దేవుడా దేవుడా సర్పంచ్‌ ఎన్నికలు ఆగాలి…

  • మొక్కుతున్న ఎమ్మెల్యేలు
  • రూ.కోట్ల ఖర్చు భారం….
  • అసమ్మతి వాదు బెడద

విశ్వనాథ్‌, కరీంనగర్‌ :
సర్పంచ్‌ ఎన్నికలంటే గ్రామాల్లో సంతోషమే. ఎన్నికలు వస్తే గ్రామాల్లో పండగ. నాలుగు గ్రూపులతో కలిసి జల్సాలు చేసుకోవచ్చు. జనరల్‌ స్థానాలు అయితే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, బడా బడా బాబులు నోట్ల కట్టలిస్తారు. ఇక్కడి దాకా అంతా ఓకే. కాని అసలు కష్టమే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఉంది. ఎవరన్నా బుద్దిమంతుడు కోర్టుకు వెళితే అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు సర్పంచ్‌ ఎన్నికలు ఆగుతాయని ఎమ్మెల్యేంతా ఆశపడుతున్నారు. వచ్చే నెల జూలైలో సర్పంచ్‌ ఎన్నికలు జరుపుతామని ప్రభుత్వం అంటుండగా సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు చల్లచెమటలు పడుతున్నాయి. అభ్యర్థులకు ఒక్కొక్కరికి కనీసం రెండు మూడు లక్షలైనా ఇవ్వాల్సిందే. ఈ లెక్కన ఒక్కో నియోజకవర్గానికి నాలుగైదు కోట్లు సిట్టింగ్‌ ఎమ్మెల్యే వెచ్చించాల్సి వస్తుంది. ఈ ఎన్నికలు కాస్తా ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వస్తుందన్న భయం ఎమ్మెల్యేలకు పట్టుకుంది. అందుకే ఎవరో ఒకరు కోర్టుకు వెళితే ఇక ఎన్నికలు ఆగుతాయని అనుకుంట్టున్నారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలైతే ఏకంగా దేవుడినే వేడుకుంటున్నారు. దేవుడా… దేవుడా… సర్పంచ్‌ ఎన్నికలు, స్థానిక సంస్థ ఎన్నికలు వాయిదాల మీద వాయిదాలు పడి చివరికి అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిపించండి దేవుడా అంటూ ప్రార్థిస్తున్న ఎమ్మేల్యేలు లేకపోలేదు. సర్పంచ్‌ ఎన్నికల జోలిఎత్తితే ఎమ్మెల్యేల ముఖాలు పాలిపోతున్నాయి. గ్రామాల్లో అందరూ ఖుషీ అవుతుండగా ఎమ్మెల్యేలు మాత్రం ఈ ఎన్నికలు మా సావుకొస్తున్నాయని వాపోతున్నారు. బీసీ రూపంలో… ఎస్సీ రూపంలో… జనరల్‌ సీట్ల కేటాయింపు, రిజర్వేషన్ల ఖరారు ఏదో ఒక రూపంలో అడ్డుపడితే దేవుడే మమ్మల్ని ఆదుకున్నట్టు అవుతుందని సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఎదురుచూస్తున్నారు. ఈ గండం నుండి బయటపడే రోజు కోసం కళ్లల్లో వత్తులేసుకొని ఆశగా నిరీక్షిస్తున్నారు.