తన ప్రాణాలు పోయినా. వందల ప్రాణాలు కాపాడిన పైలట్.

ముంబై:
నగరంలోని ఓ భవంతిపై చార్టెడ్ విమానం కూలిన ఘటనపై పౌరవిమానయాన శాఖ మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్ స్పందించారు. విమానం కూలిన ఘటన తనను కలచివేసిందని ట్వీట్ చేశారు. ఇదో దురదృష్టకర ఘటన అని పేర్కొన్నారు. తాను ప్రాణాలు కోల్పోయినా ఎంతోమంది ప్రాణాలను కాపాడిన పైలట్‌కు సెల్యూట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రమాదాన్ని ముందే గుర్తించిన పైలట్ మరింత ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్త పడ్డాడని పేర్కొన్నారు. అతడు అప్రమత్తం కాకుంటే మరెంతో మంది ప్రాణాలు కోల్పోయి ఉండేవారని, పెను నష్టం జరిగి ఉండేదని అన్నారు. విమానం నివాస సముదాయానికి ఢీకొనకుండా పైలట్ జాగ్రత్త పడ్డాడని పేర్కొన్నారు. ఘట్కోవర్‌లో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, ఇద్దరు ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీర్లు, ఓ పాదచారి మరణించారు.ఉత్తరప్రదేశ్‌కు చెందిన 12 సీటర్ చార్టర్డ్ విమానం ముంబై శివారు ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ భవన సముదాయంపై కూలిపోయింది. మరికాసేపట్లో జుహు ఎయిర్‌పోర్టులో దిగాల్సిన విమానం ఇంజిన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడంతో కుప్పకూలింది. ప్రమాదాన్ని శంకించిన పైలట్ నివాస సముదాయాలను విమానం ఢీకొనకుండా జాగ్రత్త పడ్డాడు. లేదంటే భారీ ప్రాణనష్టం జరిగి ఉండేదని అధికారులు పేర్కొన్నారు. విమానం కాస్తా ముందుకు వెళ్లి ఉంటే ఎత్తైన నివాస భవనాలను ఢీకొని ఉండేది. దీంతో పెను నష్టమే సంభవించి ఉండేది.