తల్లిని చంపిన కొడుకు.

హైదరాబాద్:
నవమాసాలు మోసి, కనీ పెంచిన కన్నతల్లినే పొట్టనపెట్టుకున్నాడు ఓ కసాయి కొడుకు. నగరంలోని ఎస్సార్‌‌నగర్‌ ఎల్లారెడ్డిగూడలో ఈ దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి జరిగిన ఈ హత్య తీవ్ర కలకలం సృష్టించింది. అప్పులు చేసి పరువు తీస్తోందని కన్న తల్లి మమత తల పై కొడుకు మదన్ కర్రతో కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆమె గుండెలపై కూర్చుని గొంతునులిమి ఊపిరి ఆగేలా చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు మదన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అలాగే మమత హత్య కేసులో భర్త శ్రీనివాస్ ప్రమేయం ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తన కూతురును కొట్టి చంపిన వారిలో అల్లుడు శ్రీనివాస్ కూడా ఉన్నాడని మమత తండ్రి రాములు యాదవ్ ఆరోపించాడు. దీంతో పోలీసులు శ్రీనివాస్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఎల్లారెడ్డిగూడ కేబీఆర్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో మమత నివసించేది. శ్రీనివాస్, మమత దంపతులకు కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కూతురికి పెళ్లి అయ్యింది. శ్రీనివాస్ ఇంటి అద్దెలతో కుటుంబాన్ని నెట్టుకు వస్తున్నాడు. ఆర్థిక అవసరాలరీత్యా మమత చిట్టీల వ్యాపారం చేస్తోంది. అయితే నష్టాలు రావడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయింది. చిట్టీ సొమ్ముల కోసం బాధితులు ఇంటికి వచ్చి గొడవ చేసేవారు. దీంతో ఇటీవల ఒకసారి ఎన్టీఆర్ గార్డెన్స్‌లో మమత నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబం అప్పుల పాలు కావడానికి తల్లే కారణమంటూ కొడుకు మదన్ తరచూ ఆమెతో గొడవ పడేవాడు. తీవ్రమనస్థాపం చెందిన మమత రెండు వారాల క్రితం ఇళ్లు వదిలి ఎవ్వరికీ చెప్పకుండా కొత్తపేటలో నివాసం ఉండే అన్న రమేష్ ఇంటికి వెళ్లింది. రాత్రి మమతను అన్న రమేష్ ఆమె ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోయాడు.