటరీకి పంపినట్టు అస్సాం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి పీజూష్ హజారికా తెలిపారు. ఆ పరీక్షల్లో చేపలలో ఫార్మాలిన్ అధిక మోతాదులో ఉన్నట్టు తేలిందని ఆయన వివరించారు. దీంతో ఇతర రాష్ట్రాల చేపలను అసోంలో విక్రయించరాదని ఉత్తర్వులు జారీ చేసినట్లు హజారికా చెప్పారు. ఏపీ చేపలు రాష్ట్ర మార్కెట్లలో అమ్మకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి జిల్లా కలెక్టర్లు, ఫుడ్ సేఫ్టీ అధికారులను ఆదేశించారు. నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘించి ఫార్మాలిన్ కెమికల్ ఉన్న చేపలను విక్రయిస్తే 2 నుంచి ఏడేళ్లపాటు జైలు శిక్షతోపాటు రూ.10 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. చేపలను నిల్వ ఉంచేందుకు వ్యాపారులు ఫార్మాలిన్ కలపకుండా చర్యలు తీసుకోవాలని వైద్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.