థాయ్ గుహకు 100కి పైగా చిమ్నీల డ్రిల్లింగ్.

థాయ్ లాండ్.
15 రోజులు.. క్షణక్షణం భయం భయంగా గడుస్తున్న కాలం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గుహలోనే గడుపుతోంది థాయిలాండ్ బాలల ఫుట్‌బాల్‌ టీమ్‌. ప్రపంచ దేశాలన్నీ రంగంలోకి దిగి ఎట్టకేలకు వారి ఆచూకీ కనిపెట్టగలిగింది. కానీ వారందరినీ భద్రంగా బయటికి తెచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్‌ ముమ్మరంగా కొనసాగుతోంది. నీళ్లని బయటికి తోడిపోస్తే లోపలికి వెళ్లిన మార్గానే బయటికి రావచ్చని ఆ ప్రయత్నం ప్రారంభించారు. కానీ అసలే వర్షాకాలం. కుండపోతగా కొండలపై కురుస్తున్న వానల కారణంగా నీళ్లు తగ్గడం లేదు. జపాన్ ఇంజనీర్లు గుహ నుంచి గంటకు 1 సెంటీమీటర్ నీటిమట్టాన్ని తగ్గించగలుగుతున్నారు. లోపల పిల్లల దగ్గరకి ఆహారం, నీళ్లు అందజేసేందుకు వెళ్లిన డైవర్లతో పిల్లలను బయటికి తెద్దామంటే గుహలో చిక్కుపడిన వారెవరికీ ఈత రాదాయె. ముందు వాళ్లకి ఈత నేర్పి ఆ తర్వాత డైవింగ్ శిక్షణ ఇవ్వాలి. ఇదంతా ఒకటి రెండు రోజుల్లో అయిపోయే వ్యవహారం కాదు. ఎంతో ప్రమాదంతో కూడుకున్న పని. నిపుణులైన డైవర్లే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదీ కాకుండా మానసికంగా, శారీరకంగా బలహీనులైన బాలలు స్కూబా డైవింగ్ సూట్ వేసుకొని కొన్ని కిలోమీటర్ల మేర ప్రమాదకరమైన దారిలో సురక్షితంగా బయటికి రాగలరా అనేది సందేహమే.నాలుగు నెలలపాటు వానాకాలం కావడంతో వర్షాలు ఆగి నీటిమట్టం తగ్గే వరకు వేచి ఉండటం మంచిదని కొందరు సూచిస్తున్నారు. అప్పటి వరకు బయటి నుంచి ఆహారం సరఫరా చేయాలి. పైగా వర్షపాతం అంచనాలకు మించి వరదనీరు వీళ్లు ఉన్న ప్రాంతానికి చొచ్చుకువస్తే వాళ్లకి తప్పించుకొనే దారి కూడా లేదు. నీటిమట్టం పెరగడంతో వాళ్లు ఇప్పటికే ముందున్న ప్రదేశానికి కొంత వెనక్కి వెళ్లారు. మందపాటి కొండ గోడలు పెళ్లగిద్దామంటే పైకప్పు ఊడిపడితే ప్రాణాలకే ముప్పు. ఇంతలో లోపల ఉన్న ఇద్దరు పిల్లలు, కోచ్ శ్వాస తీసుకోడానికి ఇబ్బంది పడుతుండటంతో ఆక్సిజన్ పంప్ చేస్తున్నారు. లోపల ఉన్న పిల్లలు తమకు బయటి నుంచి కుక్కల అరుపులు వినిపిస్తున్నాయని చెప్పారు. అంటే భూమిపై ఎక్కడో లోపలికి వచ్చేందుకు భారీ బిలం ఉండొచ్చని భావిస్తున్నారు. కానీ ఇరుకుదారి. భారీగా విరిగిపడుతున్న కొండచరియలు. బురద కారణంగా మానవమాత్రులు వెళ్లడం సాధ్యం కాలేదు. దీంతో డ్రోన్ల ద్వారా ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. దాదాపుగా 10 కిలోమీటర్లు పొడవైన థామ్ లువాంగ్ గుహలో కచ్చితంగా అక్కడక్కడ చిమ్నీలు ఉండి ఉంటాయి. వీటి ద్వారా గాలి, వెలుతురు ప్రసరిస్తున్నందువల్లే గుహలోకి వెళ్లినవారు ఇన్నిరోజులు ప్రాణాలతో ఉండగలిగారు. ఇప్పుడు ఈ చిమ్నీల ఆలోచనే అందరి ముందున్న ఆశాకిరణం. పిల్లలను చేరుకొనేందుకు ఇటువంటి చిమ్నీలు 100కి పైగా డ్రిల్ చేయాలని నిర్ణయించారు. వీటిలో ఏ ఒక్కటైనా పిల్లలు ఉన్న ప్రదేశానికి చేరగలిగితే వారిని దాని ద్వారా బయటికి తీయవచ్చని భావిస్తున్నారు. కొన్నిచోట్ల చిమ్నీలు ఏర్పాటు చేయాలంటే 400 మీటర్లకు పైగా డ్రిల్ చేయాల్సి ఉంటుంది.
వినడానికి ఈ ఐడియా అసాధ్యంగా కనిపిస్తున్నా థాయ్ ప్రభుత్వం ప్రపంచం నలుమూలల నుంచి తరలివచ్చిన సాంకేతిక నిపుణుల సాయంతో ఎంత కష్టమైనా ఈ ఆపరేషన్ ను విజయవంతం చేయాలని పట్టుదలతో ముందుకు పోతోంది.