దేవుడిని చూపిస్తే రాజీనామా చేస్తా.

ఫిలిప్పీన్స్:
మొదటి నుంచి చర్చి అంటే ఒంటికాలిపై లేచే ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవలే దేవుడు ఉత్త స్టుపిడ్ అని వ్యాఖ్యానించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆస్తికుల ఆగ్రహానికి గురైన ఈ ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు, ఎవరైనా తనకు దేవుడిని చూపిస్తే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. కేథలిక్ విశ్వాసుల ఒరిజినల్ సిన్ వంటి పలు ప్రాథమిక సిద్ధాంతాలను ప్రశ్నించారు. అన్నెం పున్నెం ఎరుగని అమాయక శిశువులకు సైతం నిర్ణీత రుసుము తీసుకొని బాప్టిజం ఇచ్చే చర్చిలు ఎలా పాపాలను కడిగేస్తాయని నిలదీశారు. దీంతో దేశంలో అధిక సంఖ్యాకులైన రోమన్ కేథలిక్కులు దేశాధ్యక్షుడిపై మండిపడుతున్నారు.దక్షిణ దవావో నగరంలో ఓ సైన్స్ అండ్ టెక్నాలజీ కార్యక్రమాన్ని ప్రారంభించిన డ్యుటెర్టే, చర్చిలో చెప్పే దేవుడు అనే మాట తర్కానికి నిలవదన్నారు. కనీసం ఒక్కరైనా తను దేవుడిని చూసినట్టు లేదా మాట్లాడినట్టు ఒక ఫోటో లేదా సెల్ఫీ తీసుకొస్తే వెంటనే తను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అయితే దేవుడు లేదా మహోన్నతమైన ఉనికి ఒకటి ఖగోళంలోని కోట్లాది నక్షత్రాలను, గ్రహాలను ఒక దానిని మరొకటి ఢీకొనకుండా వాటికో కక్ష్య, గతిని ఏర్పరచి మానవజాతి నాశనం కాకుండా కాపాడుతోందన్నారు. చర్చిపై, దేవుడిపై అధ్యక్షుడు డ్యుటెర్టే చేస్తున్న వ్యాఖ్యలు రోమన్ కేథలిక్ వర్గాలకు తీవ్ర ఆగ్రహం కలిగిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా ఉన్న మఠాధిపతులు మనీలాలో వార్షిక సమావేశం నిర్వహించారు. డ్యుటెర్టే వెటకారాలు, వాటి ప్రభావంపై చర్చించారు. సోమవారం దేశాధ్యక్షుడితో భేటీ అయి తమ అభ్యంతరాలు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు.