జూపల్లి ‘భూ దందా ‘? – సి.ఎం. ఆరా!

ఎస్.కె.జకీర్.

“నేను జూపల్లి కృష్ణారావు, మినిష్టర్ని మాట్లాడుతున్న. ఐ… షో వాట్ ఈజ్ గవర్నమెంట్ ఏం తమాషా చేస్తున్నవా? నీ పేరేంది? ఐదు సెకన్లు టైం ఇస్తున్న.నీ పేరు చెప్తవా, లేదా? ఏం మాట్లాడుతున్నవ్! ఏ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్నవ్. ఒక గంటలో మీ ఐ.జి తో మాడ్లాడతా” అని మంత్రి జూపల్లి బెదిరింపు స్వరంతో చేసిన వ్యాఖ్యలు, ఆయన గొంతు శనివారం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

కరీంనగర్ జిల్లా ధర్మారం మండలం లోని కోమటిరెడ్డి హనుమంత్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన ‘భూ వివాదం’లో మంత్రి జూపల్లి కృష్ణారావు జోక్యం చేసుకున్నట్టు ఈ ఆడియో చెబుతున్నది. తాండూరు సి.ఐ. గా పనిచేస్తున్న సీఐ జనార్దన్ రెడ్డికి మంత్రికి మధ్య జరిగిన ‘ఫోన్ సంభాషణ’ రచ్చకెక్కడం ప్రభుత్వాన్ని, అధికారపార్టీని ఇరకాటంలోకి నెడుతున్నది. కరీం నగర్ జిల్లాలో ధర్మారం పోలీస్ స్టేషన్ కు ఎదురుగా ఉన్న ‘భూమికబ్జా’ విషయంలో చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ అనుచరులపై గతంలో ఆరోపణలు వచ్చినట్టు తెలుస్తోంది. తర్వాత అది మలుపు తిరుగుతున్నది. దీర్గకాల వ్యాదితో బాదపడుతున్న కోమటిరెడ్డి హనుమంత్ రెడ్డి కూతురు గుర్రం లక్ష్మిని ఈ కేసు విషయంలో రెండేళ్లుగా తిప్పించుకుంటున్నారని తమకు న్యాయం చేయాలంటూ జూపల్లి కృష్ణారావు పీ.ఎస్ వీరారెడ్డిని సిఐ జనార్దన్ రెడ్డి అశ్రయించినట్టు తెలుస్తున్నది. లక్ష్మి ని తన చెల్లెలుగా సి.ఐ. జనార్ధనరెడ్డి చెబుతున్నారు.ఫోన్ సంభాషణ ముందుగా మంత్రి పి.ఎస్.వీరారెడ్డికి, సి.ఐ. జనార్దనరెడ్డికి మధ్య సాగింది. చివరలో మంత్రి జూపల్లి ఎందుకు సంభాషణ లో తలదూర్చారో తెలియదు. తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని సి.ఐ. ని వీరారెడ్డి ఆరోపించారు. తన చెల్లెలు హెచ్.ఐ.వి. పేషంట్ అనే కనికరం లేకుండా వీరారెడ్డి ఇప్పటికే ఇరవై, ముప్ఫయి సార్లు హైదరాబాద్ ఆఫీసు చుట్టూ తిప్పి ఇబ్బందులు పెడుతున్నట్టు సి.ఐ.జనార్ధన రెడ్డి ఆరోపణ. కాగా రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావుపై వస్తున్న ‘భూ దందా’ ల ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మంత్రి జూపల్లి, నాగర్ కర్నూలు శాసనసభ్యుడు మర్రి జనార్ధన రెడ్డిల మధ్య ఇటీవల సెక్రెటేరియేట్ లోనే ‘ఘర్షణ’ జరిగింది. సంగారెడ్డికి సమీపంలో దాదాపు 50 ఎకరాలకు సంబంధించిన భూ క్రయ విక్రయాలలో మంత్రికి, ఎమ్మెల్యేకు మధ్య జరిగిన రచ్చ పై సి. ఎం. కేసీఆర్ తెప్పించుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా శనివారం నాటి ‘ఆడియో సంభాషణ’ గురించి కూడా ఆయన ఇంటెలిజెన్స్ నివేదిక కోరినట్టు తెలియవచ్చింది.