‘జనసేనాని’కి దారేది? జగన్ తో పొత్తు పొడుస్తుందా!!

  • సార్వత్రిక ఎన్నికల వాకిట ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవచ్చును. హోరాహోరీగా జరిగిన గత ఎన్నికల్లో చంద్రబాబుకు అధికారం దక్కడం వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకపాత్ర ఉంది. అయితే ఇప్పుడు టీడీపీకి దూరమైన పవన్ సొంతంగా ఎన్నికల బరిలో దిగడం ఖాయమని అర్ధమవుతున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నా ప్రధాన పోరు టీడీపీ, వైసీపీ, జనసేన మధ్యే జరగనున్నది. ఏపీ రాజకీయం రసకందాయంలో పడింది. పవన్ తన పవర్ ఏ మాత్రం చూపించగలరనే ఆసక్తి అందరిలో ఉంది. పార్టీ ప్రారంభమైన నాలుగేళ్లు పూర్తయినా జనసేన పార్టీ సంస్థాగతంగా నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. జిల్లా స్థాయిల్లో కమిటీలు పూర్తిగా నియమించకపోవడం, క్షేత్ర స్థాయిలో బూత్ కమిటీల నిర్మాణం జరగకపోవడం వంటి ఇబ్బందులను ఆ పార్టీ ఎదుర్కోంటోంది.

ఎస్.కె.జకీర్.
పవన్‌కల్యాణ్‌ పేరు వినగానే యువతలో ఒక ఉత్సహం.. ఉద్వేగం.. ఊగిపోయే ఆవేశం కమ్ముకుంటాయి. పవన్‌కి ఉన్న క్రేజ్ అలాంటిది. 2014 ఎన్నికల్లో టీడీపీ- బీజేపీ కూటమికి మద్దతు పలికిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ప్రత్యేకహోదాపై వెనక్కి తగ్గిన మోదీ సర్కార్‌పై తొలినాళ్లలో తీవ్ర విమర్శలు గుప్పించారు. అప్పట్లో వైసీపీ వైఖరిపైనా ధ్వజమెత్తారు. ఆ తర్వాత క్రమంగా పవన్‌కల్యాణ్‌ ‘యూటర్న్’ తీసుకున్నారు. బెజవాడ సభలో టీడీపీపై విమర్శనాస్త్రాలు సంధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ విమర్శల ఘాటును ఇంకా కొనసాగిస్తూ వస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాసమస్యలపై బస్సుయాత్ర చేపడతానని అప్పట్లో పవన్‌కల్యాణ్‌ ప్రకటించారు. “పవన్‌ త్వరలో బస్సుయాత్ర చేస్తారు. అది కూడా ఉత్తరాంధ్ర నుంచే మొదలుపెడతారంటూ” వార్తలొచ్చాయి. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే మే 16న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకున్నారు. అంబేద్కర్ భవన్‌లో బసచేశారు. “మే 20 నుంచి ఇచ్చాపురం తీరప్రాంతం నుంచి పోరాటయాత్ర ప్రారంభిస్తాను. విభజన హామీల సాధన, రాజకీయాల్లో జవాబుదారీతనం తేవడం, ప్రజాసమస్యలను తెలుసుకోవడం అనే అంశాలను అజెండాగా చేసుకుని 45 రోజులపాటు బస్సుయాత్ర చేస్తాను.” అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మే 20వ తేదీన ఇచ్చాపురం నుంచి యాత్ర చేపట్టడం కోసం పవన్‌ సిద్ధపడ్డారు. తొలుత సముద్రుడికి పూజలు చేశారు. కానీ ఆయన జ్వరంతో బాధపడుతున్నట్టు వార్తలొచ్చాయి. అయినా ఆయన ఆరోజున ఇచ్చాపురంలో కవాతు, బహిరంగసభను నిర్వహించారు. మరుసటి రోజు కార్యకర్తలతో సమావేశమై సోంపేట బిలా భూములను పరిశీలించారు. అక్కడినుంచి పలాస చేరుకుని తొలుత టీకేఆర్ కల్యాణమండపంలో బసచేశారు. అనంతరం గ్రామంలో కవాతును, సభను నిర్వహించారు. తదనంతరం టెక్కలి చేరుకుని అక్కడి రిసార్ట్‌లో రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకున్నారు. ఉద్దానం సమస్యపై ప్రభుత్వం స్పందించలేదని ఆరోపిస్తూ శ్రీకాకుళంలో ఒకరోజు దీక్షచేశారు. ఆ తర్వాత పవన్‌కల్యాణ్‌ యాత్ర జోరుగా సాగింది. రెండు రోజుల్లో ఆరు నియోజకవర్గాలను చుట్టేశారు. ఆయాచోట్ల కవాతులు, మీటింగ్‌లు కూడా నిర్వహించారు. ఆ తర్వాత పవన్‌ యాత్ర విజయనగరం జిల్లాకు చేరుకుంది. తొలుత బొబ్బిలి చేరుకున్న పవన్‌ ఒక రోజు రెస్ట్‌ తీసుకున్నారు. తదుపరి రెండున్నర రోజుల్లోనే జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లో యాత్రలు, కవాతులు పూర్తిచేశారు. జూన్‌ రెండో తేదీ రాత్రికి నేరుగా అరకు వెళ్లిపోయారు. అరకులో మూడు రోజులపాటు రిసార్ట్‌కే పరిమితమయ్యారు. మూడవరోజు సాయంత్రం, ఆ మర్నాడు కూడా గిరిజన యువతతో మాటామంతీ సాగించారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాలుగవ రోజున డుంబ్రిగూడ, అరకు, అనంతగిరి ప్రాంతాలలో పర్యటించారు. అక్కడి నుంచి మళ్లీ అరకు చేరుకున్న పవన్‌ మరుసటి రోజు పాడేరు వచ్చారు. అక్కడనుంచి మాడుగుల మీదుగా నర్సీపట్నం, పాయకరావుపేట, యలమంచిలిలో కవాతులు, సభలు నిర్వహించారు. జూన్‌ 8వ తేదీతో పవన్‌ తన యాత్రను ముగించారు. తిరిగి విశాఖ చేరుకున్న జనసేన అధినేత అక్కడి ఓ రిసార్ట్‌లో మూడు రోజులు బసచేశారు. పలువురు ప్రముఖులతో, కార్యకర్తలతో భేటీ అయ్యారు. జూన్ పదకొండున విశాఖ నుంచి హైదరాబాద్‌కి పయనమయ్యారు.45 రోజులు అనుకున్న యాత్రను 23 రోజులకే పవన్ కుదించుకున్నారు. 9 రోజులు పూర్తిగా విశ్రాంతికే పోయాయి. మిగతా రోజుల్లో కూడా యాత్రని సూడిగాలి పర్యటనల మాదిరిగా ముగించారు. జనసేన మ్యానిఫెస్టో కోసం ఒక టీమ్‌ తిరుగుతుందని అన్నారు కానీ..ఆ బృందం కదలికలు పెద్దగా కనిపించలేదు. అలాగే బస్సుయాత్రకి రూట్‌మ్యాప్‌తోపాటు ఇతర సలహాలు ఇచ్చేందుకు వచ్చిన బృందం పవన్‌ శ్రీకాకుళం వెళ్లిన తర్వాత మూడు రోజులకే హైదరాబాద్‌ వెళ్లిపోయినట్టు సమాచారం. అందుకే పవన్‌ యాత్ర ఆద్యంతం తెగిన గాలిపటంలా సాగింది. పవన్‌ వ్యవహారశైలిపై కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. ఆయన బసచేసిన ప్రదేశానికి వివిధ పక్షాల నేతలు కలవడానికి వచ్చినా కేవలం గంటో రెండు గంటలో వెచ్చించేవారు. మిగతా సమయం అంతా రూమ్‌లోనే గడిపేవారు . ప్రతి రోజు సాయంత్రం ఏదో ఒక ప్రాంతంలో మీటింగ్‌ ఏర్పాటుచేసేవారు . అక్కడికి కిలోమీటర్‌ లేదా అర కిలోమీటర్‌ దూరంలో కారు దిగి సభాప్రాంగణానికి నడుచుకుంటూ వెళ్లేవారు . సభలో కూడా ఆయన ఒక్కరే వక్త. చాలా చోట్ల జనసమీకరణ చేసిన నేతలను కూడా వేదిక ఎక్కనివ్వలేదు .అరకు రిసార్ట్‌లో పవన్‌ బసచేసినప్పుడు ఆయన్ని కలవడానికి కొందరు యువకులు రాగా వారికి అవకాశం లభించకపోవడంతో తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేసి వారు తిరిగి వెళ్లిపోయారు. 23 రోజుల పర్యటనలో వట్టి వసంతకుమార్‌, కొణతాల రామకృష్ణ వంటి ఒకరిద్దరే పి.కె. ను కలిశారు. కమర్షియల్‌ ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమీషనర్‌గా పనిచేసి రాజీనామా చేసిన శివశంకర్‌ని ఉత్తరాంధ్ర జనసేన ఇన్‌ఛార్జ్‌గా నియమించారు. సార్వత్రిక ఎన్నికల వాకిట ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవచ్చును. హోరాహోరీగా జరిగిన గత ఎన్నికల్లో చంద్రబాబుకు అధికారం దక్కడం వెనుక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలకపాత్ర ఉంది. అయితే ఇప్పుడు టీడీపీకి దూరమైన పవన్ సొంతంగా ఎన్నికల బరిలో దిగడం ఖాయమని అర్ధమవుతున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా ఎన్నికల్లో పోటీ చేయబోతున్నా ప్రధాన పోరు టీడీపీ, వైసీపీ, జనసేన మధ్యే జరగనున్నది. ఏపీ రాజకీయం రసకందాయంలో పడింది. పవన్ తన పవర్ ఏ మాత్రం చూపించగలరనే ఆసక్తి అందరిలో ఉంది. పార్టీ ప్రారంభమైన నాలుగేళ్లు పూర్తయినా జనసేన పార్టీ సంస్థాగతంగా నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాలేదు. జిల్లా స్థాయిల్లో కమిటీలు పూర్తిగా నియమించకపోవడం, క్షేత్ర స్థాయిలో బూత్ కమిటీల నిర్మాణం జరగకపోవడం వంటి ఇబ్బందులను ఆ పార్టీ ఎదుర్కోంటోంది. అయినప్పటికీ పవన్ కి ఉన్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఇతర పార్టీలను బెంబేలెత్తిస్తున్నాయి. మిగతా పార్టీల మాదిరిగా ప్రణాళికాబద్ధమైన వ్యూహరచన చేసే సామర్థ్యం లేకపోయినా ప్రత్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయగల స్థాయిలో అభిమాన గణం ఉండటంతో ఆయనను కలుపుకొని ఓట్లు చీలకుండా చూసుకోవాలని భావిస్తున్నాయి. కొన్ని నెలలుగా టీడీపీని టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తున్న పవన్ ఇక తమకు ప్రత్యర్థేనని నిర్ణయించుకొన్న తెలుగు తమ్ముళ్లు ఎదురుదాడే సరైన వ్యూహమని డిసైడయ్యారు. మరో ప్రతిపక్ష పార్టీ వైసీపీ జనసేనతో జతకడుతుందా? అనేది మరో ప్రశ్న. 2019 ఎన్నికల్లో టీడీపీని ఎదుర్కొనేందుకు తాను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతిస్తానని పవన్ సన్నిహితుడైన వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ మరోసారి ప్రకటించడం రాజకీయ వర్గాల్లో సంచలనం కలిగిస్తోంది. వరప్రసాద్ ఇప్పటికే రెండు సార్లు ఇదే విషయం చెప్పినా ‘జనసేన’ నుంచి ఎలాంటి స్పందన లేదు.వరప్రసాద్ వ్యాఖ్యలను పవన్ ఖండించలేదు. దీంతో జనసైనికులు తమ ‘సేనాని’ ఏ పక్షాన నిలుస్తాడోననే డోలాయమానంలో పడ్డారు.సొంతంగా 175 స్థానాల్లో పోటీ చేసేంత బలం, కేడర్ ‘జనసేన’కు లేదు. అయితే ఇప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే విషయంపై పవన్ కళ్యాణ్ తేల్చుకోలేకపోతున్నారు. ఎవరితో పొత్తు పెట్టుకుంటారో చెప్పాలని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు. మరోవైపు మాతోనేనని వైసీపీ ప్రకటించడంతో ఆయనపై క్రమంగా ఒత్తిడి పెరుగుతోంది. టీడీపీకి వ్యతిరేకంగా ఏ పార్టీతోనైనా జట్టు కడితే అది ప్రజల్లో ఏ సూచనలు ఇస్తుందోననే సందిగ్ధంలో పవన్ కళ్యాణ్ పడ్డారు. ఎన్నికల తర్వాత పవన్’ కింగ్ మేకర’య్యే అవకాశాలపై కొందరు ఊహాగానాలు చేస్తున్నారు.