దీక్ష విరమణకు ఎంపి సి.ఎం.రమేశ్ నో.

కడప:
కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం దీక్ష చేపట్టిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేంద్ర సింగ్ ఇవాళ మళ్లీ ఫోన్ చేశారు. దీక్ష విరమించాలని కోరారు. కడపలో స్టీల్ ఫ్లాంట్ ఏర్పాటుకు సంప్రదింపులు కొనసాగిస్తున్నామని అందుచేత దీక్ష విరమించాలని కోరారు. అయితే అధికారిక ప్రకటన చేస్తేనే దీక్ష విరమిస్తానని రమేష్ స్పష్టం చేశారు. బీరేంద్ర సింగ్‌ను గురువారం టీడీపీ ఎంపీలు కలిసారు. 9 అంశాల్లో 7 అంశాలకు స్పష్టత రాగా మిగిలిని రెండు అంశాలకు సంబంధించి సీఎం చంద్రబాబు ఇచ్చిన లేఖను కేంద్రమంత్రికి అందజేశారు. ఆ లేఖపై చర్చలు జరిపిన అనంతరం బీరేంద్రసింగ్ మీడియాతో మాట్లాడుతూ కడప స్టీల్‌ ప్లాంట్‌పై ఏపీ ప్రభుత్వం పంపిన సమాచారాన్ని అధికారులతో చర్చిస్తానని అన్నారు. అధికారులతో చర్చల తర్వాతే స్పష్టత ఇస్తానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ సమాచారాన్ని మెకాన్‌కు పంపాలని టీడీపీ ఎంపీలకు సూచించానని, ఇవ్వాల్సిన సమాచారాన్ని ప్రభుత్వ ఫార్మాట్‌లో మెకాన్‌కు పంపాలని చెప్పానని ఆయన అన్నారు. అయితే ఇప్పటికే మెకాన్‌కు పంపినట్టు ఏపీఎండీసీ చైర్మన్‌ వెంకయ్యచౌదరి చెప్పారు.