తగ్గిపోతున్న తెలుగు వెలుగు. నాలుగో స్థానానికి దిగజారిన ‘తెలుగు’.

హైదరాబాద్:
తెలుగు భాష అస్తిత్వ సంక్షోభంలోకి జారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో అత్యధికులు మాట్లాడే భాషల్లో ఇన్నాళ్లూ మూడో స్థానంలో ఉన్న తెలుగు నాలుగో స్థానానికి పడిపోయింది. నాలుగో స్థానంలో ఉన్న మరాఠీ మూడో స్థానానికి చేరింది. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మాట్లాడే భారతీయ భాషల్లో హిందీ తన ప్రథమ స్థానాన్ని నిలుపుకొంది. గత జనాభా లెక్కలతో పోలిస్తే హిందీని మాతృభాషగా చెప్పినవారి సంఖ్య పెరిగింది. దేవ భాష సంస్కృతం పరిస్థితి మరింత దిగజారడం ఆందోళన కలిగిస్తోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో గుర్తింపు పొందిన 22 భాషల్లో వాటిని మాట్లాడేవారి సంఖ్య, వివరాలను ప్రకటించారు. 2001 జనాభా లెక్కల ప్రకారం దేశంలో అత్యధికంగా 41.03 శాతం మంది హిందీ మాట్లాడుతుండగా 2011 గణనలో ఈ సంఖ్య మరింత పెరిగింది. 43.63% మంది తమ మాతృభాష హిందీ అని చెప్పారు. బెంగాలీ తన రెండో స్థానాన్ని మరోసారి నిలబెట్టుకుంది. బెంగాలీని మాతృభాషగా చెప్పినవారి సంఖ్య పెరిగి 8.3%కి చేరింది. మూడో స్థానంలో ఉన్న తెలుగుని పక్కకినెట్టి ఆ స్థానాన్ని మరాఠీ ఆక్రమించింది. 2001లో మరాఠీ మాట్లాడేవారి సంఖ్య 6.99% ఉండగా తాజా లెక్కల్లో అది 7.09%కి పెరిగింది. అదే 2001లో 7.19% ఉన్న తెలుగు మాట్లాడేవారి సంఖ్య 2011 నాటికి 6.93%కి తగ్గింది. 2001 లెక్కల ప్రకారం ఆరో స్థానంలో ఉన్న ఉర్దూ 2011 గణనలో ఏడో స్థానానికి పడిపోయింది. 4.74% మంది మాట్లాడే గుజరాతీ ఆరో స్థానానికి చేరింది.అతి తక్కువ మంది మాట్లాడే భాషగా సంస్కృతం పట్టికలో చివరన నిలిచింది. కేవలం 24,821 మంది మాత్రమే సంస్కృతాన్ని తమ మాతృభాషగా పేర్కొన్నారు. బోడో, మణిపూరి, కొంకణి, డోగ్రీ భాషలు సైతం సంస్కృతానికి పైమెట్టుపై ఉన్నాయి. జాబితాలో పేర్కొనని భాషల్లో రాజస్థాన్ లోని భిలీ లేక భిలౌడీ భాషను 1.04 కోట్ల మంది మాట్లాడుతున్నారు. 29 లక్షల మంది మాట్లాడే గోండీ రెండో స్థానంలో ఉంది. ఇంగ్లిష్ ని 2.6 లక్షల మంది తమ మాతృభాషగా చెప్పారు.