టిటిడిపి లో సెటిలర్లకు గడ్డు పరిస్థితి. ఎల్.రమణ పై ఫిర్యాదుల వెల్లువ.


తెలంగాణ తెలుగుదేశం పార్టీ లో సెటిలర్లు గడ్డుపరిస్థితి ఎదుర్కుంటున్నది. కొన్ని నియోజకవర్గాల్లో క్రియాశీలకంగా వ్యవహరించే సెటిలర్ నాయకులూ ఆగ్రహంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పదిహేను సీట్లను గెలుచుకుని సత్తాచాటింది. తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీకి ధీటుగా సీట్లను, ఓట్లను తెలుగుదేశం పార్టీ సాధించింది. కానీ టీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తెలంగాణలో టీడీపీకి ‘బ్యాడ్ టైమ్‌’ మొదలైంది. టీడీపీని కేసీఆర్ టార్గెట్‌ చేశారు. ‘ఆపరేషన్ ఆకర్ష్’ అస్త్రానికి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఆర్.కృష్ణయ్య మినహా మిగతా ఎమ్మెల్యేలంతా లొంగిపోయారు. గ్రేటర్‌ హైదరాబాద్ లో గతంలో సెటిలర్ల మద్దతు వల్ల టీడీపీ హవా కొనసాగింది. అలాంటి పార్టీ గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసింది. మందాడి శ్రీనివాసరావు మాత్రమే టీడీపీ పక్షాన కార్పొరేటర్ గా గెలుపొందారు. గ్రేటర్ ఎన్నికల్లో విజయం తర్వాత సహజంగానే టీఆర్ఎస్ మరింత స్పీడు పెంచింది. రాజధానిలో టీడీపీకి అండగా నిలిచే సెటిలర్ నేతలపై దృష్టిపెట్టి కారెక్కించింది. అయినప్పటికీ మెజారిటీ దిగువ శ్రేణి నాయకులు ఇంకా టీడీపీకి మద్దతుగానే ఉన్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా వారు టీడీపీని వీడలేదు. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై ఉన్న భరోసాతో వారు పసుపు జెండానే మోస్తున్నారు. అలాంటి నేతలు ఇప్పుడు పార్టీలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారనే చర్చ ఎన్‌టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా సాగుతోంది. హైదరాబాద్‌లో ఎవరు విజయం సాధించాలన్నా సెటిలర్ల మద్దతు కీలకం. దీంతో ఒకవైపు అధికారపార్టీ, మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సెటిలర్లను ఆకర్షించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ తరుణంలో తమకు అండగా ఉన్న ఆ వర్గాలను తెలంగాణ తెలుగుదేశం పార్టీ దూరం చేసుకుంటోందనే విమర్శలు సొంత పార్టీ నుంచే వినిపిస్తున్నవి. తెలంగాణలో టీడీపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. పార్టీకి జవసత్వాలు తీసుకురావల్సిన అవసరం ఉన్నట్టు అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఉన్న నేతలను కాపాడుకోవడంతో పాటు కొత్తవాళ్లను ప్రోత్సహించడం, ఇతర పార్టీల నాయకులను ఆకర్షించవలసి ఉన్నది. చంద్రబాబు కూడా తెలంగాణ పార్టీ నాయకత్వానికి ఇదే విషయాన్ని పదేపదే చెబుతున్నారు. అయినా టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ పట్టించుకోవడంలేదన్న విమర్శలున్నాయి. ఇతర నేతలను ఆకర్శించడం అన్న అంశాన్ని పక్కనపెడితే.. ఉన్న నేతలను పార్టీ వీడేలా పొగబెడుతున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నవి. అందరినీ కలుపుకుపోవాల్సిన పార్టీ అధ్యక్షుడు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ముఖ్యంగా సెటిలర్లను ఆయన దగ్గరకు రానివ్వడంలేదనే ఆగ్రహం ఆ వర్గం నేతల్లో వ్యక్తమవుతోంది. ఇక పార్టీకోసం పనిచేసేందుకు ఉత్సాహం చూపే నాయకులను ప్రోత్సహించాల్సింది పోయి టీటీడీపీ అధ్యక్షుడే నిరుత్సాహపరుస్తున్నట్లు కొందరు చెబుతున్నారు. చంద్రబాబు హైదరాబాద్‌కు వచ్చినప్పుడు భారీ జనసమీకరణతో స్వాగతం పలికి, క్యాడర్‌లో జోష్ నింపుదామని ప్రయత్నించిన నాయకులను రమణ అడ్డుకున్నట్టు తెలియవచ్చింది. ‘ కేసులు పెడతారని’ భయపెట్టినట్టు సమాచారం. కేసులకు భయపడితే ఇక పార్టీని ఎలా నడుపుతారంటూ నాయకులు చెబుతున్నారు. గతంలోశ్రీకృష్ట కమిటీకి ఎంఐఎం తరఫున అసదుద్దీన్‌తో పాటు నివేదిక సమర్పించిన ఓ నాయకుడు రేవంత్ రెడ్డి ఆహ్వానంతో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే రేవంత్ పార్టీ మారినా ఆయన మాత్రం టీడీపీని వీడలేదు. పార్టీలో తనకు ఏదైనా అవకాశం కల్పించాలంటూ అధ్యక్షుడిని కోరారు. ‘ పోయి రేవంత్‌రెడ్డిని అడుక్కో’మంటూ ఎల్. రమణ నిర్లక్షంగా బదులిచ్చారని అంటున్నారు. ఇటీవల ఏపీ నేతల ప్రమేయంతో టీడీపీ కండువా కప్పుకున్న మరో సెటిలర్స్ నాయకుడికి కూడా చేదు అనుభవమే ఎదురైనట్టు సమాచారం. ‘ఎవరి ద్వారా పార్టీలో చేరావో వారినే పదవులను కోరాలని ‘ టీటీడీపీ సారథి వ్యాఖ్యానించారని విమర్శలు వస్తున్నవి. రమణ వైఖరి పట్ల తమ గోడును పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు దగ్గర వెళ్లబోసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.