జనసేన మాతోనే. -వైసీపీ మాజీ ఎంపీ.

హైదరాబాద్:
2019 ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు ఊహించని మలుపు తిరగబోతున్నాయా? తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనేందుకు పవన్, జగన్ ఒక్కటి కాబోతున్నారా? ఇప్పటికే ఇందుకు సంబంధించి వైసీపీ, జనసేన పార్టీలు ఓ అవగాహనకొచ్చాయా? వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పేశాయి. వరప్రసాద్, పవన్ కల్యాణ్ స్నేహితులన్న సంగతి తెలిసిందే. తాజాగా వరప్రసాద్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 2019 ఎన్నికల్లో పవన్ వైసీపీకి మద్దతిస్తారని.. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తనతో చెప్పారని వరప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు.. 2014 ఎన్నికల్లో చంద్రబాబు అనుభవం కలిగిన వ్యక్తి అని, అవినీతి చేయరన్న ఉద్దేశంతో తాను సమర్థించానని పవన్ చెప్పినట్లు ఆయన వెల్లడించారు. అయితే నాలుగు సంవత్సరాల పాలనలో చంద్రబాబు హోదా సాధించలేకపోయారని, అవినీతి పెరిగిపోతోందని.. అందుకని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకు మద్దతు తెలపనని జనసేనాని స్పష్టం చేశారని వరప్రసాద్ చెప్పుకొచ్చారు. 2019లో మద్దతంటూ ఇస్తే వ్యక్తిగతంగా అన్యాయం జరిగిన కష్టజీవి జగన్మోహన్‌రెడ్డికి సపోర్ట్ చేస్తానని పవన్ చెప్పారని.. ఇది వాస్తవమని.. ఆయన అభిప్రాయం పట్ల తాను హర్షం వ్యక్తం చేస్తున్నానని ఈ వైసీపీ మాజీ ఎంపీ బాంబు పేల్చారు. ఇన్నాళ్లూ పవన్, జగన్ కలిసి బీజేపీ ఆడిస్తున్నట్లు ఆడుతున్నారన్న టీడీపీ ఆరోపణలకు వరప్రసాద్ వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చుతున్నాయి. ఏదేమైనా ఈ వైసీపీ మాజీ ఎంపీ ప్రకటన రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.