టిఆర్ఎస్ కు గుదిబండ జగిత్యాల. ఇన్ చార్జి సంజయ్ పై అసంతృప్తి జ్వాల.

టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి జగిత్యాల ప్రాంతంలో పార్టీ నాయకునిగా, నియోజకవర్గ ఇన్ చార్జిగా, కేసీఆర్ కు సన్నిహితునిగా పేరుపొందిన జితేందర్ రావు డాక్టర్ సంజయ్ పై నిప్పులు చెరుగుతున్నారు. సంజయ్ కు మళ్ళీ టికెట్టు ఇస్తే ఈ సారి డిపాజిట్లు కూడా రావన్నది ఆయన అభిప్రాయమని జగిత్యాల సెగ్మెంటు లోని టిఆర్ఎస్ కార్యకర్తల ద్వారా తెలిసినది. డాక్టర్ సంజయ్ కుమార్ ‘మాస్ లీడర్’ గా గుర్తింపు పొందడంలో దారుణంగా విఫలమైనందున ‘ప్రత్యామ్నాయ’ అభ్యర్థికి టికెట్టు ఇస్తే జీవన్ రెడ్డితో తలపడవచ్చునని పలువురు కిందిస్థాయి నాయకులంటున్నారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా డాక్టర్ సంజయ్ ను ఎం.పి. కవిత ప్రోత్సహిస్తున్నారని చెబుతున్నారు.

ఎస్.కె.జకీర్.
తెలంగాణ రాష్ట్ర సమితికి జగిత్యాల గుదిబండ గా మారింది. ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్ రెడ్డిని ఓడించడం ఎలా? అనే అంశం అధికార పక్షాన్ని పట్టి పీడిస్తున్నది. మరీ ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవితకు ఇది సవాలుగా మారింది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్ సభ సెగ్మెంటులో జగిత్యాల స్థానం ఒకటి. నాలుగేళ్లుగా ఆమె జగిత్యాలపై ప్రత్యేక దృష్టిపెట్టినా ఫలితం ఆశాజనకంగా లేదు. టీఆర్‌ఎస్‌ ఇప్పుడు కొత్త వ్యూహానికి తెరతీసింది. జగిత్యాలపై పట్టుపెంచుకోవాలనుకుంటున్న ఎంపీ కవిత మునిసిపాలిటీల్లో ముందుగా పాగా వేయాలనుకుంటున్నారు. ‘ఆపరేషన్‌ జగిత్యాల’ ను అమలు చేయబోతున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాక రాజకీయ నాయకులు ఎక్కువగా చర్చించుకున్న జిల్లా ఏదైనా ఉందంటే అది జగిత్యాలే! అక్కడి రాజకీయ పరిస్థితులు భిన్నంగా ఉండడం ఇందుకు కారణం! జగిత్యాల మీద కేసీఆర్, కవిత నిరంతరం దృష్టి సారిస్తూనే ఉన్నారు. గత సఎన్నికలలో ఉత్తర తెలంగాణను దాదాపు స్వీప్‌ చేసిన టీఆర్‌ఎస్‌ జగిత్యాల నియోజకవర్గంలో మాత్రం జెండా ఎగరేయలేకపోయింది. జగిత్యాల ను కోల్పోయిన బెంగ టీఆర్‌ఎస్‌కు మిగిలింది. కొత్త జిల్లాగా జగిత్యాల ఏర్పడిన తర్వాత ఎంపీ కవిత ఈ నియోజకవర్గంపై ఫోకస్‌ పెట్టారు. పరాయి పార్టీల నుంచి వలసలపై దృష్టి పెడుతూ వస్తున్నారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. జగిత్యాలను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఏ అవకాశాన్ని ఆమె వదలడం లేదు. ఇప్పుడు కవిత కొత్త స్కెచ్‌ వేశారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న కవిత ఆయన స్టయిల్లోనే ఒక దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలనుకుంటున్నారు. కేసీఆర్‌ రాజకీయ ఎత్తుగడలనే ఇప్పుడు కవిత ఫాలో అవుతున్నారు. ఇంతకాలం ప్రింట్‌ మీడియాలో’ జగిత్యాలపై ఎంపీ కవిత గురి’… ‘జగిత్యాల నుంచే జైత్రయాత్ర’ అనే హెడ్డింగులు వచ్చేవి.ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఇదే రకమైన వార్తలు వచ్చేవి. ఒకానొక దశలో జగిత్యాలలో గెలిస్తే రాష్ట్రమంతా గెలిచినట్టే అన్న భావనలోకి కార్యకర్తలను తీసుకువెళ్లారు. జగిత్యాల నియోజకవర్గంతో పాటు జగిత్యాల మునిసిపాలిటీపైన కూడా గులాబీ జెండా రెపరెపలాడాలన్న ఆలోచనలో కవిత ఉన్నారు. అందుకు అనుగుణంగా వ్యూహాలు రచించుకుంటున్నారు. స్లోగన్‌లు కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ‘జగిత్యాల మాదే.. జగిత్యాల బల్దియా మాదే’ అన్న నినాదంతో కార్యకర్తలలో కదలిక తెచ్చేందుకు ప్రణాళిక రచించుకుంటున్నారు. జగిత్యాల మునిసిపాలిటీ సమావేశాల్లో కాంగ్రెస్‌తో కొట్లాడేందుకు టీఆర్ఎస్ కు సరిపడిన బలం లేదు. ఉన్న అయిదుగురు కౌన్సిలర్లు ‘చెరో దారి’ అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అందుకే ఎంపీ కవిత ఇతర పార్టీల కౌన్సిలర్లను పార్టీలో ఆకర్షించే పనిలో పడ్డారు. మునిసిపల్‌ సమావేశాల్లో ఢీ అంటే ఢీ అనే తెలుగుదేశంపార్టీ కౌన్సిలర్లకు ఇప్పటికే ఫోన్‌లు వెళ్లాయి. మునిసిపాలిటీ నిధుల విషయంలో కాంగ్రెస్‌తో ప్రతిసారి టీడీపీ కొట్లాటకు దిగుతుంటుంది. నిధులన్నీ కావలసిన వారికే కట్టబెడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నది. కాంగ్రెస్‌పై కాలుదువ్వుతున్న టీడీపీ కౌన్సిలర్లను పార్టీలోకి ఆహ్వానిస్తే బలం పెరుగుతుందన్నది కవిత ఆలోచన. జగిత్యాలకు ప్రత్యేకంగా కేటాయించిన 50 కోట్ల రూపాయల నిధులలో ఇప్పటికే సగానికి పైగా ప్రభుత్వం విడుదల చేసింది. అందులో తమ వాడల అభివృద్ధి కోసం కోటి రూపాయల వరకూ కేటాయిస్తామంటూ ‘ఆఫర్లు’ కూడా వెళ్లాయి. పట్టణంలో గులాబీ గుబాళింపు తేవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కవిత. ఏఏ వార్డులలో ఎవరెవరు గట్టిగా ఉన్నారో రిపోర్ట్‌ తెప్పించుకుంటున్నారు. మరోవైపు కాంగ్రెస్ శాసన సభ్యుడు జీవన్‌రెడ్డికి సన్నిహితంగా ఉన్న ఎంపీటీసీలు, సర్పంచులను ధికారపార్టీలోకి ఆమె ఆహ్వానిస్తున్నారు. గ్రామాలలో ‘కుల భవనాల’ నిర్మాణాలకు అడిగినంత ఇచ్చేస్తున్నారు జగిత్యాల నియోజకవర్గాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు.కాంగ్రెస్‌కు చెందిన కొంత మంది కౌన్సిలర్లకు కూడా గాలం వేస్తున్నారు. జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు కీలకం కనుక వాళ్లలో ఇప్పటికే ఓ కౌన్సిలర్‌ను కారెక్కించేశారు. మరో ఇద్దరు ముగ్గురు కారెక్కేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. పట్టణ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఇప్పటికే నాలుగువేల ఇళ్లను ఎం.పి. కవిత కేటాయించారు. రాష్ట్రంలో మొదటిసారిగా ‘బూత్‌ కమిటీ’ లకు ఆమె జగిత్యాలలో లోనే పునాది వేశారు. అయితే జగిత్యాల నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ గా ఉన్న డాక్టర్ సంజయ్‌కుమార్‌ పట్ల పార్టీ శ్రేణులలో తీవ్ర వ్యతిరేకత ఉన్నా ఆమె పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నవి. డాక్టర్ సంజయ్ తన వైద్య వృత్తికే మొదటి ప్రాధాన్యం ఇస్తారని ఎం.ఎల్.ఏ.జీవన్ రెడ్డి వలె ‘ఫుల్ టైం’ పొలిటీషియన్ గా పని చేయనందున అసంతృప్తి పేరుకుపోతున్నట్టు కార్యకర్తలు అంటున్నారు. కంటి వ్యాధుల సర్జన్ గా సంజయ్ కు పేరు ప్రఖ్యాతులున్నవి. ఆయనకు రోజుకు కనీసం లక్ష రూపాయల ఆదాయం ఉన్నట్టు సమాచారం. ఎం.పి.కవిత అండదండలతో సంజయ్ ‘వసూళ్లకు’ పాల్పడు తున్నట్టు పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్నవి.సంజయ్ మీద వస్తున్న ఆరోపణల కారణంగా కవిత అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. రాయికల్ లో ఒక ఏడాదిలో ఐదుగురు ఎస్.ఐ.ల బదిలీ వెనుక సంజయ్ ‘ప్రమేయం’ ఉన్నట్టు తెలియవచ్చింది. జగిత్యాల రూరల్ లో ముగ్గురు ఎస్.ఐ. లు, జగిత్యాల సి.ఐ. వంటి అధికారుల తరచూ ‘మారడం’ వెనుక కూడా డాక్టర్ పాత్ర ఉన్నట్టు తెలిసింది. కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు జీవన్ రెడ్డి పట్ల అసంతృప్తిగా ఉండి టిఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్న కాంగ్రెస్ శ్రేణులు టిఆర్ఎస్ ఇన్ చార్జి సంజయ్ కుమార్ వ్యవహారశైలితో వెనుకంజ వేస్తున్నట్టు తెలుస్తున్నది. టిఆర్ఎస్ ఆవిర్భావం నుంచి జగిత్యాల ప్రాంతంలో పార్టీ నాయకునిగా, నియోజకవర్గ ఇన్ చార్జిగా, కేసీఆర్ కు సన్నిహితునిగా పేరుపొందిన జితేందర్ రావు డాక్టర్ సంజయ్ పై నిప్పులు చెరుగుతున్నారు. సంజయ్ కు మళ్ళీ టికెట్టు ఇస్తే ఈ సారి డిపాజిట్లు కూడా రావన్నది ఆయన అభిప్రాయమని జగిత్యాల సెగ్మెంటు లోని టిఆర్ఎస్ కార్యకర్తల ద్వారా తెలిసినది. డాక్టర్ సంజయ్ కుమార్ ‘మాస్ లీడర్’ గా గుర్తింపు పొందడంలో దారుణంగా విఫలమైనందున ‘ప్రత్యామ్నాయ’ అభ్యర్థికి టికెట్టు ఇస్తే జీవన్ రెడ్డితో తలపడవచ్చునని పలువురు కిందిస్థాయి నాయకులంటున్నారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఎం.పి. కవిత డాక్టర్ సంజయ్ ను ప్రోత్సహిస్తున్నారని చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎల్. రమణ కూడా కొంతకాలంగా హడావుడి చేస్తున్నారు. టిడిపి కార్యకర్తలు,శ్రేణుల్లో ఉత్తేజం నింపే కార్యాచరణ ప్రణాలికను అమలు చేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఆయన టిడిపి అభ్యర్థిగా జగిత్యాలలో బరిలో ఉంటారు.