దోష పరిహారార్థం.. నగలు స్వాహా! దోష పరిహారం పేరిట బాబా పూజలు

హైదరాబాద్‌:
దోషపరిహార పూజలు చేస్తానంటూ భక్తుల కళ్లుగప్పి నగలు కాజేస్తున్న దొంగ బాబాను, సహకరిస్తున్న ఆయన భార్యను సైబరాబాద్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేశారు. కమిషనర్‌ వీసీ సజ్జనార్‌.. శంషాబాద్‌ డీసీపీ పద్మజారెడ్డి, ఎస్‌వోటీ ఓఎస్డీ దయానందరెడ్డి, రాజేంద్రనగర్‌ ఏసీపీ అశోక్‌కుమార్‌తో కలిసి శుక్రవారం వివరాలు వెల్లడించారు. కేరళ రాష్ట్రం త్రిచూరు కళాడికి చెందిన శివోహం రామ శివానుజం అలియాస్‌ రామశివ చైతన్యం అనాథ. అక్కడి శివోహం జ్ఞాన గురుపీఠంలో పెరిగాడు. 1998లో పీఠం నుంచి బయటికొచ్చాడు. 2001 నుంచి హైదరాబాద్‌లో ఉంటూ.. 2009లో మత బోధకుడు మదనానంద మనవరాలు తేజస్విని వివాహమాడాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత 2014లో సన్యాసం స్వీకరించాడు. యూసుఫ్‌గూడ కృష్ణకాంత్‌ పార్క్‌ సమీపంలోని అద్దె ఇంట్లో తత్వపీఠం పేరుతో ఆధ్యాత్మిక కేంద్రాన్ని నెలకొల్పాడు. పలు టీవీ ఛానళ్లలో ఆధ్యాత్మికోపన్యాసాలు చేస్తూ ప్రాచుర్యం పొందాడు. కలశాలు మార్చి.. నగలు దోచి
ఈ క్రమంలో దోషాలను నివారించాలంటూ తనను ఆశ్రయించే భక్తుల ఇళ్లకు వెళ్లి పూజలు చేసేవాడు. పూజ సమయంలో ఇంట్లోని బంగారమంతా తన వెంట తీసుకెళ్లే కలశంలో ఉంచాలని సూచించేవాడు. పూజ అనంతరం ఆ కలశాన్ని తాను తీసుకుని, బియ్యంతో నింపిన మరోదాన్ని అక్కడ ఉంచేవాడు. తాను మరోసారి వచ్చేవరకు మూత తీయొద్దని హెచ్చరించేవాడు. అనంతరం ముఖం చాటేసేవాడు. అలా నగరంలోని బోయినపల్లిలో 3, ఎస్‌ఆర్‌నగర్‌లో 2, వనస్థలిపురం, జీడిమెట్ల, రాజేంద్రనగర్‌, మైలార్‌దేవ్‌పల్లి, పశ్చిమగోదావరి జిల్లా బొమ్మూరు, కృష్ణ జిల్లా కంచికచర్లలో ఒక్కో చోట నగలు కాజేశాడు. ఒక్క చోట విశ్రాంత పోలీస్‌ అధికారి భార్య నుంచి సుమారు రూ.40 లక్షల బంగారాన్ని దోచేశాడు. కాజేసిన ఆభరణాలను ఆయన భార్య ముత్తూట్‌, మణప్పురం గోల్డ్‌ ఫైనాన్స్‌ల్లో తాకట్టు పెట్టి నగదు తెచ్చేది. మైలార్‌దేవ్‌పల్లి బాధితురాలి ఫిర్యాదుతో ఎస్‌వోటీ పోలీసులు దొంగబాబా దంపతుల గుట్టు రట్టు చేశారని, వారి నుంచి 1.9 కిలోల బంగారం, మహీంద్ర ఎక్స్‌యూవీ-500 కారు స్వాధీనం చేసుకున్నామని కమిషనర్‌ సజ్జనార్‌ వెల్లడించారు. చాలామంది బాధితులు ఇంకా కలశాలను తెరవనేలేదని తమ దర్యాప్తులో తేలిందన్నారు. మరోవైపు కేసుల నుంచి తప్పిస్తానంటూ బాబా నుంచి డబ్బులు దండుకున్న గాజుల రామారానికి చెందిన కిరణ్‌కుమార్‌ అలియాస్‌ మున్నా గురించి ఆరా తీస్తున్నామన్నారు.