టీమ్’ సెలెక్షన్ లో జె.సి.పవన్.

అనంతపురం;
వచ్చే ఎన్నికల్లో తన తరఫున కుమారుడు పవన్ బరిలో ఉంటాడని ఇప్పటికే దివాకర్‌రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే! ఈ కారణంగా తనకంటూ ఒక బలమైన టీమ్‌ని ఏర్పాటుచేసుకునే బాధ్యతను కుమారుడికి అప్పగించారు. పవన్‌ కూడా అదే పనిలో బిజీగా ఉన్నారు.ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాజకీయ నాయకులు రకరకాల వేషధారణతో రావడం సహజం. ఇప్పుడు సామాజికా సేవా కార్యక్రమాల పేరిట జరుగుతున్న హడావిడి కూడా అదే కోవకు చెందింది. ఈ దిశగా అనంతపురం జిల్లాలో ఒక యువనేత తన కార్యక్రమాలను మరింత ఉధృతం చేశారు. పేరు పవన్‌కుమార్‌రెడ్డి. అనంతపురం ఎంపీ జేసీదివాకర్‌రెడ్డి కుమారుడు. వచ్చే ఎన్నికల్లో పవన్‌కుమార్‌రెడ్డి బరిలోకి దిగనున్నట్టు ఆయన సన్నిహితులు ధృవీకరిస్తున్నారు. ఇందులో భాగంగా పలు సామాజిక కార్యక్రమాలను పవన్ చేపడుతున్నారు. చేపడుతున్నారు. రంజాన్ పండుగని పురస్కరించుకుని అనంతపురం నగరంలో ముస్లంలకు ఇఫ్తార్ విందు ఏర్పాటుచేశారు. దీనికి భారత క్రికెట్ మాజీ కెప్టన్ మహ్మద్ అజారుద్దీన్‌ను ఆహ్వానించారు. ఎంపీ దివాకర్‌రెడ్డి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి తదితర ముఖ్య నేతలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో వచ్చిన ముస్లిలను పవన్‌కుమార్‌రెడ్డి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే పవన్‌కుమార్‌రెడ్డి తన’ టీమ్‌’ను బలోపేతం చేస్తున్నారన్న చర్చ అనంతపురం జిల్లాలో సాగుతోంది. పలువురు ముఖ్య నేతలను కూడా పవన్‌కుమార్‌రెడ్డి తరచూ కలుస్తున్నారు. అనంతపురంలో ఎస్ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ యజమాని సురేంద్రబాబుతో ఈ మధ్యనే రహస్య భేటీ నిర్వహించినట్టు సమాచారం. అనంతపురం అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సురేంద్రబాబును బరిలోకి దింపడానికి జేసీవర్గం ప్రయత్నిస్తున్నట్టు తెలుగుదేశం, పార్టీ వర్గాలు అంటున్నాయి. గత ఎన్నికల సమయంలో కూడా సురేంద్రబాబు పేరును టీడీపీ ప్రకటించినా చివరి నిముషంలో ప్రభాకర్‌చౌదరికి ఆ స్థానాన్ని ఖరారుచేశారు. కాంట్రాక్టులు సహా పలు ప్రాజెక్టు పనులు చేపట్టిన సురేంద్రబాబు ఈ మధ్య కాలంలో ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన బాగా డబ్బు ఖర్చుపెట్టగలరన్న అభిప్రాయం ఏర్పడింది. జేసీవర్గంతో చేతులు కలిపితే టిక్కెట్‌ ఖాయమనే అభిప్రాయం కలిగించడం కోసమే ఇటీవల పలుమార్లు సురేంద్రబాబుతో పవన్‌కుమార్‌రెడ్డి సమావేశమైనట్టు తెలుస్తున్నది. హంద్రీనీవా కాంట్రాక్టులు, ఇతర పనులు చేస్తూ ఇటు ప్రభుత్వ పెద్దలకు, అటు అధికారపార్టీ నేతలకు సురేంద్రబాబు బాగా దగ్గరయ్యారు. ఇదే అదనుగా సురేంద్రబాబును అనంతపురం అభ్యర్థిగా తీసుకువస్తే తమకు ప్రయోజనం ఉంటుందని జేసీవర్గం అంచనా వేస్తున్నది.