నటుడిగా మారిన లాలూ పెద్ద కొడుకు.

పాట్నా:
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజప్రతాప్ యాదవ్ కి సినిమాపై మనసైంది. ఇన్నాళ్లూ రాజకీయాల్లో చక్రం తిప్పిన తేజప్రతాప్ తాజాగా ఒక హిందీ సినిమాలో నటిస్తున్నాడు. తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయాన్ని తేజప్రతాపే తెలియజేశాడు. రుద్ర: ద అవతార్ అనే ఈ సినిమా పోస్టర్ ని తేజప్రతాప్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఇందులో ఏవియేటర్ కళ్లజోడు పెట్టుకున్న తేజప్రతాప్ మొహం పోస్టర్ నిండుగా పరచుకుంది. అయితే సినిమాకు సంబంధించి ఇంతకు మించిన వివరాలేవీ తేజప్రతాప్ ప్రకటించలేదు. ఇంతకు ముందు కూడా తేజప్రతాప్ ఓ భోజ్ పురి సినిమాలో ముఖ్యమంత్రిగా నటించాడు. తన మాటలు, చేతలతో హఠాత్తుగా వార్తల్లోని వ్యక్తిగా నిలవడం తేజప్రతాప్ యాదవ్ కి వెన్నతో పెట్టిన విద్య. మీడియా ఫోకస్ లో ఉండేందుకు ఆయన రూటే సెపరేటు. కెమెరాలతో మీడియా వస్తే చాలు.. ఆయన చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తాడు. వేణువు వాయిస్తారు. శంఖం ఊదుతాడు. ఆవుల పాలు పితుకుతాడు. మరికాస్త మోతాదు ఎక్కువ కావాలంటే వాటికి సేవ చేస్తాడు. ఒకసారి ఆయన కృష్ణ భగవానుడి వేషంలో మురళి వాయించడం చర్చనీయాంశమైంది. తన చర్యలను సమర్థించుకొంటూ యాదవ వంశీయుడైన కృష్ణుడు తమ పూర్వీకుడని.. బృందావనంలోని ఒక కృష్ణభక్తుడు తనకు ఆ వస్త్రాలు పంపించినట్టు తేజప్రతాప్ చెప్పాడు.