తగ్గుతున్న ఎడారి వలసలు.

దుబాయి:
భార్యాబిడ్డలకు కడుపు నిండా బువ్వ పెట్టాలని, కన్నవారిని కంటిరెప్పల్లా కాచుకోవాలనే తపనతో దేశం కాని దేశం పోయేవాళ్లు. ఎండమావులని చూసి ఆశపడి ఎగురుకుంటూ పోయి అవి మంటలని తెలుసుకునేంతలో మాడి మసైపోయేవాళ్లు. ఎడారి దేశాలకు ఏటా వలసపోయే భారతీయుల సంఖ్య లక్షల్లో ఉండేది. కానీ రెండేళ్లుగా ఈ సంఖ్య బాగా తగ్గిపోతోంది. ఇంకా చెప్పాలంటే గల్ఫ్ దేశాలకు వెళ్లేవారి సంఖ్య రెండేళ్లలో సగానికి పైగా పడిపోయింది. 2015లో 7.6 లక్షల మంది వెళ్తే 2017లో ఈ సంఖ్య కేవలం 3.7 లక్షలు మాత్రమే. ఇటీవల కాలంలో గల్ఫ్ దేశాలు ప్రవేశపెట్టిన కఠినమైన వలస నిబంధనలకు తోడు అక్కడ మనవాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలు, దుర్భర జీవితం తెలుసుకొని చాలామంది ఆ ప్రయత్నాలు మానేస్తున్నట్టు తెలుస్తోంది.
2017లో భారతీయ కార్మికులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ)కి పెద్ద సంఖ్యలో వెళ్లారు. సుమారుగా 1.5 లక్షల మంది యుఏఈకి చేరారు. అంతకు ముందు భారతీయ కార్మికులు ప్రధానంగా వెళ్లే సౌదీ అరేబియా రెండో స్థానానికి పడిపోయింది. 2015లో దాదాపు 3 లక్షల మంది సౌదీకి వెళ్లారు. కానీ 2017లో ఈ సంఖ్య 74% తగ్గి కేవలం 78,000 మంది భారతీయులు అరబ్ దేశం చేరారు. గల్ఫ్ దేశాలకు భారతీయులు వెళ్లకపోవడానికి రెండు ప్రధాన కారణాలను చెబుతున్నారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో స్థానికులకు ప్రాధాన్యతనిచ్చే నితాఖత్ పథకం ప్రవేశపెట్టడం ఒకటైతే, అక్కడి ఆర్థిక పరిస్థితులు తారుమారు కావడం రెండోది. ఒమన్ తన ఇమ్మిగ్రేషన్ చట్టాలను మరింత కఠినతరం చేయగా సౌదీ అరేబియా ఫ్యామిలీ ట్యాక్స్ విధించింది. దీని ప్రకారం ప్రతి వలస కార్మికుడు తనపై ఆధారపడినవారందరికి 100 రియాళ్ల చొప్పున ప్రతి నెలా చెల్లించాలి. ఏటా ఈ మొత్తం రెట్టింపవుతుంది.
అయితే ఎడారి దేశాలలో మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా యుఏఈ తన విధానాలు మార్చుకొనేందుకు సిద్ధమవుతుండటంతో గల్ఫ్ లో ఆ దేశానికి వెళ్లేందుకే ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది చివరికల్లా తమ దేశంలో పెట్టుబడులు పెట్టేవారికి, నిపుణులకు 10 ఏళ్లపాటు నివాస వీసాలు జారీ యుఏఈ ప్రభుత్వం చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే ఇటీవలి పరిణామాల కారణంగా ఉద్యోగాలు పోగొట్టుకున్న వలస కార్మికులు, ఉద్యోగస్థులు మరో ఉద్యోగం వెతుక్కొనేందుకు వారికి తాత్కాలిక మంజూరు చేయనున్నట్టు తెలిపింది.