దమ్ముంటే సర్పంచ్‌ ఎన్నికలు జరపండి. -సీఎంకు పెరుగుతున్న ఓటమి భయం. -జనసమితి నేత ఇన్నయ్య.

కరీంనగర్‌ :
రాష్ట్రంలో అధికారం చలాయించడానికి జూలై వరకు గడువుందని, అయినా సర్పంచ్‌ ఎన్నికలను పక్కనబెట్టి అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమౌతున్న కేసిఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని తెలంగాణ జనసమితి రాష్ట్ర నాయకుడు గాదె ఇన్నయ్య వ్యాఖ్యానించారు. బుధవారం కరీంనగర్‌, పెద్దపల్లి, మంథని నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తల సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఆరు నెలల ముందస్తు ఎన్నికలకు సిద్ధమంటున్న కేసిఆర్‌ మరింత కాలం పాలించడానికి ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు, నిరుద్యోగుల ఆత్మహత్యలు, ఫెయిల్యూర్‌ స్కీములతో టిఆర్‌ఎస్‌ ఓటమి దిశగా అడుగు వేస్తుందన్నారు. అందుకే ప్రజలు కోరుతున్న సర్పంచ్‌ ఎన్నికలను పక్కనబెట్టి అసెంబ్లీకి సిద్ధమవడం విడ్డూరంగా ఉందన్నారు. ఢిల్లీ స్థాయిలో నెంబర్‌ వన్‌ సీఎం అయినప్పుడు ముందస్తుకు తొందరెందుకో చెప్పాలని ప్రశ్నించారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలు మెచ్చే రీతిలో పథకాలు అమలు చేస్తున్నప్పుడు సర్పంచ్‌ ఎన్నికలను, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించుకున్న తర్వాతే అసెంబ్లీకి వెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయిందన్నారు. భూస్వాములకు అనుకూలమైన రైతుబంధు పథకంతో ప్రభుత్వం ఎవరి పక్షాన నిలబడిందో ప్రజలు గ్రహించారన్నారు. దళితులకివ్వాల్సిన మూడెకరాల భూమి, లక్ష ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌రూం స్కీములన్నీ విఫలమైనందున ప్రజల దృష్టి మరలించేందుకు సర్పంచ్‌ ఎన్నికలు వస్తున్నాయంటూ తిరిగి మధ్యంతరం పేరిట ముందస్తు ప్రచారం చేస్తున్నారన్నారు. సర్పంచ్‌ ఎన్నికలు నిలిపివేయాలంటూ హైకోర్టులో వేసిన పిటిషన్లలో తొమ్మిది టిఆర్‌ఎస్‌ నాయకులే వేశారని, ఎన్నికల పట్ల ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి ఏపాటిదో గమనించాలని ఆయన ప్రజలను కోరారు.