తెలంగాణలో రెచ్చిపోతున్న ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యం.

వరంగల్:
స్కూల్లో ఫీజుల గురించి ప్రశ్నించినందుకు నిర్వాహకులు కన్నెర్ర చేశారు. తమ దగ్గర చదువుతున్న విద్యార్థికి టీసీ ఇచ్చి పంపేశారు. ఇదేంటని అడిగిన బాధితుడి తండ్రిని నోటికొచ్చినట్లు తిట్టారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరిలో జరిగిందీ సంఘటన. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి సొంతూర్లో ప్రైవేట్‌ స్కూల్‌ దౌర్జన్యం చర్చనీయాంశంగా మారింది. ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని అడిగినందుకు విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించిన ఘటన కలకలం సృష్టించింది. స్కూల్‌ యాజమాన్యం నిర్వాకంపై బాధిత విద్యార్థి కన్నీరు మున్నీరవుతున్నాడు. అతని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విజ్ఞానం పెంచాల్సిన స్కూల్‌ నిర్వాహకులే.. అరాచకంగా వ్యవహరించడమేంటని ప్రశ్నిస్తున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరిలోని లయోల ప్రైవేట్‌ పాఠశాలలో అనురూప్‌ ఏడో తరగతి చదువుతున్నాడు. రోజూ మాదిరిగానే స్కూల్‌కు వెళ్లిన అనురూప్‌ను ఆఫీస్‌ గదికి పిలిపించిన ప్రిన్సిపల్‌ టీసీ ఇచ్చి వెళ్లిపోవాలని చెప్పారు. అనుకోని ఈ సంఘటనతో అవాక్కయిన విద్యార్థి ఇంటికెళ్లి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. అయితే.. అంతకుముందు జరిగిన పరిణామాలే అనురూప్‌కు టీసీ ఇచ్చేందుకు కారణమయ్యాయి. పాఠశాలలో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారని, ఆస్థాయిలో ఫీజులు చెల్లించి పిల్లలను చదివించలేకపోతున్నామని అనురూప్‌ తండ్రి శ్రీధర్‌ పాఠశాల యాజమాన్యాన్ని ప్రశ్నించాడు. స్కూల్‌ నిర్వాహకుల నుంచి సమాధానం లేకపోవడంతో.. ఫీజులు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని అనురూప్‌ తండ్రి మండల విద్యాధికారికి ఫిర్యాదు చేశాడు.ఫీజుల విషయంలో ఎంఈవోకు ఫిర్యాదు వెళ్లిందని తెలుసుకున్న లయోల స్కూల్‌ యాజమాన్యం విచక్షణ కోల్పోయింది. ఫీజులు ఎందుకు పెంచాల్సి వచ్చిందో వివరణ ఇవ్వలేకపోయింది. ఏకంగా అనురూప్‌కు టీసీ ఇచ్చి పంపించింది.
ఫీజుల గురించి ప్రశ్నించినందుకు టీసీ ఇచ్చి పంపించారేంటని ప్రశ్నించేందుకు స్కూల్‌కు వెళ్తే.. తనను మాటల్లో చెప్పలేని రీతిలో దూషించారని అనురూప్‌ తండ్రి శ్రీధర్‌ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దిక్కున్నచోట చెప్పుకోవాలని, తమను ఏమీ చేయలేరంటూ స్కూల్‌ నుంచి గెంటేశారని తెలిపాడు. ఇలాంటి యాజమాన్యాలంటే భయపడే.. పిల్లల తల్లిదండ్రులు తమ బాధలను బయటకు చెప్పుకోలేకపోతున్నారని, తాము ఏదైనా అడిగితే పిల్లలపై కక్ష పెంచుకుంటారని వెనుకడుగు వేస్తున్నారని బాధిత విద్యార్థి తండ్రి చెబుతున్నాడు. తాను ధైర్యం చేసి ముందడుగు వేసినందుకు తన కుమారుడికి టీసీ ఇచ్చారని వాపోతున్నాడు.సాక్షాత్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స్వగ్రామంలోనే ప్రైవేట్‌ పాఠశాల పరిస్థితి ఇలా ఉంటే.. ఇక తెలంగాణ వ్యాప్తంగా పాఠశాలలపై పర్యవేక్షణ ఎక్కడుందని విద్యార్థి సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. చాలామంది పేరెంట్స్‌.. తమకు కష్టమైనా, స్కూల్‌ యాజమాన్యాలు వేధిస్తున్నా.. ఇలా చేస్తారన్న భయంతోనే బయటకు చెప్పుకోవడం లేదంటున్నారు. మరి.. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఊళ్లో జరిగిన ఈ సంఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి.