తెలంగాణ అడవులకు దక్కిన అరుదైన ఘనత.

 

  • ఏడు పులులకు తల్లి అయిన ఫల్గుణ.

కొమురం భీమ్ ఆసిఫాబాద్:
తెలంగాణ అడవులు ప్రకృతి రమణీయతకు, వన్యప్రాణుల ఆవాసానికి అనువుగా మారుతున్నాయి. దేశంలోనే అరుదైన సంఘటనకు ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అడవులు, కవ్వాల్ పులుల అభయారణ్యం సాక్షిగా నిలిచాయి. కొమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఫల్గుణ అనే పెద్ద పులి ఇటీవల మూడు పిల్లలకు జన్మనిచ్చింది. రెండేళ్ల కింద ఇదే ప్రాంతంలో నాలుగు పిల్లలను కన్న, ఈ ఆడపులి ఇప్పుడు మరో మూడింటికి జన్మ నివ్వటం అత్యంత అరుదైన సంఘటనగా అటవీ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కొద్ది రోజుల కిందట తల్లీ, పిల్లల పాదముద్రలను అటవీ ప్రాంతంలో గుర్తించిన సిబ్బంది, ఆ తర్వాత కెమెరాల సహాయంలో మూడు పిల్లలను గుర్తించారు. పాదముద్రలతో పాటు, పులుల వంటిపై ఉండే మచ్చలను కూడా శాస్త్రీయంగా విశ్లేషించిన అధికారులు, తల్లీ తో పాటు, ఈ మూడు పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నాయని, అడవిలో స్వేచ్ఛగా విహరిస్తున్నాయని తెలిపారు. కదంబ అటవీ ప్రాంతంలో పుట్టిన ఈ పిల్లల్లో మొదటి నాలుగింటికి K1, K2, K3, K4 గా పేర్లు పెట్టిన అధకారులు, ప్రస్తుత మూడింటికి K5, K6, K7 గా పిలుస్తున్నారు. గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు, మహారాష్ట్ర సరిహద్దు వెంట విస్తరించిన అడవుల్లో కొంత భాగాన్ని 2012లో ప్రభుత్వం కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంగా ప్రకటించింది. ఇక మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్, తెలంగాణ అటవీ ప్రాంతాలను కలిపి టైగర్ కారిడార్ గా కేంద్ర అటవీ శాఖ గుర్తించింది. ప్రస్తుతం ఈ కారిడార్ లోనే ఫల్గుణతో పాటు మిగతా పులుల సంచారం ఎక్కువగా ఉండని అటవీ అధికారులు చెబుతున్నారు. తెలంగాణకు చెందిన అటవీ భూ భాగంలో వన్యప్రాణులకు, పులుల వృద్దికి అనువైన వాతావరణాన్ని ఏర్పాటు చేసేందుకు అటవీ శాఖ చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఈ దిశగా చర్యలు మరింత ముమ్మరం అయ్యాయి. ప్రణాళికాబద్ధంగా అటవీ శాఖ చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని, కవ్వాల్ ప్రాంతం పులులకు ఆవాసయోగ్యం మార్చటం, నీటి సౌకర్యం, వేట కోసం జింకల సంతతికి పెంచటం, వేట నియంత్రణ, వేటగాళ్ల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించటం, స్థానికులకు వన్యప్రాణుల సంరక్షణ ప్రాధాన్యత తెలిసేలా చేసిన ప్రయత్నాలన్నీ ఫలితాలు ఇస్తున్నాయని అదనపు అటవీ సంరక్షణ అధికారి (వైల్డ్ లైఫ్) మునీంద్ర తెలిపారు. తల్లి ఫల్గుణతో పాటు మూడు పిల్లలను కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తున్నామని, వాటి రక్షణ చర్యలు తీసుకుంటున్నామని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ సి.శరవనన్ అన్నారు. ప్రత్యేకంగా సిబ్బందిని, బేస్ క్యాంప్ వాచర్స్ ను నియమించామని, వేటగాళ్ల కదలికలను నిరోధించటంతో పాటు, అటవీ ప్రాంతంలో ఉన్న ఉచ్చులను, వైర్లను గుర్తించి తొలగిస్తున్నామని అసిఫాబాద్ అటవీ అధికారి రంజిత్ నాయక్ తెలిపారు.