జపాన్ వరదల్లో 40 మంది మృతి

టోక్యో:
కుండపోతగా కురుస్తున్న వర్షాలతో నైరుతి, మధ్య జపాన్ ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. ఒక్కరోజులో 583 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వరదల్లో ఇప్పటి వరకు 40 మందికి పైగా చనిపోగా 50 మందికి పైగా గల్లంతయ్యారు. హిరోషిమాలో కొండచరియలు విరిగిపడినట్లు తెలిసింది. మోటొయామా, హిరోషిమా, ఎహిమి, యమగుచి ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. ఒకయామాలోని పలు ప్రాంతాలు వరదనీటిలో మునిగి పెద్ద చెరువులను తలపిస్తున్నాయి. ప్రజలు ఇళ్ల పైకప్పులు ఎక్కి సహాయ హెలికాప్టర్ల కోసం ఎదురుచూస్తున్నారు. జపాన్ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికపై సహాయచర్యలు చేపట్టింది. సుమారుగా 16 లక్షల మంది తమ ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. 31 లక్షల మందిని ఇళ్లు ఖాళీ చేయాల్సిందిగా సూచించారు. వరద ముంచుకొచ్చే ప్రాంతాల్లోని 3,60,000 మందిని ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నీటి సరఫరా వ్యవస్థ దెబ్బతిన్న ప్రాంతానికి మిలిటరీ వాటర్ ట్రక్కులు మంచినీరు తీసుకెళ్తున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా రహదారులను మూసివేశారు. విడిభాగాల రవాణా నిలిచపోవడంతో ప్రముఖ ఆటోమొబైల్స్ సంస్థ మిత్సుబిషి మోటార్స్ కార్ప్ తన ఉత్పత్తిని నిలిపేసింది. ప్రమాదకర పరిస్థితుల్లో ఉద్యోగులు ప్రయాణించాల్సి వస్తుందని మాజ్దా మోటార్ కార్ప్ తన రెండు ప్లాంట్లలో తయారీని ఆపేసింది. మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జపాన్ వాతావరణ శాఖ హెచ్చరించింది. కనీవినీ ఎరుగని విధంగా కురుస్తున్న వర్షాల కారణంగా నదుల్లో నీటిమట్టం పెరగవచ్చని, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని తెలిపింది.