జపాన్ రోడ్లపై డ్రైవర్ రహిత బస్సులు.

టోక్యో:
డ్రైవర్ లేకుండా తనంతట తానే రోడ్లపై పరుగులు తీసే బస్సు.. వింటుంటేనే ఆ అద్భుత దృశ్యం కళ్ల ముందు కదలాడినట్టుగా ఉందా? ఈ ఊహ మరికొన్ని నెలల్లోనే నిజం కాబోతోంది. చైనాలో విశేష ప్రజాదరణ పొందిన సెర్చింజన్ దిగ్గజ సంస్థ బైదూ, జపాన్ కి చెందిన సాఫ్ట్ బ్యాంక్ అనుబంధ సంస్థ ఎస్బీ డ్రైవ్, వాహన తయారీ సంస్థ కింగ్ లాంగ్ సంయుక్తంగా మానవ రహిత మినీ బస్సుల తయారీని ప్రారంభించాయి. ఇప్పటికే పరీక్ష దశ పూర్తి చేసుకొన్న ఈ డ్రైవర్‌ లేని, అసలు స్టీరింగ్‌ చక్రం లేదా డ్రైవర్‌ సీటే లేని మినీ బస్సులు వచ్చే ఏడాది ప్రారంభం నుంచి రోడ్లపైకి ప్రవేశపెట్టనున్నాయి. ఇటీవల బీజింగ్ లో జరిగిన బైదూ వార్షిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలపర్ సదస్సు, క్రియేట్ బైదూలో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఎంతో కాలంగా బైదూ స్వయం ప్రతిపత్తి గల మానవ రహిత వాహనాల తయారీకి ప్రయత్నాలు చేస్తోంది. చివరికి అనుకున్నట్టుగానే డ్రైవర్ లెస్ టెక్నాలజీని వాణిజ్య అవసరాలకు వినియోగిస్తోంది. అపొలాంగ్ స్వయం ప్రతిపత్తి మినీ బస్సులను జపాన్ అమ్ముతోంది ఈ టెక్ దిగ్గజం. కింగ్ లాంగ్ సంస్థ తయారీ అయిన అపొలాంగ్ లో బైదూ రూపొందించిన అపోలో స్వయం ప్రతిపత్తి డ్రైవింగ్ వ్యవస్థను అమర్చారు. ఇది ఆటోమోటివ్ ఇంజనీరింగ్ అసోసియేషన్..ఎస్ఏఈ ఇంటర్నేషనల్ నుంచి లెవెల్ 4 గుర్తింపు పొందింది. వచ్చే ఏడాది ప్రారంభంలో 10 బస్సులను జపాన్ కు ఎగుమతి చేయనుంది. సాఫ్ట్ బ్యాంక్ అనుబంధ సంస్థ ఎస్బీ డ్రైవ్ తో ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఈ బస్సులను పర్యాటక ప్రాంతాలు, విమానాశ్రయాలు, ఇతర నియంత్రిత ప్రదేశాలలో ముందుగా ఉపయోగించి చూస్తారు. చైనా నుంచి స్వయం ప్రతిపత్తి గల వాహనాలు ఎగుమతి కావడం ఇదే మొదటిసారి కావడంతో ఆ దేశ ఆటోమొబైల్ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమైందని భావిస్తున్నారు. భవిష్యత్తులో బీజింగ్, షెంజెన్, పింగ్టాన్, వుహాన్ వంటి చైనా నగరాల్లో కూడా ఈ బస్సులను ప్రవేశపెట్టాలని బైదూ ప్రణాళికలు రచిస్తోంది.